Tihar Jail: సిసోడియా ఇక జైలుకే పరిమితమా?
ABN, First Publish Date - 2023-03-16T14:25:45+05:30
మనీశ్ సిసోడియా(Manish Sisodia)పై మరో కేసు నమోదైంది.
న్యూఢిల్లీ: దేశాన్ని కుదిపేస్తోన్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో(Delhi Liquor policy Scam) అరెస్టై తీహార్ జైళ్లో(Tihar Jail) ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా(Manish Sisodia)పై మరో కేసు నమోదైంది. ఢిల్లీ ఫీడ్‌బ్యాక్ యూనిట్‌లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సీబీఐ సిసోడియాపై కేసు నమోదు చేసింది. చట్ట వ్యతిరేకంగా ఫీడ్‌బ్యాక్ యూనిట్‌ను రూపొందించి అమలు చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు లక్షల్లో నష్టం వాటిల్లిందని సీబీఐ అభియోగాలు మోపింది. సిసోడియాతో పాటు మరో ఐదుగురిపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. సిసోడియాను ఇక జైలుకు పరిమితం చేసేందుకే మరో కేసు పెట్టారని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్(Kejriwal) ఆరోపించారు.
మరోవైపు తీహార్ జైలులో సిసోడియాకు 'భగవద్గీత' (Bhagawat Gita)ను ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. 'మెడిటేషన్ సెల్'కు అనుమతించాలని కూడా కోర్టును సిసోడియా కోరారు. సిసోడియా సీబీఐ కస్టడీ సోమవారంనాడు ముగుస్తుండటంతో ఆయనను రౌస్ ఎవెన్యూ కోర్టు ముందు మధ్యాహ్నం హాజరుపరిచారు. ఆయన కస్టడీ పొడిగింపును సీబీఐ కోరకపోవడంతో ఈనెల 20వ తేదీ వరకూ ఆయనను జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి ఎంకె నాగ్‌పాల్ ఆదేశాలిచ్చారు. వైద్య పరీక్షల్లో వైద్యులు సూచించిన మందులతో పాటు, కళ్లజోడు, డైరీ, ఒక పెన్ను, భగవద్గీత ప్రతిని సిసిడోయా తనతో తీసుకు వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. తనను మెడిటేషన్ సెల్‌లో ఉంచాలంటూ సిసోడియా చేసిన విజ్ఞప్తిని పరిశీలించాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.
ఇటు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC Kavitha)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(Enforcement Directorate) అధికారులు ఈ నెల 20న హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేశారు. వాస్తవానికి కవితను ఈ రోజు ఈడీ అరెస్ట్ చేయవచ్చని ప్రచారం జరగడంతో పలువురు తెలంగాణ మంత్రులు, ఎంపీలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకుని కవితకు మద్దతుగా నిలిచారు. ఈ నెల 11న కవిత తొలిసారి ఈడీ ఎదుట హాజరయ్యారు. కవిత సోదరుడు, మంత్రి కేటీఆర్(KTR), మరో మంత్రి హరీష్ రావు (Harish Rao) ఢిల్లీలో ఉంటూ న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపారు.
Updated Date - 2023-03-16T15:01:11+05:30 IST