BBC : ఆదాయపు పన్ను శాఖ సర్వేపై బీబీసీ స్పందన
ABN, First Publish Date - 2023-02-14T18:49:27+05:30
కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ, బీబీసీ కార్యాలయాల్లో సర్వే మాత్రమే జరుగుతోందని,
న్యూఢిల్లీ : ఆదాయపు పన్ను శాఖ (IT Department) నిర్వహిస్తున్న సర్వేపై బీబీసీ స్పందించింది. న్యూఢిల్లీ, ముంబైలలోని తమ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారని, తాము పూర్తిగా సహకరిస్తున్నామని తెలిపింది. ఈ పరిస్థితి సాధ్యమైనంత త్వరగా పరిష్కారమవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపింది.
బీబీసీ (BBC) కార్యాలయాల్లో మంగళవారం ఆదాయపు పన్ను శాఖ అధికారులు సర్వే నిర్వహించారు. ఈ సంస్థ పన్నుల ఎగవేతకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై ఈ తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలో బీబీసీ న్యూస్ ఇచ్చిన ఓ ట్వీట్‌లో, ‘‘న్యూఢిల్లీ, ముంబైలలోని బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఉన్నారు. మేం వారికి పూర్తిగా సహకరిస్తున్నాం. ఈ పరిస్థితి సాధ్యమైనంత త్వరగా పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాం’’ అని తెలిపింది.
ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)పై డాక్యుమెంటరీని బీబీసీ ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. India: The Modi Question డాక్యుమెంటరీని భారత దేశంలో అధికారికంగా ప్రసారం చేయలేదు. సామాజిక మాధ్యమాల్లో దీనిని ప్రసారం చేయవద్దని, దీనికి సంబంధించిన ట్వీట్లను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం జనవరి 21న ఆదేశించింది. 2002లో గుజరాత్‌లో జరిగిన హింసాకాండ సమయంలో అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ పాత్రపై ఈ డాక్యుమెంటరీలో చర్చించినట్లు తెలుస్తోంది. ఇది కేవలం ప్రచారాస్త్రమని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది.
ఇదిలావుండగా, కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ, బీబీసీ కార్యాలయాల్లో సర్వే మాత్రమే జరుగుతోందని, సోదాలు కాదని చెప్పారు. మరో అధికారి మాట్లాడుతూ, బీబీసీలో కొన్ని అక్రమాలు జరిగినట్లు కచ్చితమైన సమాచారం వచ్చిందని తెలిపారు. వీటి గురించి తెలుసుకోవడానికే సర్వే చేస్తున్నట్లు తెలిపారు. సర్వే పూర్తయిన తర్వాత ఉద్దేశపూర్వకమైన అక్రమాలు జరిగాయా? లేదా? అనే అంశం వెల్లడవుతుందన్నారు.
విషం చిమ్మవద్దు : బీజేపీ
బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా విలేకర్లతో మాట్లాడుతూ, భారత దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తూ, విషం చిమ్మవద్దని బీబీసీని కోరారు. బీబీసీ భారత దేశ వ్యతిరేక ప్రచారానికి పాల్పడుతోందన్నారు. విషం చిమ్మనంత వరకు ప్రతి సంస్థకు అవకాశాన్ని ఇచ్చే దేశం భారత దేశమని తెలిపారు. ఈ సర్వేపై కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టారు. తన పని తాను చేయడానికి ప్రభుత్వ సంస్థకు అవకాశం ఇవ్వాలన్నారు. లండన్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న బీబీసీ ప్రపంచంలో అత్యధిక అవినీతి నిండిన సంస్థ అని తెలిపారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కూడా బీబీసీని నిషేధించిన విషయాన్ని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలన్నారు.
బెదిరింపు చిట్కాలను ఖండిస్తున్నాం : కాంగ్రెస్
బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సర్వే నిర్వహించడం ద్వారా బెదిరింపులకు పాల్పడటాన్ని ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ పేర్కొంది. దీనినిబట్టి నరేంద్ర మోదీ ప్రభుత్వం విమర్శలకు భయపడుతోందని స్పష్టమవుతోందని పేర్కొంది.
వినాశకాలం : జైరామ్ రమేశ్
బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. మొదట బీబీసీ డాక్యుమెంటరీ వచ్చిందని, దానిని నిషేధించారని, ఇప్పుడు బీబీసీ కార్యాలయాలపై దాడులు చేస్తున్నారని ఆరోపించింది. అప్రకటిత అత్యవసర పరిస్థితి (Emergency) విధించారని దుయ్యబట్టింది. ఆ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ (Jairam Ramesh) ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘ఇక్కడ మేము అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ సంఘం చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. అక్కడ ప్రభుత్వం బీబీసీని వెంటాడుతోంది. వినాశకాలే విపరీత బుద్ధి’’ అని పేర్కొన్నారు.
టీఎంసీ స్పందన
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘బీబీసీ ఢిల్లీ కార్యాలయంలో ఆదాయపు పన్ను శాఖ అధికారుల తనిఖీలు! ఔనా, నిజమేనా?’’ అని పేర్కొన్నారు.
Updated Date - 2023-02-14T18:49:31+05:30 IST