Fadnavis Uddhav: ఏం జరగనట్లే ముచ్చటించుకున్న ఫడ్నవీస్, ఉద్ధవ్
ABN, First Publish Date - 2023-03-23T17:44:08+05:30
తమ మధ్య ఏ విభేదాలూ లేవన్నట్లే దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ థాకరే ముచ్చటించుకుంటూ కనపడటంతో షాక్ అవడం చూసేవారి వంతయింది.
ముంబై: మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో రాజకీయ పరిశీలకులు కూడా ఊహించలేరు. నిన్నటిదాకా బీజేపీ-ఉద్ధవ్ శివసేన(Shiv Sena) వర్గం ఉప్పు-నిప్పులా ఉంది. మహారాష్ట్ర బీజేపీ సీనియర్ నేత, డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Maharashtra Deputy Chief Minister Devendra Fadnavis)కు, ఉద్ధవ్ శివసేన వర్గం అధినేత ఉద్ధవ్ థాకరేకు(Uddhav Thackeray) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. రెండు పార్టీల నాయకులు పరస్పరం విమర్శలు, ప్రతి విమర్శలతో ఊగిపోయేవారు. అయితే ముంబైలో నేడు భిన్న దృశ్యం ఆవిష్కృతమైంది. దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ థాకరే నవ్వులు చిందిస్తూ పలకరించుకున్నారు. తమ మధ్య ఏ విభేదాలూ లేవన్నట్లే ముచ్చటించుకుంటూ కనపడటంతో షాక్ అవడం చూసేవారి వంతయింది.
2019లో మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (Maharashtra Assembly Elections 2019) శివసేన బీజేపీ పొత్తులో సీట్లు పంచుకుని అధికారం చేపట్టేందుకు కావాల్సిన స్థానాలు సంపాదించారు. బీజేపీకి ఎక్కువ స్థానాలు రావడంతో బాల్ థాకరే సమయంలోనే కుదిరిన పాత ఫార్ములా ప్రకారం ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తే వారికే ముఖ్యమంత్రి పీఠమనే విషయానికి ఉద్ధవ్ తిలోదకాలిచ్చారు. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి మహావికాస్ అఘాడి ఏర్పాటు చేసుకుని రెండున్నరేళ్లు మహారాష్ట్ర సీఎంగా కొనసాగారు. అయితే హిందుత్వ సిద్ధాంతాలపై ఉద్ధవ్ రాజీ పడటంతో ఆయన భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. గత ఏడాది జూన్‌లో మెజార్టీ శివసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు శివసేన ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) జట్టులో చేరిపోయారు. సీఎం పదవి కోల్పోవడంతో పాటు ఉద్ధవ్ ఒంటరివారైపోయారు. ఏక్‌నాథ్ షిండే సీఎం అయ్యారు. దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు.
నాటి నుంచీ బీజేపీ-శివసేన శిండే వర్గాన్ని ఉద్ధవ్ టార్గెట్ చేస్తూ వచ్చారు. వీధి పోరాటాలకూ దిగారు. దీంతో బీజేపీ-శివసేన శిండే-శివసేన ఉద్ధవ్ వర్గాల మధ్య పూర్తిగా చెడిందనే అంతా అనుకుంటున్నారు. ఇంతలోనే దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర విధానసభలో నవ్వుకుంటూ ముచ్చటించుకోవడం చూసి అంతా వేలేసుకున్నారు. మరాఠీ భాష విభాగానికి సంబంధించి కార్యక్రమంలో వీళ్లిద్దరి కెమిస్ట్రీ చూసి అంతా చెవులు కొరుక్కున్నారు.
ప్రస్తుతానికి ఒకరికొకరు పడనట్లే బయటకు కనపడుతున్న బీజేపీ-శివసేన శిండే-శివసేన ఉద్ధవ్ వర్గాలు 2024 ఎన్నికల నాటికి ఏకమైనా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని రాజకీయ పరిశీలకులంటున్నారు.
Updated Date - 2023-03-23T17:56:18+05:30 IST