Raghav Chadha: బీజేపీ సోషల్ మీడియా పోస్టులపై ఈసీకి 'ఆప్' ఫిర్యాదు
ABN, First Publish Date - 2023-11-20T17:09:56+05:30
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను లక్ష్యంగా చేసుకుని బీజేపీ చేస్తున్న సోషల్ మీడియా పోస్టులపై ఆమ్ ఆద్మీ పార్టీ కన్నెర్ర చేసింది. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. సీపీం పరువుకు భంగం కలిగించేలా పోస్టులు పెడుతున్నారంటూ ఈసీ దృష్టికి తెచ్చింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను లక్ష్యంగా చేసుకుని బీజేపీ చేస్తున్న సోషల్ మీడియా పోస్టులపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్నెర్ర చేసింది. ఎన్నికల కమిషన్ (Election Commission)కు ఫిర్యాదు చేసింది. సీపీం పరువుకు భంగం కలిగించేలా పోస్టులు పెడుతున్నారంటూ ఈసీ దృష్టికి తెచ్చింది. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) నేతృత్వంలో ఆ పార్టీ ప్రతినిధుల బృందం ఈసీ అధికారులను సోమవారంనాడు కలిసింది.
''సోషల్ మీడియా పోస్టులతో మా పార్టీని, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రతిష్టను దిగజార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. పరువుకు భంగం కలిగించేలా పోస్టులు ఉంటున్నాయి. బీజేపీపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరాం. రాజకీయాల్లో సైతం మంచి అభిరుచి, ప్రవర్తన ఉండాలి. వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలింగించడాన్ని బీజేపీ మానుకోవాలి. కేజ్రీవాల్‌తో పోరాడాలనుకుంటే ఎన్నికల క్షేత్రంలో ఆయనను ఎదుర్కోవాలి. సోషల్ మీడియాలో బీజేపీ చట్టపరమైన ఏ సెక్షన్‌ను ఉల్లంఘిస్తోందో కూడా ఈసీకి వివరంగా తెలియజేశాం. ఈసీ తప్పనిసరిగా చర్చలు తీసుకుంటుందనే నమ్మకం మాకు ఉంది'' అని రాఘవ్ చద్దా తెలిపారు.
అరవింద్ కేజ్రీవాల్‌ను పరిహసిస్తూ బీజేపీ ఢిల్లీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్‌లో నవంబర్ 5న పోస్ట్ చేసిన వీడియోపై ఆప్ ఫిర్యాదు చేసింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని బీజేపీ ఉల్లంఘించినట్టు పేర్కొంది. కాంగ్రెస్ సైతం బీజేపీ సోషల్ మీడియా అకౌంట్లుపై సీడీ రూపంలో సాక్ష్యాన్ని ఈసీకి సమర్పించింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా నవంబర్ 7 నుంచి నవంబర్ 30 వరకూ ఎగ్జిట్ పోల్ ఫలితాల పబ్లికేషన్‌పై ఈసీ నిషేధం విధించింది. డిసెంబర్ 3న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అన్ని ప్రధాన పార్టీలకు కీలకంగా మారాయి. సుమారు 16 కోట్ల మంది ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్టు ప్రధాన ఎన్నికల కమిషనర్ అంచనాగా ఉంది.
Updated Date - 2023-11-20T17:09:57+05:30 IST