Modi Vs Cong, DMK, Owaisi : మోదీపై కాంగ్రెస్, డీఎంకే, ఒవైసీ ముప్పేట దాడి
ABN, First Publish Date - 2023-06-27T19:28:54+05:30
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)పై ప్రతిపక్షాలు మంగళవారం ముప్పేట దాడి చేశాయి. దేశంలోని ప్రజలందరికీ ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code -UCC) ఉండాలని మోదీ చెప్పిన కొద్ది గంటల్లోనే కాంగ్రెస్, డీఎంకే, ఏఐఎంఐఎం తీవ్రంగా స్పందించాయి.
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)పై ప్రతిపక్షాలు మంగళవారం ముప్పేట దాడి చేశాయి. దేశంలోని ప్రజలందరికీ ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code -UCC) ఉండాలని మోదీ చెప్పిన కొద్ది గంటల్లోనే కాంగ్రెస్, డీఎంకే, ఏఐఎంఐఎం తీవ్రంగా స్పందించాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దేశంలోని వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఆయన ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాయి.
మోదీ మంగళవారం మధ్య ప్రదేశ్‌లోని భోపాల్‌లో వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. అనంతరం ఆయన బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి పౌర స్మృతి (UCC)ని బూచిగా చూపుతూ ముస్లింలను కొందరు రెచ్చగొడుతున్నారన్నారు. కుటుంబంలో ఒకరి కోసం ఒక చట్టం, మరొకరి కోసం మరొక చట్టం అమలైతే, ఆ కుటుంబం సజావుగా నడవగలదా? అని ప్రశ్నించారు. ఇటువంటి ద్వంద్వ వ్యవస్థతో మన దేశం ఎలా పురోగమించగలుగుతుందని ప్రశ్నించారు. యూసీసీని తీసుకురావాలని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పిందన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల (2024 Lok Sabha elections) కోసం ప్రతిపక్షాలు ఏకమయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు ఈసారి గతం కన్నా ఎక్కువ ఆందోళనతో ఉన్నాయని దుయ్యబట్టారు. 2014లో కానీ, 2019లో కానీ బీజేపీ వ్యతిరేక పార్టీలు ఇంత తీవ్ర స్థాయిలో ఆందోళన చెందలేదన్నారు. ఈసారి శత్రువులంతా కలిసికట్టుగా వస్తున్నారన్నారు. గతంలో ఒకరిని మరొకరు దూషించుకున్నవారు, ఇప్పుడు ఒకరికి మరొకరు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారన్నారు. వారి పట్ల కోపం ప్రదర్శించవద్దని, జాలిపడాలని కోరారు. ప్రతిపక్షాలు ఇచ్చే గ్యారంటీ ‘అవినీతి’ మాత్రమేనన్నారు.
ప్రజల దృష్టిని మళ్లించడానికే..
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, దేశంలో తాండవిస్తున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదరికం గురించి మోదీ సమాధానం చెప్పాలన్నారు. ఆయన మణిపూర్ సమస్య గురించి ఎన్నడూ మాట్లాడరన్నారు. 60 రోజుల నుంచి ఆ రాష్ట్రం తగులబడుతోందన్నారు. ఈ సమస్యలన్నిటి నుంచి ప్రజల దృష్టిని ఆయన మళ్లిస్తున్నారన్నారు.
ఇప్పుడు అంత అవసరం ఏమిటి?
కాంగ్రెస్ నేత తారిక్ అన్వర్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, మోదీ పోలరైజేషన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఏ చట్టాన్ని చేసినా, అందరి కోసం రూపొందిస్తారని, దానిని ప్రతి ఒక్కరూ అనుసరించాలని అన్నారు. ఇప్పటికే ఆమోదం పొందిన బిల్లు గురించి చర్చించవలసిన అవసరం ఏముందన్నారు. మధ్య ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్నందువల్లే ఆయన దీని గురించి మాట్లాడుతున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వం దేశానికి చేసిందేమీ లేదని, అందుకే ట్రిపుల్ తలాక్, యూసీసీ వంటివాటి గురించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఆయన తొమ్మిదేళ్ల నుంచి పరిపాలిస్తున్నారని, యూసీసీని తేవాలనుకుంటే ఇంతకుముందే ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. గతంలోనే రాజకీయ పార్టీలు దీనిపై చర్చించి, తమ అభిప్రాయాలను చెప్పి ఉండేవన్నారు. కానీ మోదీ అలా చేయలేదన్నారు.
