Journalist Soumya Case: ఢిల్లీలో జర్నలిస్ట్ సౌమ్య దారుణ హత్య.. 15 ఏళ్ల తర్వాత ఆ ఐదుగురిని దోషులుగా తేల్చిన కోర్టు
ABN , First Publish Date - 2023-10-18T18:46:10+05:30 IST
2008లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో ఢిల్లీ కోర్టు బుధవారం కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులను కోర్టు..

2008లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో ఢిల్లీ కోర్టు బుధవారం కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులను కోర్టు దోషులుగా పేర్కొంది. రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జీత్ మల్లిక్, అక్షయ్ కుమార్‌లను హత్య, దోపిడీ అభియోగాలపై దోషులుగా నిర్ధారించిన న్యాయస్థానం.. వారికి సహాయం చేసినందుకు అజయ్ సేఠిని 411 MCOCA కింద దోషిగా తేల్చింది. అక్టోబర్ 26వ తేదీన ఈ దోషులకు విధించే శిక్షపై కోర్టులో చర్చ జరగనుంది.
హత్య రోజు ఏం జరిగింది?
అది 2008 సెప్టెంబర్ 30వ తేదీ. ఎప్పట్లాగే జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ తన విధులను నిర్వర్తించి.. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆఫీస్ నుంచి తన ఇంటికి బయలుదేరింది. వసంత్ విహార్ ప్రాంతానికి చేరుకున్నప్పుడు.. ఆ నిందితులు ఆమె కారుని అడ్డుకొని, దోపిడీకి యత్నించారు. అనంతరం ఆమెపై కాల్పులు జరిపి, అక్కడి నుంచి పరారయ్యారు. ఉదయాన్నే ఆ కారులో స్థానికులు మృతదేహాన్ని గుర్తించి.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తొలుత ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించి ఉండొచ్చని పోలీసులు భావించారు. అయితే.. పోస్టుమార్టం రిపోర్ట్‌లో ఆమె తలకు బుల్లెట్ గాయమైనట్లు తేలడంతో.. హత్యగా నిర్ధారించి విచారణ చేపట్టారు.
పోలీసులు ఎలా నిందితుల్ని పట్టుకున్నారు?
తమ దర్యాప్తులో భాగంగా పోలీసులు.. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. అప్పుడు పోలీసులకు ఓ కీలక విషయం తెలిసింది. ఆమె కారును మరో వాహనం అనుసరిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ సీసీటీవీ దృశ్యాల ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. ఎట్టకేలకు 2009లో ఆ ఐదుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. సౌమ్యని హత్య చేయడం వెనుక గల కారణాలేంటని వారిని విచారించగా.. దోపిడీ కోసమే ఈ హత్య చేసినట్లు వాళ్లు అంగీకరించారు. అంతే తప్ప మరో కోణం లేదని పోలీసులు తేల్చారు. అప్పటినుంచి ఈ కేసుపై సుదీర్ఘ విచారణ కొనసాగగా.. తాజాగా కోర్టు వారిని దోషులుగా తేల్చుతూ తీర్పునిచ్చింది.
ఈ కేసులో మరో ఊహించని కోణం
ఆ ఐదుగురు నిందితుల్లో బల్జీత్ మాలిక్, రవి కపూర్, అమిత్ శుక్లాలు 2009లోనూ జిగిషా ఘోష్ అనే ఐటీ ప్రొఫోషనల్‌ను హత్య చేశారు. ఈ కేసులో ఆ ముగ్గురు అరెస్ట్ అయ్యి.. జీవిత ఖైదును అనుభవిస్తున్నారు. జిగిషా హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకోగా.. జర్నలిస్ట్ సౌమ్యను హత్య చేసింది కూడా ఆ ఆయుధంతోనే తెలుసుకోగలిగారు. ఆ విధంగా సౌమ్య కేసుని పోలీసు అధికారులు ఛేధించగలిగారు. మరోవైపు.. సౌమ్య తల్లి తన కూతురిని హతమార్చిన ఆ నిందితులను జీవితఖైదు విధించాలని డిమాండ్ చేస్తున్నారు.