హిందీ దేశాన్ని ఏకం చేయదు.. అమిత్ షాపై మండిపడ్డ ఉదయనిధి స్టాలిన్
ABN, First Publish Date - 2023-09-14T17:07:58+05:30
హిందీ భాష దేశాన్ని ఏకం చేస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు.
హిందీ భాష దేశాన్ని ఏకం చేస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు. హిందీ దివస్ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. హిందీ భారతీయ భాషల వైవిధ్యాన్ని ఏకం చేస్తుందని, అది వివిధ దేశ భాషలు, ప్రపంచ భాషలను, ఆయా మాండలికాలను గౌరవించిందని అమిత్ అన్నారు. హిందీ అన్ని భాషల్ని బలోపేతం చేసినందువల్లే దృఢమైన దేశానికి పునాదులు పడ్డాయని పేర్కొన్నారు.
అయితే ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా స్టాలిన్ ఎక్స్(X) అకౌంట్ లో ఈ విధంగా రాశారు. అమిత్ షా వ్యాఖ్యలు హిందీపై ఆయనకు ఉన్న ప్రేమను తెలియజేసినప్పటికీ.. హిందీ చదివితే పురోగమించవచ్చు అని గట్టిగా అరిచి చెప్పినట్లు ఉందని ఉదయనిధి ఎద్దేవా చేశారు. "తమిళనాడులో తమిళం - కేరళలో మలయాళం. హిందీ ఈ రెండు రాష్ట్రాలను ఎక్కడ కలుపుతుంది? సాధికారత ఎక్కడ వస్తుంది?" నాలుగైదు రాష్ట్రాల్లో మాట్లాడే హిందీ యావత్ దేశాన్ని ఏకం చేస్తుందని అనడం విడ్డూరంగా ఉందని మంత్రి విమర్శంచారు. ‘అమిత్ షా ప్రాంతీయ భాషలను కించపరచడం మానేయాలి’ అంటూ #StopHindiImpositionతో తన పోస్ట్‌ను ముగించారు. ఇటీవలే సనాతన ధర్మం మీద ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.
Updated Date - 2023-09-14T17:09:47+05:30 IST