Congress Vs Adani : ఎల్ఐసీ నినాదాన్ని మార్చాలి : కాంగ్రెస్
ABN, First Publish Date - 2023-02-02T18:02:55+05:30
భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) నినాదాన్ని మార్చవలసిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ వ్యంగ్యంగా చెప్పింది.
న్యూఢిల్లీ : భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) నినాదాన్ని మార్చవలసిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ వ్యంగ్యంగా చెప్పింది. ‘‘జీవిత కాలం తోడుగా, మరణానంతరం కూడా’’ అనే నినాదాన్ని ఇకపై ‘‘జీవిత కాలం ఉండేదాన్ని, ఇప్పుడు అదానీకి తోడుగా ఉన్నాను’’ అని మార్చాలని పేర్కొంది. అదానీ గ్రూప్ కంపెనీలపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక నేపథ్యంలో ఈ అంశంపై చర్చించాలని పార్లమెంటులో కాంగ్రెస్ పట్టుబట్టింది.
కాంగ్రెస్ నేత పవన్ ఖేరా మాట్లాడుతూ, గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ (Narendra Modi) పని చేసిన కాలం నుంచి ఈ ఇరవయ్యేళ్ళలో చేసిన పని గుట్టు ఇప్పుడు రట్టు అయిందన్నారు. ఇది మోదీ, అదానీలకు సంబంధించిన విషయం అయితే తామంతా నిశ్శబ్దంగా ఉండేవారమన్నారు. ‘‘జీవిత కాలం తోడుగా, మరణానంతరం కూడా’’ అనే ఎల్ఐసీ నినాదాన్ని ఇకపై ‘‘జీవిత కాలం ఉండేదాన్ని, ఇప్పుడు అదానీకి తోడుగా ఉన్నాను’’ అని మార్చాలన్నారు. ఎల్ఐసీ పరిస్థితి ఇది అని తెలిపారు. అయితే ఈ అంశంపై ప్రైమ్ మెంటర్ (ప్రధాని మోదీ) మౌనంగా ఉన్నారన్నారు. ఆయన నుంచి కనీసం ఓ మాట అయినా మీరు వినలేరని చెప్పారు. ఎల్ఐసీ ఎవరిని అడిగి అదానీ వ్యాపారాల్లో పెట్టుబడులను పెంచిందని ప్రశ్నించారు.
అదానీ గ్రూప్‌పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ చేత కానీ, సుప్రీంకోర్టు చేత కానీ దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ (Jairam Ramesh) ఇచ్చిన ట్వీట్‌లో, అదానీ గ్రూప్ అంశంలో ప్రభుత్వం స్పష్టంగా ఇరుకునపడిందని ఆరోపించారు. అందుకే పార్లమెంటులో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా, ఉభయ సభలను గురువారం వాయిదా వేశారని ఆరోపించారు. అదానీ గ్రూప్‌పై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) దర్యాప్తు జరపాలన్నారు. అదానీతో ప్రభుత్వానికి ప్రత్యేక అనుబంధం ఉన్నందువల్ల ఈ దర్యాప్తు నిజంగా స్వతంత్రంగా జరుగుతుందా? లేదా? అనేది వేరే విషయమన్నారు. వీరి సంబంధాన్ని నరేంద్రదానీ అని చెప్పవచ్చునన్నారు.
Updated Date - 2023-02-02T18:03:00+05:30 IST