Bjp: బీజేపీలో అకాలీదళ్ నేతలు.. వరుస చేరికలతో కమలనాథుల్లో జోష్...

ABN , First Publish Date - 2023-04-09T15:48:43+05:30 IST

ఈ ఏడాది పలు కీలక రాష్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం, ఆ వెనువెంటనే 2024 లోక్‌సభ ఎన్నికలు తరుముకొస్తుండటంతో ..

Bjp: బీజేపీలో అకాలీదళ్ నేతలు.. వరుస చేరికలతో కమలనాథుల్లో జోష్...

న్యూఢిల్లీ: ఈ ఏడాది పలు కీలక రాష్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం, ఆ వెనువెంటనే 2024 లోక్‌సభ ఎన్నికలు తరుముకొస్తుండటంతో దేశంలో రాజకీయ వేడి పుంజుకుంటోంది. ఈ క్రమంలో బీజేపీలో నేతల చేరికల పర్వం కొనసాగుతోంది. ప్రముఖ అకాలీదళ్ నేతలు సర్దార్ ఇందెర్ ఇక్బాల్ సింగ్ అటవాల్, సర్దార్ జస్జీత్ అటవాల్ సహా పలువురు పంజాబ్ నేతలు ఆదివారంనాడు బీజేపీ తీర్ధం తీసుకున్నారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో పలువురు పార్టీ ప్రముఖుల సమక్షంలో వీరు బీజేపీలో చేరారు. అన్నాడీఎంకే నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ మేత్రేయన్ సైతం బీజేపీలో చేరనున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

కొనసాగుతున్న చేరికలు..

కొద్దిరోజులుగా బీజేపీలో కొత్త చేరికలు ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. భారత దేశ తొలి గవర్నర్ జనరల్ సి.రాజగోపాలచారి మునిమనుమడు సీఆర్ కేశవన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి శనివారంనాడు బీజేపీలో చేరారు. దీనికి ముందు ఏప్రిల్ 6న కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోని తనయుడు అనిల్ ఆంటోని బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, వి.మురళీధరన్ సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈనెలవ 7న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చిట్టచివరి సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డి సేవలు అందించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, ఎంపీ కె.లక్ష్మణ్ సమక్షంలో ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన ఆ పార్టీలో చేరారు. లోక్‌సభ ఎన్నికలను ప్రధాన టార్గెట్‌గా భావిస్తున్న బీజేపీకి తాజా చేరికలు కొత్త ఉత్సాహాన్నిస్తోంది.

Updated Date - 2023-04-09T15:48:43+05:30 IST