అందరి అభిప్రాయం తప్పనిసరి
జేడీయూ నేత కేసీ త్యాగి మంగళవారం మాట్లాడుతూ, ఉమ్మడి పౌర స్మృతి విషయంలో అన్ని రాజకీయ పార్టీలతోనూ, సంబంధితులందరితోనూ చర్చించాలని, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు.
మొదట హిందూ మతంలో..
డీఎంకే నేత టీకేఎస్ ఇలంగోవన్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఉమ్మడి పౌర స్మృతిని మొదట హిందూ మతంలో ప్రవేశపెట్టాలన్నారు. ఎస్సీ, ఎస్టీలతో సహా ప్రతి వ్యక్తి దేశంలోని ఏ దేవాలయంలోనైనా పూజలు చేయడానికి అనుమతించాలన్నారు. రాజ్యాంగం ప్రతి మతానికి రక్షణ కల్పించినందువల్ల యూసీసీ తమకు అక్కర్లేదన్నారు. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని, ప్రభుత్వం ఆ హక్కుల ఉల్లంఘనకు పాల్పడకూడదని చెప్పారు.
ట్రిపుల్ తలాక్ గురించి..
మోదీ మంగళవారం ట్రిపుల్ తలాక్ గురించి కూడా మాట్లాడారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే పార్టీలు ఆర్థికంగా, సాంఘికంగా వెనుకబడిన ముస్లింల హక్కులను తిరస్కరిస్తున్నారని, వారిని పట్టించుకోవడం లేదని, నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. యూసీసీని తీసుకురావాలని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పిందన్నారు. ట్రిపుల్ తలాక్‌కు అనుకూలంగా మాట్లాడేవారు ముస్లిం ఆడబిడ్డలకు తీరని అన్యాయం చేస్తున్నారని మోదీ అన్నారు. ట్రిపుల్ తలాక్ వల్ల కేవలం ఆడబిడ్డలకు మాత్రమే కాకుండా, వారి కుటుంబాలకు కూడా అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ విధానం ఇస్లాంలో అతి ముఖ్యమైన భాగం అయి ఉంటే, దానిని కతార్, జోర్డాన్, ఇండోనేషియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ఎందుకు నిషేధించారో చెప్పాలన్నారు. ప్రతిపక్ష పార్టీలు యూసీసీని సాకుగా చూపించి, రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందుతున్నాయనే విషయాన్ని ముస్లింలు గ్రహించాలని పిలుపునిచ్చారు.
దీనిపై స్పందిస్తూ ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో, ట్రిపుల్ తలాక్‌పై నిషేధం ఉందని మోదీ చెప్పారని, ఆయన పాకిస్థానీ చట్టం నుంచి ఎందుకు ప్రేరణ పొందారని ప్రశ్నించారు. ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా చట్టం చేసినప్పటికీ, క్షేత్ర స్థాయిలో ఎటువంటి మార్పు లేదన్నారు. మహిళలను దోపిడీ చేయడం మరింత పెరిగిందన్నారు. చట్టాల ద్వారా సాంఘిక సంస్కరణలు జరగవని తాము ఎప్పుడూ చెప్తున్నామన్నారు. చట్టం చేయాలనుకుంటే, పెళ్లి నుంచి పారిపోయే పురుషులకు వ్యతిరేకంగా చేయాలన్నారు.
ఇవి కూడా చదవండి :
Putin Offer: వాగ్నర్ గ్రూప్ సైనికులకు పుతిన్ ఇచ్చిన ఆఫర్ ఏమిటంటే...?
Opposition unity : ప్రతిపక్షాల ఐక్యతపై మోదీ వ్యాఖ్యలు
Updated Date - 2023-06-27T19:34:31+05:30 IST