George Soros : అత్యంత అరుదైన సంఘటన... బీజేపీతో ఏకీభవించిన కాంగ్రెస్...
ABN, First Publish Date - 2023-02-17T17:40:24+05:30
భారత దేశ ప్రజాస్వామ్యం, ఎన్నికల ప్రక్రియ సక్రమంగానే ఉన్నాయని బీజేపీ, కాంగ్రెస్ ముక్తకంఠంతో చెప్తున్నాయి.
న్యూఢిల్లీ : భారత దేశ ప్రజాస్వామ్యం, ఎన్నికల ప్రక్రియ సక్రమంగానే ఉన్నాయని బీజేపీ, కాంగ్రెస్ ముక్తకంఠంతో చెప్తున్నాయి. అదానీ గ్రూప్ (Adani Group) స్టాక్ మేనిపులేషన్‌కు పాల్పడిందని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) నివేదిక ఆరోపించిన నేపథ్యంలో అమెరికన్ బిలియనీర్, దాత జార్జి సొరోస్ (George Soros-92) చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. భారత దేశంలో ప్రజాస్వామిక పునరుజ్జీవం జరగాలని సొరోస్ అనడాన్ని తప్పుబట్టాయి. దేశంలో ఎన్నికల ప్రక్రియకు మద్దతు పలికాయి.
జార్జి సొరోస్ గురువారం మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ, అదానీ గ్రూప్ స్టాక్ మేనిపులేషన్‌కు పాల్పడుతోందని ఆరోపించిన హిండెన్‌బర్గ్ నివేదికతో పాటు మరికొన్ని ఆరోపణలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)ని రాజకీయంగా దెబ్బతీస్తాయన్నారు. మోదీ, అదానీ సన్నిహిత మిత్రులని పేర్కొన్నారు. వారి అదృష్టం పరస్పరం ముడిపడి ఉందని చెప్పారు. ఈ అంశంపై మోదీ మౌనంగా ఉన్నారని, విదేశీ మదుపరులు అడిగే, పార్లమెంటులో ఎదురయ్యే ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పాలన్నారు. తాను స్పష్టంగా చెప్పలేకపోయినప్పటికీ, భారత దేశంలో ప్రజాస్వామిక పునరుజ్జీవం జరుగుతుందని భావిస్తున్నానని చెప్పారు.
ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ శుక్రవారం న్యూఢిల్లీలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, భారత దేశ ప్రజాస్వామ్యం క్రూరమైనదని సొరోస్ చెప్పాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఆయన తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం మన దేశ ఆర్థిక వ్యవస్థపై విధ్వంసకర దాడి చేయాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌ను తీవ్రంగా దెబ్బతీసిన వ్యక్తి సొరోస్ అని, ఆయన ‘ఆర్థిక యుద్ధ నేరగాడు’ అని ఓ దేశం ప్రకటించిందని చెప్పారు. అటువంటి వ్యక్తి నేడు భారత దేశ ప్రజాస్వామ్యం కుప్పకూలిపోవాలని కోరుకుంటున్నారని మండిపడ్డారు. ఆయన అనేక దేశాలపై పందేలు కడతారనే సంగతి అందరికీ తెలుసునని చెప్పారు. ఆయన ఇప్పుడు భారత దేశ ప్రజాస్వామిక ప్రక్రియలలో జోక్యం చేసుకోవాలనే తన దురుద్దేశాన్ని ప్రకటించారన్నారు. తన అవసరాలకు తగినవిధంగా వంగిపోయే, లొంగిపోయే ప్రభుత్వాన్ని ఆయన కోరుకుంటున్నారన్నారు. ఆయన ఒక బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ సొమ్మును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వంటి నేతలను లక్ష్యంగా చేసుకోవడానికి సమకూర్చుతున్నట్లు ఆయన స్టేట్‌మెంట్లనుబట్టి స్పష్టమవుతోందన్నారు. మన ప్రజాస్వామ్యాన్ని క్రూరంగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్న ఈ వ్యక్తి ఆలోచనలను వ్యతిరేకించాలని ప్రతి ఒక్కరినీ, ప్రతి సంస్థను కోరారు. మన ప్రజాస్వామిక ప్రయోజనాలను బలహీనపరచేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలను తప్పుబట్టాలని పిలుపునిచ్చారు. వలసవాద కుట్రలను భారత దేశం ఓడించిందనే విషయాన్ని సొరోస్‌కు వంగిపోయి, లొంగిపోయేవారు గుర్తుంచుకోవాలన్నారు. ఇకపై కూడా ఇదే విధంగా జరుగుతుందన్నారు. భారత దేశంలో ప్రజాస్వామ్యానిదే పై చేయి అని, అదే కొనసాగుతుందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ స్పందన
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ (Jairam Ramesh) శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అనుబంధంగాగల అదానీ గ్రూప్ కుంభకోణం భారత దేశంలో ప్రజాస్వామిక పునరుజ్జీవానికి దారి తీస్తుందా? లేదా? అనేది పూర్తిగా కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలపైనా, దేశంలోని ఎన్నికల ప్రక్రియపైనా ఆధారపడి ఉంటుందన్నారు. అంతేకానీ దీనికి జార్జి సొరోస్‌తో ఎటువంటి సంబంధం లేదన్నారు.
బ్లాక్ వెడ్నస్‌డే కొలాప్స్
సొరోస్ కరెన్సీ ట్రేడింగ్ చేస్తారు. ఆయన 1992లో బ్రిటన్ పౌండ్ బలహీనపడుతున్నట్లు మాట్లాడటం ప్రారంభించడంతో ఇతర మదుపరులు కూడా పౌండ్‌కు వ్యతిరేకంగా పెందేలు కట్టారు. దీంతో 1992 సెప్టెంబరు 16న పౌండ్ విలువ కుప్పకూలింది. దీనినే బ్లాక్ వెడ్నస్‌డే కొలాప్స్ అంటారు. దీంతో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ తీవ్రంగా దెబ్బతింది. సొరోస్‌కు ఒక బిలియన్ డాలర్లు లాభం వచ్చింది.
ఇవి కూడా చదవండి :
Adani Row: మోదీని టార్గెట్ చేస్తున్న విదేశీ శక్తులు, బిలియనీర్ జార్జి సోరోస్‌పై స్మృతి ఫైర్
Hindenburg Row : హిండెన్‌బర్గ్-అదానీ వివాదంలో కేంద్రానికి గట్టి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు
Updated Date - 2023-02-17T17:40:29+05:30 IST