ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Modi Surname Case : రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరటపై కాంగ్రెస్ తొలి స్పందన

ABN, First Publish Date - 2023-08-04T16:14:55+05:30

సుప్రీంకోర్టు తాత్కాలిక ఆదేశాల నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్లమెంటుకు హాజరయ్యేందుకు మార్గం సుగమం కావడంతో ఆ పార్టీ సంబరాలు చేసుకుంటోంది. ‘‘వస్తున్నా.. ప్రశ్నలు కొనసాగుతాయి’’ అంటూ ఆయన ఫొటోతో ఆ పార్టీ ట్వీట్ చేసింది.

Rahul Gandhi

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు తాత్కాలిక ఆదేశాల నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్లమెంటుకు హాజరయ్యేందుకు మార్గం సుగమం కావడంతో ఆ పార్టీ సంబరాలు చేసుకుంటోంది. ‘‘వస్తున్నా.. ప్రశ్నలు కొనసాగుతాయి’’ అంటూ ఆయన ఫొటోతో ఆ పార్టీ ట్వీట్ చేసింది. ‘మోదీ ఇంటి పేరు’ కేసులో ఆయన దోషి అని సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం తాత్కాలికంగా నిలిపేసిన సంగతి తెలిసిందే.

దొంగలందరి ఇంటి పేరు మోదీ ఎలా అవుతోందని రాహుల్ గాంధీ 2019లో కర్ణాటకలో జరిగిన బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. దీనిపై పూర్ణేశ్ మోదీ గుజరాత్‌లోని సూరత్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. కోర్టు గాంధీని దోషిగా తీర్పు చెప్తూ, ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. గుజరాత్ హైకోర్టులో కూడా రాహుల్ గాంధీకి ఉపశమనం లభించలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన దోషి అని గుజరాత్‌లోని సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును తాత్కాలికంగా నిలిపేస్తూ సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన పార్లమెంటులో తన గళాన్ని వినిపించే అవకాశం మళ్లీ రాబోతోంది. దీనికి సంబంధించిన ప్రకటన లోక్ సభ సచివాలయం నుంచి రావలసి ఉంది. ఆయన కేరళలోని వయనాద్ నుంచి ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే.

సుప్రీంకోర్టులో ఉపశమనం లభించడంతో కాంగ్రెస్ ఎక్స్ (ట్విటర్) వేదికగా హర్షం వ్యక్తం చేసింది. ‘‘వస్తున్నా.. ప్రశ్నలు కొనసాగుతాయి’’ అంటూ, రాహుల్ గాంధీ ఫొటోతో ఓ ట్వీట్ చేసింది. ఈ ఫొటోలో పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఫొటోను రాహుల్ కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంటులో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అదానీ-హిండెన్‌బర్గ్ వివాదం సమయంలో ఆయన ఈ ఫొటోను ప్రదర్శించి, మోదీని నిలదీశారు. కాంగ్రెస్ ఇచ్చిన మరో ట్వీట్‌లో, విద్వేషంపై ప్రేమ విజయం సాధించిందని, సత్యమే గెలుస్తుందని తెలిపింది.


కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా ఇచ్చిన ట్వీట్‌లో, గౌతమ బుద్ధుని సూక్తిని ప్రస్తావించారు. మూడు విషయాలు ఎంతో కాలం మరుగున పడవని, అవి : సూర్యుడు, చంద్రుడు, సత్యం అని తెలిపారు. న్యాయమైన తీర్పు ఇచ్చినందుకు సర్వోన్నత న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలిపారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇచ్చిన ట్వీట్‌లో, సత్యమే గెలుస్తుందన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని మనసారా స్వాగతిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, భారత దేశంలోని సామాన్యులు విజయం సాధించారన్నారు. వయనాద్ లోక్ సభ నియోజకవర్గ ప్రజలు విజయం సాధించారన్నారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా బీజేపీ కుట్ర బయటపడిందని చెప్పారు. సామాన్యుల గర్జన మళ్లీ ప్రజాస్వామిక దేవాలయంలో ప్రతిధ్వనిస్తుందని చెప్పారు. రాహుల్ సత్యం, ధైర్య, సాహసాలకు చిరునామాగా మారారన్నారు. మోదీ ప్రభుత్వం, బీజేపీ నేతలు తమకు ప్రజా తీర్పు ఎందుకు వచ్చిందో గుర్తుంచుకుని పని చేయాలన్నారు. మోదీ ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకోవడంలో దశాబ్దం నుంచి విఫలమవుతున్నారని దుయ్యబట్టారు. ప్రజల ప్రశ్నలపై పోరాటం పార్లమెంటులోనూ, రోడ్లపైనా కొనసాగుతుందని తెలిపారు.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ఇచ్చిన ట్వీట్‌లో, బీజేపీ యంత్రాంగం అవిశ్రాంతంగా కృషి చేసినప్పటికీ, రాహుల్ గాంధీ లొంగిపోలేదన్నారు. కేవలం న్యాయ వ్యవస్థపైనే నమ్మకం పెట్టుకున్నారని తెలిపారు. ఇది బీజేపీకి, దాని తాబేదారులకు ఓ గుణపాఠం అన్నారు. ‘‘మీరు చేయగలిగినంత చెడు చేసినప్పటికీ, మేం వెనుకడుగు వేసేది లేదు. ఓ ప్రభుత్వంగా, ఓ పార్టీగా మీ వైఫల్యాలను ఎండగట్టడం నిరంతరం కొనసాగిస్తాం. రాజ్యాంగ ఆదర్శాలను బలపరచడాన్ని, మీరు ధ్వంసం చేయాలనుకుంటున్న వ్యవస్థలను నమ్మడాన్ని కొనసాగిస్తాం’’ అని స్పష్టం చేశారు.


కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇచ్చిన ట్వీట్‌లో, న్యాయం జరిగిందని, ప్రజా గళాన్ని ఎవరూ అణచివేయలేరని చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పుడు ఇక లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇప్పుడు యావత్తు దేశం, ప్రపంచం సభాపతివైపు చూస్తోందన్నారు. రాహుల్ గాంధీని లోక్ సభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటిస్తూ జారీ చేసిన ప్రకటనను రద్దు చేయాలన్నారు. తమకు, దేశానికి కావలసినది అదేనని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల నకలును లోక్ సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి అధికారికంగా స్పీకర్ ఓం బిర్లాకు అందజేసి, రాహుల్‌పై విధించిన అనర్హతను తొలగించాలని కోరుతారని తెలిపారు.

కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జీవాలా ఇచ్చిన ట్వీట్‌లో, న్యాయం జరిగిందని, ప్రజాస్వామిక మండపంలో సత్యం గర్జన మళ్లీ వినిపిస్తుందని తెలిపారు.

సోమవారం నుంచి పార్లమెంటుకు?

రాహుల్ గాంధీ సోమవారం నుంచి పార్లమెంటుకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు తాత్కాలిక ఆదేశాల నేపథ్యంలో ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు, ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను తొలగిస్తున్నట్లు లోక్ సభ సచివాలయం ఓ ప్రకటనను జారీ చేయవలసి ఉంటుంది.

ఇదిలావుండగా, లక్ష ద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్‌కు ఓ క్రిమినల్ కేసులో పదేళ్ళ జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును కేరళ హైకోర్టు నిలిపేసింది, హైకోర్టు ఆదేశాలు వెలువడిన రెండు నెలల తర్వాత ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ లోక్ సభ సచివాలయం ఆదేశాలు ఇచ్చింది.

మరోవైపు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంపై చర్చ మంగళవారం నుంచి ప్రారంభం కాబోతోంది. రాహుల్ గాంధీ సోమవారం నుంచి లోక్ సభకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈసారి మరింత పదునైన ప్రశ్నలతో రాహుల్ విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయి.


ఇవి కూడా చదవండి :

Gyanvapi : జ్ఞానవాపిలో ఏఎస్ఐ సర్వే ప్రారంభం.. బహిష్కరించిన ముస్లిం పక్షం..

Kedarnath yatra : కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో విరిగిపడిన కొండచరియ.. శిథిలాల్లో 10 మంది చిక్కుకున్నట్లు ఆందోళన..

Updated Date - 2023-08-04T16:14:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising