Jaishankar Vs Congress : కేంద్ర మంత్రి జైశంకర్‌కు దీటైన కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్
ABN, First Publish Date - 2023-01-29T14:21:07+05:30
చైనా విషయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విరుచుకుపడిన విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanyam Jaishankar)కు
న్యూఢిల్లీ : చైనా విషయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విరుచుకుపడిన విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanyam Jaishankar)కు ఆ పార్టీ ఘాటుగా సమాధానం చెప్పింది. జైశంకర్ శనివారం మాట్లాడుతూ, చైనా 1962లో భారత భూభాగాన్ని ఆక్రమించుకుందని, అయితే అది నిన్ననే ఆ భూమిని ఆక్రమించుకుందంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం చీఫ్ పవన్ ఖేరా స్పందిస్తూ, 1962లో జరిగినదానికి, గత నాలుగేళ్ళ నుంచి జరుగుతున్నదానికి చాలా తేడా ఉందన్నారు.
రాహుల్ గాంధీ (Rahul Gandhi) 2022 సెప్టెంబరులో మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఎటువంటి పోరాటం లేకుండా చైనాకు 100 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఇచ్చేశారని, దానిని తిరిగి ప్రభుత్వం ఏ విధంగా స్వాధీనం చేసుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు.
జైశంకర్ రాసిన పుస్తకం ‘ది ఇండియా వే’ పుస్తకం మరాఠీ అనువాదం ‘భారత్ మార్గ్’ ఆవిష్కరణ మహారాష్ట్రలోని పుణేలో శనివారం జరిగింది. ఈ సందర్భంగా ‘ప్రశ్న-జవాబు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఒకరు మాట్లాడుతూ, చైనా గురించి మాట్లాడటానికి మన దేశంలో రాజకీయ నేతలకు ధైర్యం ఉండటం లేదని అన్నారు. దీనిపై జైశంకర్ స్పందిస్తూ, ప్రతిపక్ష పార్టీల్లో కొందరు నేతలకు అటువంటి ఆలోచనా ధోరణి ఉందన్నారు. దీనిని అర్థం చేసుకోవడం కష్టమని చెప్పారు. ‘‘వారికి ఆత్మవిశ్వాసం ఎందుకు లేదు? వారు ఎందుకు ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు? చైనా గురించి తప్పుడు వార్తలను ఎందుకు వ్యాపింపజేస్తున్నారు? అని మీరు నన్ను అడిగితే, ఈ ప్రశ్నలకు నేను ఎలా జవాబు చెప్పగలను? వారు కూడా రాజకీయాలు చేస్తున్నారని నాకు తెలుసు. నిజం కాదని తెలిసినప్పటికీ, ఉద్దేశపూర్వకంగా అటువంటి వార్తలను వ్యాపింపజేస్తున్నారు’’ అని చెప్పారు.
‘‘కొన్నిసార్లు వారు 1962లో చైనా తీసుకున్న భూమి గురించి మాట్లాడతారు. కానీ వారు మీకు నిజాలు చెప్పరు. ఇది నిన్ననే జరిగిందనే అభిప్రాయం కలిగిస్తారు’’ అని చెప్పారు.
జైశంకర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం చీఫ్ పవన్ ఖేరా స్పందిస్తూ, 1962లో జరిగినదానికి, గత నాలుగేళ్ళ నుంచి జరుగుతున్నదానికి చాలా తేడా ఉందన్నారు. 1962లో ఎంతో పోరాటం తర్వాత భారత దేశం తన భూమిని కోల్పోయిందన్నారు. కానీ ఈసారి మాత్రం మన భూభాగాన్ని ఆక్రమించుకున్నవారికి క్లీన్ చిట్ ఇచ్చామన్నారు.
Updated Date - 2023-01-29T14:21:13+05:30 IST