I.N.D.I.A : ప్రతిపక్ష కూటమి పేరు నిర్ణయం వెనుక జరిగిన కథ
ABN, First Publish Date - 2023-07-19T14:56:50+05:30
ప్రతిపక్షాల కూటమికి ఇండియా (Indian National Developmental Inclusive Alliance) పేరును నిర్ణయించడం వెనుక చాలా కసరత్తు జరిగింది. ఎన్డీయే వర్సెస్ ఇండియాగా రానున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ పేరును సూచించారు.
న్యూఢిల్లీ : ప్రతిపక్షాల కూటమికి ఇండియా (Indian National Developmental Inclusive Alliance) పేరును నిర్ణయించడం వెనుక చాలా కసరత్తు జరిగింది. ఎన్డీయే వర్సెస్ ఇండియాగా రానున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ పేరును సూచించారు. దీనిపై ప్రతిపక్ష నేతలతో చర్చించారు. అందరి నుంచి సమ్మతి పొందిన తర్వాత దీనిని అధికారికంగా ప్రకటించారు.
ప్రతిపక్ష కూటమికి ఇండియా అనే పేరును పెట్టడాన్ని బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ మొదట్లో అంగీకరించలేదని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ తెలిపిన వివరాల ప్రకారం, రాహుల్ గాంధీకి సన్నిహితుడు, ఆ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అనేకమంది ప్రతిపక్ష నేతలతో ఇండియా పేరు గురించి చర్చించారు. టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్‌తో కూడా మాట్లాడారు. ఈ పేరును మమత బెనర్జీ ప్రతిపాదించిన తర్వాత అనేక సలహాలు వచ్చాయి. I.N.D.I.Aలో NDA అనే అక్షరాలు ఉన్నాయని, ఈ రెండు పేర్లూ ఒకే విధంగా కనిపిస్తున్నాయని నితీశ్ చెప్పారు. ఇండియా మెయిన్ ఫ్రంట్ లేదా ఇండియా మెయిన్ అలయెన్స్ అని ప్రతిపక్షాల కూటమికి పేరు పెట్టాలని నితీశ్ సూచించారు. సేవ్ ఇండియా అలయెన్స్ అని పేరు పెట్టాలని వీసీకే సూచించింది. వామపక్ష పార్టీల నేతలు కూడా ‘సేవ్ ఇండియా అలయెన్స్’ లేదా ‘వుయ్ ఫర్ ఇండియా’ అని పేరు పెట్టాలని సూచించారు. ఈ నేపథ్యంలో నితీశ్ I.N.D.I.A పేరుపై అంగీకారం తెలిపారు. చర్చోపచర్చల అనంతరం ఈ పేరుపై అన్ని పార్టీలు అంగీకారానికి వచ్చాయి.
ఇండియా వర్సెస్ ఎన్డీయే అనే భావాన్ని ప్రజల్లో ప్రతిపక్షాలు సృష్టించాలని రాహుల్ గాంధీ చెప్పారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 2024 సాధారణ ఎన్నికల్లో మోదీ వర్సెస్ ఇండియా యుద్ధం జరుగుతుందన్నారు.
ఇదిలావుండగా, I.N.D.I.A పేరుపై బీజేపీ విమర్శలు గుప్పించడంతో, ప్రతిపక్ష కూటమి ఈ పేరుకు ఓ ట్యాగ్‌లైన్‌ను తగిలించింది. I.N.D.I.A అని పెడుతూ, జీతేగా భారత్ (భారత్ గెలుస్తుంది) అనే ట్యాగ్‌లైన్‌ను పెట్టింది. పేరుకు హిందీ ట్యాగ్‌లైన్ ఉండాలని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సూచించినట్లు తెలుస్తోంది.
ప్రతిపక్షాల తదుపరి సమావేశం ముంబైలో జరుగుతుంది. దీనికి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన వర్గం ఆతిథ్యం ఇవ్వబోతోంది. ప్రచార కార్యకలాపాల నిర్వహణ కోసం ఢిల్లీలో సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి.
ప్రతిపక్ష కూటమి పేరును ఇండియా అని ప్రకటించిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఎన్డీయే కూటమిని ‘‘నవ భారతం, అభివృద్ధి చెందిన దేశం, భారతీయుల ఆకాంక్షలు’’ అని వర్ణించారు.
ఇవి కూడా చదవండి :
Terror Plot : బెంగళూరులో భారీ ఉగ్ర దాడుల కుట్ర భగ్నం
Updated Date - 2023-07-19T14:56:50+05:30 IST