Farooq Abdullah: శంకరాచార్య తర్వాత రాహులే...
ABN, First Publish Date - 2023-01-20T19:26:10+05:30
రాహుల్ గాంధీ సారథ్యంలోని భారత్ జోడో యాత్ర చివరి మజిలీగా కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో అడుగుపెట్టడంతో..
లఖన్‌పూర్: రాహుల్ గాంధీ (Rahul Gandhi) సారథ్యంలోని భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) చివరి మజిలీగా కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో అడుగుపెట్టడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. అటు ఇతర పార్టీల నేతల నుంచి రాహుల్‌పై ప్రశంసలు మొదలయ్యాయి. తాజాగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమమూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) స్వయంగా రాహుల్ గాంధీని త్రిమతాచార్యుల్లో ఒకరు, అద్వైత సిద్ధాంతకర్త ఆది శంకరాచార్యతో పోల్చారు.
లఖన్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్‌ను శంకరాచార్యతో ఫరూక్ అబ్దుల్లా పోల్చారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ యాత్ర జరిపిన శంకరాచార్యుల తర్వాత మళ్లీ ఆ యాత్ర జరిపిన తొలి వ్యక్తి రాహులేనని ప్రశంసించారు. ''శతాబ్దాల క్రితం శంకరాచార్యుల వారు ఇక్కడకు వచ్చారు. అప్పట్లో రోడ్లు లేవు. ఇదంతా అడవి. నడుచుకుంటూ శంకరాచార్య ఇక్కడకు వచ్చారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌కు పాదయాత్రతో చేరుకున్న రెండో వ్యక్తి రాహుల్ గాంధీ'' అని అన్నారు. భారతదేశాన్ని ఐక్యంగా ఉంచడమే రాహుల్ యాత్ర ఉద్దేశమని చెప్పారు. ''భారత్‌లో విద్వేషం సృష్టిస్తున్నారు. మతాలను ఉసిగొలుపుతున్నారు. గాందీ, రామ్ ఇండియాలో అందరూ కలిసిమెలిసి ఉండేవారు. ఈ యాత్ర (భారత్ జోడో) ఇండియాను ఐక్యంగా ఉంచేందుకు జరుగుతున్న ప్రయత్నం. దీని శత్రువులు దేశానికి, మానవత్వానికి, ప్రజలకు కూడా శత్రువులే'' అని అన్నారు.
కాగా, గతంలోనూ రాహుల్ గాంధీని రాముడితో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సల్మా్న్ ఖుర్షీద్ పోల్చారు. రాహుల్ అతీతశక్తులున్న వ్యక్తి అనీ, గట్టకట్టించే చలిలో టీ-షర్ట్‌తో యాత్రలో పాల్గొంటారని, ఆయన ఒక యోగి అని అన్నారు. రామపాదుకలను మోసుకెళ్లిన భరతుడిలా పార్టీ కార్యకర్తలు పాదుకులు తీసుకుని ఉత్తరప్రదేశ్ వెళ్తున్నారని చెప్పారు. రాముడు కూడా వస్తాడంటూ రాహుల్ యూపీ పర్యటన విశేషాలు చెబుతూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం, రాహుల్ గాంధీ యాత్ర జమ్మూకశ్మీర్‌లోని కతువాలో జరుగుతోంది. ఫరూక్ అబ్దుల్లా, శివసేన నేత సంజయ్ రౌత్, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ, ఎన్‌సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా తదితరులు వివిధ ప్రాంతాల్లో రాహుల్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొంటున్నారు.
Updated Date - 2023-01-20T19:26:42+05:30 IST