Tamil Nadu : సైనికుడి హత్య కేసులో డీఎంకే కౌన్సిలర్ అరెస్ట్
ABN, First Publish Date - 2023-02-17T15:06:59+05:30
భారత సైన్యం (Indian Army)లో లాన్స్‌నాయక్‌గా పని చేస్తున్న ప్రభు (Prabhu)ను దారుణంగా కొట్టి, గాయపరచి, ఆయన మరణానికి
చెన్నై : భారత సైన్యం (Indian Army)లో లాన్స్‌నాయక్‌గా పని చేస్తున్న ప్రభు (Prabhu)ను దారుణంగా కొట్టి, గాయపరచి, ఆయన మరణానికి కారకుడైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎంకే (DMK) కౌన్సిలర్ చిన్నసామి (Chinnasamy)ని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వాటర్ ట్యాంక్ వద్ద బట్టలు ఉతకడం విషయంలో జరిగిన ఘర్షణ ఈ దారుణానికి దారి తీసింది. కృష్ణగిరిలో జరిగిన ఈ దారుణ సంఘటనపై బీజేపీ (BJP) పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
తమిళనాడు పోలీసుల కథనం ప్రకారం, లాన్స్‌నాయక్ ప్రభు, డీఎంకే కౌన్సిలర్ చిన్నసామి ఫిబ్రవరి 8న పోచంపల్లి ప్రాంతంలో చెరువు వద్ద బట్టలు ఉతికే విషయంలో ఘర్షణపడ్డారు. ఆ రోజు రాత్రి చిన్నసామి, మరో తొమ్మిది మంది కలిసి ప్రభుపైనా, ఆయన సోదరుడు ప్రభాకరన్‌పైనా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రభు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. చిన్నసామి పరారయ్యాడు. ఆయనను గురువారం అరెస్ట్ చేశారు.
బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు కే అణ్ణామలై (K Annamalai) మీడియాతో మాట్లాడుతూ, భారత సైన్యంలో పని చేస్తున్న సైనికుడు సెలవుల్లో గడిపేందుకు తన స్వగ్రామానికి వచ్చారన్నారు. ఆయనపై డీఎంకే కౌన్సిలర్ దాడి చేశారన్నారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేయడానికి పోలీసులకు ఆరు, ఏడు రోజులు పట్టిందన్నారు. ఇది దీనిని జాతీయ స్థాయి వివాదాంశంగా మార్చిందని చెప్పారు. సత్వరం చర్య తీసుకోవడంలో విఫలమైన పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెన్నైలోని యుద్ధ స్మారకం వద్ద తాము నిరసన, నిరాహార దీక్ష చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు కూడా పాల్గొంటారని తెలిపారు. ద్రావిడ రాజకీయాల్లో సైనికులకు తగిన గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు. వారిని పరాయివారిగా చూస్తున్నారని మండిపడ్డారు.
గూండాయిజం ఆందోళనకరం : ఖుష్బూ
ప్రభును డీఎంకే కౌన్సిలర్ చిన్నసామి హత్య చేశారని ఆరోపిస్తూ, చిన్నసామికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు గురువారం కృష్ణగిరిలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ నేత ఖుష్బూ సుందర్ (Khusbhu Sundar) ఇచ్చిన ట్వీట్‌లో, తమిళనాడులో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. తన రాష్ట్రంలో గూండాయిజం, శాంతిభద్రతలు విఫలమవడం చాలా ఆందోళనకరంగా ఉందని తెలిపారు.
చిన్న ఘర్షణ : డీఎంకే
ఇదిలావుండగా, ఈ హత్యను స్థానికంగా జరిగిన ఓ చిన్న సంఘటనగా ప్రచారం చేయడానికి డీఎంకే ప్రయత్నించిందనే ఆరోపణలు వస్తున్నాయి. డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇళంగోవన్ మాట్లాడుతూ, ఓ హత్య జరిగిందని, దానిపై పోలీసులు చర్య తీసుకున్నారని చెప్పారు. ఇది స్థానికంగా జరిగిన సంఘటన అన్నారు. చిన్న ఘర్షణ జరిగిందని, అది హత్యకు దారి తీసిందని చెప్పారు. దీనిలో ప్రమేయం ఉన్నవారినందరినీ అరెస్టు చేసినట్లు తెలిపారు.
ప్రభు భార్య ఆవేదన...
మృతుడు ప్రభు భార్య మీడియాతో మాట్లాడుతూ, ఈ దాడిలో తన భర్త క్రింద పడిపోయారని, తన భర్త కనీసం మంచినీళ్లు అయినా తాగలేదని చెప్పారు. ఆయనను తాము కావేరిపట్టినమ్‌లోని ఆసుపత్రిలో చేర్పించామన్నారు.
దోషులను శిక్షించాలి : ప్రభాకరన్
మృతుడు ప్రభు సోదరుడు ప్రభాకరన్ కూడా సైనిక జవానే. ప్రభాకరన్ మీడియాతో మాట్లాడుతూ, తన సోదరుడిని హత్య చేసినవారిని శిక్షించే వరకు తాను తిరిగి సైన్యంలోకి వెళ్లబోనని చెప్పారు. తాము ఎటువంటి తప్పు చేయలేదన్నారు. తాను 13 ఏళ్ళ నుంచి సైన్యంలో పని చేస్తున్నానని తెలిపారు. ఓ నెల సెలవుపై ఇక్కడికి వచ్చామని, ఇంత దారుణం జరిగిందని చెప్పారు. ‘‘నువ్వు భారత సైన్యంలో పని చేస్తుండవచ్చు, కానీ నన్ను నువ్వు ఏమీ చేయలేవు’’ అని చిన్నసామి తనతో అన్నాడని తెలిపారు. తన సోదరుడు మరణించాడని, తన సోదరునికి ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పారు.
