తెలంగాణ నుంచి వచ్చిన 350 మంది రుత్వికులతో ఆ మాజీ సీఎం చేసిన యాగం ఏంటో తెలుసా...
ABN , First Publish Date - 2023-03-05T12:04:38+05:30 IST
రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సభలు, యాత్రలు కొనసాగిస్తున్న రాజకీయ నాయకులు ఆల
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సభలు, యాత్రలు కొనసాగిస్తున్న రాజకీయ నాయకులు ఆలయాల సందర్శనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోవైపు యాగాలు, హోమాలు చేసేందుకు నేతలు ఏర్పాటు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి(Former CM Kumaraswamy) రామనగర జిల్లా బిడదిలోని ఆయన తోటలో ఆయత చండీయాగం నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఆయత చండీయాగంతోపాటు మహారుద్ర స్వాహాకార యాగాలు ప్రారంభించారు. ఈ యాగం తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) కొనసాగించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కుమారస్వామి మరోసారి సీఎం కావాలనే ఆశయంతోనే ఆయత చండీయాగాన్ని జరుపుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ నుంచి 350 మందికిపైగా రుత్వికులు వచ్చారు. మహారాష్ట్ర, కర్ణాటక(Maharashtra, Karnataka)తోపాటు మరికొందరు రుత్వికులు, వారి సహాయకులు భాగస్వామ్యులయ్యారు. కేసీఆర్ జరిపించిన యాగం తరహాలోనే ఇక్కడ కొనసాగుతోంది. కుటుంబ సభ్యులు కొందరు ఆప్తులకు మాత్ర మే యాగం జరిగే ప్రదేశానికి అవకాశం కల్పించారు. కుమారస్వామి, ఆయన అన్న రేవణ్ణ కుటుంబీకులతోపాటు పార్టీ ముఖ్యులు భోజేగౌడ, ఎంసీ అశ్వథ్‌లు పాల్గొన్నారు. ఆయత చండీయాగంలో 10,100 సార్లు దుర్గా సప్తశతి పారాయణం, దుర్గా సప్తశతి 13 అధ్యాయాలు, 700 మంత్రాలను నిరంతరంగా పఠిస్తారు. 350 మంది రుత్వికుల్లో ఒక్కొక్కరు రోజుకు మూడుసార్లు పారాయణం, ప్రతిరోజూ 11 యజ్ఞకుండలిలో దశాంశ హోమాలు చేస్తారు. యాగాల విషయమై కుమారస్వామి మాట్లాడుతూ పంచరత్న రథయాత్ర విజయవంతమైన తరుణంలోనే తండ్రి దేవెగౌడ ఆరోగ్యం కోసం యాగాలు చేస్తున్నామన్నారు. 350 మందికి పైగా రుత్వికులు పాల్గొంటున్నారని, వరుసగా 9రోజులపాటు పారాయణ ఉంటుందన్నారు.