Maharashtra : మహారాష్ట్ర ప్రభుత్వంపై చిదంబరం వినూత్న వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-07-13T11:01:25+05:30
మహారాష్ట్రలోని బీజేపీ-శివసేన-ఎన్‌సీపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ప్రభుత్వాన్ని పరిశీలించినపుడు, మూడు కాళ్ల జంతువు 100 మీటర్ల పరుగు పందెంలో పరుగెడుతున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ : మహారాష్ట్రలోని బీజేపీ-శివసేన-ఎన్‌సీపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ప్రభుత్వాన్ని పరిశీలించినపుడు, మూడు కాళ్ల జంతువు 100 మీటర్ల పరుగు పందెంలో పరుగెడుతున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీని ఆయన సమీప బంధువు అజిత్ పవార్ చీల్చి, తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన సంగతి తెలిసిందే.
పీ చిదంబరం బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు మాట్లాడుతూ, తమది ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వమని చెప్తున్నారన్నారు. అయితే తనకు మాత్రం ఇది మూడు కాళ్ల జంతువు 100 మీటర్ల పరుగు పందెంలో పరుగు పెడుతున్నట్లు కనిపిస్తోందన్నారు.
మహారాష్ట్రలో తొమ్మిది మంది మంత్రులకు పోర్టుఫోలియోలను కేటాయించలేదని, వారికి పని లేదని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సహా 20 మంది మంత్రుల్లో ఏ ఒక్కరూ తన పోర్టుఫోలియోను వదులుకోవడానికి ఇష్టపడటం లేదన్నారు. తొమ్మిది మంది కొత్త మంత్రులు పోర్టుఫోలియోలు లేని మంత్రులుగా కొనసాగుతారని ప్రకటించడమే దీనికి పరిష్కారమని తెలిపారు. మంత్రులయ్యేందుకే తొమ్మిది మంది కొత్తవారు ప్రభుత్వంలో చేరారన్నారు. పోర్టుఫోలియోలున్న మంత్రులవాలని వారు కోరుకున్నట్లు ఎవరు చెప్పారని ప్రశ్నించారు.
ఎన్‌సీపీని అజిత్ పవార్ చీల్చిన సంగతి తెలిసిందే. ఆయన ఈ నెల 2న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన వర్గంలోని ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ, ఇప్పుడు డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి ట్రిపుల్ ఇంజిన్ వచ్చిందన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందన్నారు. ఇప్పుడు రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారని, రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందడానికి ఇది దోహదపడుతుందని చెప్పారు.
శివసేన (యూబీటీ), శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ, కాంగ్రెస్ కలిసి మహా వికాస్ అగాడీ కూటమిగా కొనసాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి :
Floods : యమునా నదిలో వరద ఉద్ధృతి.. కేజ్రీవాల్ నివాసం వద్ద బీభత్సం..
Haryana : ఎమ్మెల్యే చెంప పగులగొట్టిన వరద బాధితురాలు
Updated Date - 2023-07-13T11:01:25+05:30 IST