Godse Son of India remarks: గాడ్సే భరతమాత సుపుత్రుడైతే...మరి వీరప్పన్, దావూద్ ఎవరు?
ABN, First Publish Date - 2023-06-10T15:32:59+05:30
మహాత్మాగాంధీ హంతకుడు నాథూరామ్ గాడ్సేను భరతమాత సుపుత్రునిగా కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఈ జేడీయూ పార్టీ నేత నీరజ్ కుమార్ ఘాటుగా స్పందించారు. గాడ్సే భరతమాత పుత్రుడైతే వీరప్పన్, దావూద్ ఇబ్రహీం, విజయ్ మాల్యాలను ఏమనాలని ఎద్దేవా చేశారు.
పాట్నా: వివాదాస్పద వ్యాఖ్యలతో తరచు వార్తల్లో ఉండే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ (Giriraj Singh) మరోసారి తన వ్యాఖ్యలతో విపక్షాల విమర్శలు ఎదుర్కొన్నారు. మహాత్మాగాంధీ హంతకుడు నాథూరామ్ గాడ్సేను (Nathuram Godse) భరతమాత సుపుత్రునిగా (Son of India) గిరిరాజ్ సింగ్ ఇటీవల అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై బీహార్‌లో అధికార జేడీయూ పార్టీ నేత నీరజ్ కుమార్ ఘాటుగా స్పందించారు. గాడ్సే భరతమాత పుత్రుడైతే వీరప్పన్ వంటి బందిపోట్లు, దావూద్ ఇబ్రహీం వంటి అజ్ఞాత నేర ప్రపంచ నేత, ఆర్థిక నేరాలకు పాల్పడి తప్పించుకుని తిరుగుతున్న విజయ్ మాల్యాలను ఏమనాలని ఎద్దేవా చేశారు. దేశానికి గాడ్సే తలవంపులు తెచ్చారని, భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆయనను ఆరాధిస్తుందని అన్నారు.
''గాడ్సే, వీరప్పన్, దావూద్, మాల్పాలు బీజేపీకి ఇష్టులు. కానీ, షహీద్ భగత్ సింగ్, అష్పకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్, ప్రఫుల్ల చాకి వంటి యోధులే నిజమైన భరతమాత పుత్రులు'' అని నీరజ్ కుమార్ అన్నారు. బీహార్‌కు చెందిన బీజేపీ ఫైర్‌బ్రాండ్ నాయకుడు గిరిరాజ్ సింగ్ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో శుక్రవారంనాడు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గాడ్సేను భరతమాత సుపుత్రినిగా అభివర్ణించారు. మహాత్ముడి హంతకుడు మొగల్ పాలకులైన బాబర్, ఔరంగజేబ్ తరహాలో ఆక్రమణదారు కాదని, ఈ గడ్డపై పుట్టినవాడని అన్నారు. బాబర్, ఔరంగజేబుల వారసుల్లా భావించేవారు భరతమాతకు నిజమైన పుత్రులు కాదన్నారు. ''ఒకవేళ అతడు (గాడ్సే) గాంధీ హంతకుడైతే, అతడు భరతమాత సుపుత్రుడు కూడా'' అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై నీరజ్ కుమార్ స్పందిస్తూ, ఔరంగజేబ్, షాజహాన్, అక్బర్‌లు ఈ గడ్డపైనే పుట్టారని, బీజేపీ తప్పనిసరిగా చరిత్ర చదవాలని, చరిత్రను వక్రీకరించరాదని అన్నారు.
మండిపడిన కపిల్ సిబల్
గాడ్సేపై గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ సైతం తప్పుపట్టారు. ఇండియాలో పుట్టిన ఎవరు హత్య చేసినా అతను భరతమాత సుపుత్రుడుగా అయిపోతాడా? గిరిరాజ్ అభిప్రాయం ప్రకారం గాడ్సే సుపుత్రుడా? అని నిలదీశారు. "బ్రిటిషర్లకు సాయం చేసేందుకు ఆర్ఎస్ఎస్ ముందుకు వచ్చింది. అలాంటి వారు గాంధీని ఎందుకు గుర్తిస్తారు? మహాత్మాగాంధీ సిద్ధాంతాలను వ్యతిరేకించే వారు ఈ మైండ్‌సెట్‌తోనే ఉంటారు'' అని సిబల్ అన్నారు.సు
Updated Date - 2023-06-10T15:37:15+05:30 IST