ఘర్షణ జరిగిన రోజును గుర్తు చేసుకుంటూ, ఆరోజు ఉదయం 10 గంటలకు తాము బట్టలు తీసుకుని, వాటర్ ట్యాంక్ వద్దకు వెళ్లామని చెప్పారు. అప్పటికే చాలా మంది బట్టలు ఉతుక్కునేందుకు అక్కడ ఉన్నారని తెలిపారు. డీఎంకే కౌన్సిలర్ చిన్నసామి అక్కడికి వచ్చి, మిగిలినవారిని ఏమీ అనకుండా, అక్కడి నుంచి బట్టలను తీసేయాలని గట్టిగా తమకు చెప్పారన్నారు. తాను సరేనన్నానని తెలిపారు. తాను తన తల్లితో మాట్లాడుతూ, చాలా మంది ఇక్కడే కార్లు కడుక్కుంటున్నారు, బట్టలు ఉతుక్కుంటున్నారు కదా, మనం కూడా ఇక్కడ బట్టలు ఉతుక్కుంటే ఏమిటి సమస్య? అని అడిగానని చెప్పారు. అప్పుడు చిన్నసామి తనను దూషించడం ప్రారంభించాడని తెలిపారు. తనను కొట్టేందుకు ఆయన తన చెప్పును ఊడదీశాడన్నారు. అప్పుడు ఇరుగు పొరుగువారు అక్కడికి చేరుకుని, ఇరువురిని శాంతపరిచారని తెలిపారు.
ఆ రాత్రి ఏం జరిగిందంటే...
‘‘ఆరోజు రాత్రి మా నాన్నగారు, ఆయన స్నేహితుడు మాట్లాడుకుంటుండగా, చిన్నసామి వచ్చి, మా నాన్నగారిని లాగడం ప్రారంభించాడు. అప్పుడు మా నాన్నగారు నాతో మాట్లాడుతూ, ప్రభును లోపలికి తీసుకెళ్లు అన్నారు. నేను, ప్రభు కలిసి లోపలికి వెళ్ళబోతుండగా, చిన్నసామి మా నాన్నగారి తలపై కత్తితో పొడిచాడు. వెంటనే మా నాన్నగారు క్రిందపడిపోయారు. ఆయన తల నుంచి రక్తం కారుతోంది. నేను ఆయన దగ్గరికి వెళ్ళబోయాను. అప్పుడు చిన్నసామితో కలిసి వచ్చిన ఆరుగురు నన్ను పట్టుకుని, దూరంగా లాక్కెళ్లిపోయారు. నా సోదరుడి తల వెనుక భాగంలో గట్టిగా కొట్టారు. ఆయన స్పృహ కోల్పోయాడు. అయినప్పటికీ, వారు ఆయనను కొడుతూనే ఉన్నారు. ఆయన నుదుటిపై కూడా కత్తితో పొడిచారు’’ అని ప్రభాకర్ చెప్పారు.
రాజకీయ కోణం లేదు : పోలీస్ సూపరింటెండెంట్
ఈ హత్య కేసులో రాజకీయ కోణం ఉందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సరోజ్ కుమార్ ఠాకూర్ మాట్లాడుతూ, ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ప్రభు మరణం వెనుక రాజకీయ కోణం లేదన్నారు. ఇది కేవలం ఓ దాడి కేసు మాత్రమేనన్నారు. ప్రభు, చిన్నసామి, ఇతర నిందితులు రక్తసంబంధీకులేనని తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు చిన్నసామి అని తెలిపారు. చిన్నసామి పెద్దన్నయ్య పేరు నాడు రామసామి అని, ఆయన కుమార్తె కణ్ణమ్మల్ మృతుడు ప్రభుకు తల్లి అని చెప్పారు.
ఈ దాడి సంఘటనలో రాజకీయ కోణం లేదన్నారు. రాజకీయ పార్టీల సభ్యులెవరూ దీనిలో లేరని చెప్పారు. ఓ చిన్న వాటర్ ట్యాంక్ వద్ద ఈ ఘర్షణ జరిగిందని తెలిపారు. ప్రభాకర్, ఆయన తల్లి కణ్ణమ్మల్‌లతో చిన్నసామి ఘర్షణ పడ్డాడని తెలిపారు. అదే రోజు రాత్రి చిన్నసామి, ఆయన బంధువులు కలిసి ప్రభు, ప్రభాకరన్, వారి తండ్రి మధయ్యన్లపై దాడిచేశారన్నారు. ఈ కేసులో నిందితులందరినీ అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఇది దాడి కేసు అని, దీనిలో రాజకీయ కోణం లేదని, వదంతులను ప్రచారం చేసేవారిపై కచ్చితంగా విచారణ జరుపుతామని చెప్పారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే విధంగా అన్ని రకాలుగా సాయపడతామని చెప్పారు.
ఇవి కూడా చదవండి :
Adani Row: మోదీని టార్గెట్ చేస్తున్న విదేశీ శక్తులు, బిలియనీర్ జార్జి సోరోస్‌పై స్మృతి ఫైర్
Varasudu OTT Streaming: అధికారికంగా స్ట్రీమింగ్ డేట్‌ని ప్రకటించిన ఓటీటీ.. ఎప్పుడు, ఎక్కడంటే..
Updated Date - 2023-02-17T15:07:04+05:30 IST