Former Chief Minister: అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.10 వేల ప్రోత్సాహకం

ABN , First Publish Date - 2023-02-01T10:31:59+05:30 IST

రాష్ట్రంలో జేడీఎస్‌ అధికారంలోకి వస్తే రైతులను పూర్తిగా రుణవిముక్తులను చేస్తామని మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి(Forme

Former Chief Minister: అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.10 వేల ప్రోత్సాహకం

- అన్నదాతలకు జేడీఎస్‌ నేత కుమారస్వామి భరోసా

బెంగళూరు, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జేడీఎస్‌ అధికారంలోకి వస్తే రైతులను పూర్తిగా రుణవిముక్తులను చేస్తామని మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి(Former Chief Minister HD Kumaraswamy) ప్రకటించారు. కొప్పళ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం పంచరత్న రథయాత్ర సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కుష్టగి నియోజకవర్గ జేడీఎస్‌ అభ్యర్థి తుకారాంను ప్రజలకు పరిచయం చేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలోని 51 ఉపనదులను రైతుల పొలాల్లోకి తరలించేందుకు తన వద్ద ఓ అద్భుతమైన పథకం సిద్ధంగా ఉందన్నారు. తాను యాత్రల సందర్భంగా చేస్తున్న హామీలన్నీ చిత్తశుద్ధితో అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వ తరహాలో రైతుబంధు పథకాన్ని అమలులోకి తెస్తామన్నారు. ప్రతి ఎకరాకు రూ.10వేల ప్రోత్సాహ ధనం ప్రభుత్వమే ఇస్తుందని, వీటితో రైతులు ఎంచక్కా నాణ్యమైన విత్తనాలు, ఎరువులను ఇష్టం వచ్చిన చోట కొనుగోలు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. నిరుపేదలకు రూ.5 లక్షలకే ఇంటిని ఇస్తామని, ఇందుకయ్యే మిగతా ఖర్చు ప్రభుత్వం భరిస్తుందన్నారు. ఎల్‌కేజీ నుంచి పీయూసీ వరకు ఉచిత విద్య అందిస్తామన్నారు. పూర్తి మెజారిటీతో ఒకసారి తమకు అవకాశం ఇచ్చి చూడాలని యాత్రల సందర్భంగా ప్రజలకు విన్నవించుకున్నారు.

Updated Date - 2023-02-01T10:32:01+05:30 IST