Tomato: టన్ను టమాటా 1.27 లక్షలు!

ABN , First Publish Date - 2023-07-15T04:51:25+05:30 IST

దేశంలో టమాటాల ధరలు పెరగడంతో రైతులకు కూడా భారీగానే గిట్టుబాటవుతోంది.

Tomato: టన్ను టమాటా 1.27 లక్షలు!

30 టన్నులను 38 లక్షలకు

అమ్మిన కన్నడ రైతు సోదరులు

కర్ణాటకలో రైతన్నలకు పండగే

కోలార్‌, జూలై 14: దేశంలో టమాటాల ధరలు పెరగడంతో రైతులకు కూడా భారీగానే గిట్టుబాటవుతోంది. కర్ణాటకలోని కోలార్‌ ప్రాంతానికి చెందిన రైతు సోదరులు 2 వేల టమాటా బాక్సుల(30 టన్నులు)ను ఏకంగా రూ.38 లక్షలకు విక్రయించారు. అంటే టన్ను టమాటాకు రూ.1.27 లక్షలు గిట్టుబాటైంది. బేతమంగళ జిల్లాకు చెందిన ప్రభాకర్‌ గుప్తా, సురేశ్‌ గుప్తాలు సోదరులు. వీరు రెండేళ్ల కిందట 15 కిలోల టమాటా బాక్సు రూ.800లకు విక్రయించగా, మంగళవారం ఏకంగా రూ.1900లకు విక్రయించారు.

వాస్తవానికి కోలార్‌ జిల్లాలో చాలా మంది రైతులు టమాటాలను పండిస్తున్నారు. వీరికి కూడా భారీగానే గిట్టుబాటు అవుతోందని చెబుతున్నారు. రైతు వెంకటరమణారెడ్డి 15 కిలోల బాక్సును రూ.2,200లకు విక్రయించినట్టు తెలిపారు. గత ఏడాది కేవలం రూ.900లకే అమ్మినట్టు చెప్పారు. ఎకరా పొలంలో టమాటా సాగు చేయగా 810 కిలోల దిగుబడి వచ్చిందన్నారు. వీటిలో 36 బాక్సులను(540 కిలోలు) ఒక్కొక్కటీ రూ.2,200 చొప్పున విక్రయించగా, మరో 18 బాక్సులను ఒక్కొక్కటీ రూ.1800 చొప్పున విక్రయించినట్టు తెలిపారు. తాజాగా ఆయనకు రూ.3.3 లక్షల వరకు లాభం వచ్చినట్టు చెప్పారు.

Updated Date - 2023-07-15T04:51:25+05:30 IST