CM MK Stalin : కాంగ్రెస్ రహిత కూటమి సరి కాదు
ABN, First Publish Date - 2023-03-02T02:59:49+05:30
కాంగ్రెస్ రహిత కూటమిని ఏర్పాటు చేయాలన్న కొన్ని పార్టీల ప్రయత్నం ఏ మాత్రం సరికాదని తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. కాంగ్రె్‌సతో కూడిన కూటమిదే విజయమన్నారు. మూడో ఫ్రంట్ ఏర్పాటు యత్నాలకు అర్థమే లేదని
అది ఉండే ఫ్రంట్‌కే విజయం సాధ్యం
మూడో కూటమికి అసలు అర్థమే లేదు
బీజేపీని ఓడించడమే లక్ష్యంగా
విపక్షాలన్నీ కలిసిరావాలి: స్టాలిన్
ఘనంగా ఆయన 70వ జన్మదినం
ఖర్గే, ఫరూక్, అఖిలేశ్, తేజస్వి హాజరు
జగన్, కేసీఆర్‌కు అందని ఆహ్వానం
చెన్నై, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ రహిత కూటమిని ఏర్పాటు చేయాలన్న కొన్ని పార్టీల ప్రయత్నం ఏ మాత్రం సరికాదని తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. కాంగ్రె్‌సతో కూడిన కూటమిదే విజయమన్నారు. మూడో ఫ్రంట్ ఏర్పాటు యత్నాలకు అర్థమే లేదని చెప్పారు. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా.. ప్రతిపక్షాలన్నీ కలిసి రావాలని పిలుపిచ్చారు. బుధవారం ఆయన 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, బిహార్ ఉపముఖ్యమంత్రి, ఆర్‌జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ చెన్నై తరలివచ్చారు. స్టాలిన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సాయంత్రం ఇక్కడి నందనం వైఎంసీఏ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్‌కు ఆహ్వానం లేకపోవడం గమనార్హం. సభలో స్టాలిన్ ప్రసంగిస్తూ.. వచ్చే లోక్‌సభ ఎన్నికలు కీలకమైనవని, ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నదాని కంటే ఏ పార్టీ అధికారంలోకి రాకూడదో గ్రహించి ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడే బీజేపీని ఓడించగలమన్నారు. రాష్ట్రాల్లోని రాజకీయ విభేదాలను పక్కన పెట్టాలన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత జట్టుకట్టడం ప్రాక్టికల్‌గా సాధ్యం కాదని చెప్పారు. థర్డ్ ఫ్రంట్ చర్చలకు అర్థం లేదని.. పార్టీలన్నీ అర్థం చేసుకోవాలని సూచించారు.
ప్రధాని పదవి ప్రశ్నే కాదు: ఖర్గే
విభజన శక్తులకు వ్యతిరేకంగా సమైక్య పోరాటం చేయడమే పార్టీల ప్రాథమిక లక్ష్యంగా ఉండాలని ఖర్గే సభలో చెప్పారు. ప్రతిపక్షాల తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనేది ఒక అంశమే కాదన్నారు. విపక్షాలకు ఎవరు సారథ్యం వహించాలి.. ఎవరు ప్రధాని అవ్వాలి అని తానెప్పుడూ మాట్లాడలేదని చెప్పారు. అదసలు ప్రశ్నే కాదని, దానిని పక్కనపెడదామని వేదికపై ఉన్న ఫరూక్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. విపక్షాలన్నీ ఐకమత్యంగా పోరాడాలన్నదే తమ కోరికగా పేర్కొన్నారు. డీఎంకేతో కాంగ్రెస్ పొత్తు పదిలమని, లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య బంధం మరింత పటిష్ఠమవుతుందన్నారు.
స్టాలిన్‌కు ప్రధాని చాన్సు: ఫరూక్
స్టాలిన్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఫరూక్ కోరారు. లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలన్నీ చేతులు కలిపి విజయం సాధిస్తే.. ప్రధాని అయ్యేందుకు ఆయనకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రధాని ఎవరు కావాలన్నది కాంగ్రెస్ మరచిపోవాలని.. లోక్‌సభ ఎన్నికల్లో గెలవడంపైనే ఆ పార్టీ ప్రధానంగా దృష్టి సారించాలని ఖర్గేకు సూచించారు. అఖిలేశ్, తేజస్వి కూడా ప్రసంగించారు.
Updated Date - 2023-03-02T08:48:19+05:30 IST