Earthquake: చెన్నైలోని ఆ రెండు ప్రాంతాల్లో కంపించిన భూమి.. మెట్రో రైల్ భూగర్భ పనులే కారణమా?
ABN , First Publish Date - 2023-02-23T08:50:05+05:30 IST
చెన్నై(Chennai)లో బుధవారం ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. ఇటీవల తుర్కియాలో భూకంపం సృష్టించిన ప్రళయంతో భయభ్రాంతులకు

పెరంబూర్(చెన్నై): చెన్నై(Chennai)లో బుధవారం ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. ఇటీవల తుర్కియాలో భూకంపం సృష్టించిన ప్రళయంతో భయభ్రాంతులకు లోనైన నగర ప్రజలు.. స్వల్ప కంపనలకే బెంబేలెత్తిపోయారు. ఈ విషయం మీడియాలో ప్రసారం కాగానే పలువురు తమ ఇళ్లు వదిలి బయటకు పరుగులు తీశారు. బుధవారం ఉదయం 12 గంటల ప్రాంతంలో అన్నానగర్, అన్నాసాలై(Annanagar, Annasalai) ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఈ విషయాన్ని గ్రహించిన ఆయా ప్రాంతాల ప్రజలు ఇళ్లు, కార్యాలయాలు వదిలి బయటకు పరుగులు తీశారు. ఈ విషయమై చెన్నై మండల వాతావరణ పరిశోధన కేంద్రం అధికారి బాలచంద్రన్ మాట్లాడుతూ... చెన్నైలో భూప్రకంపనల వార్తలపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. మరికొందరు చెన్నైలో జరుగుతున్న మెట్రోరైల్ భూగర్భ పనుల కారణంగా భూమి కంపించిందంటూ సామాజిక మాధ్యమాల్లో దుమ్మెత్తిపోశారు. దీనిపై చెన్నై మెట్రోరైల్(Chennai Metrorail) లిమిటెడ్ (సీఎంఆర్‌ఎల్) వివరణ ఇచ్చింది. మాధవరం గ్రీవెన్స్ రోడ్డు తదితర ప్రాంతాల్లో మాత్రమే మెట్రోరైలు సొరంగమార్గం తవ్వకం పనులు జరుగుతున్నాయని, ప్రస్తుతం ప్రకంపనలు వచ్చినట్లు చెబుతున్న ప్రాంతాల్లో తాము ఎలాంటి పనులు చేయడం లేదని స్పష్టం చేసింది. ఏది ఏమైనప్పటికీ బుధవారం నగరంలో ప్రకంపన వార్తలు కొద్దిసేపు ఆందోళన రేకెత్తించాయి.