Governor RN Ravi: గెటవుట్ రవి
ABN , First Publish Date - 2023-01-11T02:10:47+05:30 IST
తమిళనాట డీఎంకే సర్కారు, గవర్నర్ ఆర్.ఎన్.రవి మధ్య వివాదం మరింత ముదురుతోంది.

గవర్నర్‌కు వ్యతిరేకంగా
తమిళనాట వెలసిన పోస్టర్లు
దానిపై స్టాలిన్ ఫొటో..
ట్విటర్ ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్
రాజ్‌భవన్ ముట్టడికి పార్టీల పిలుపు
తాడోపేడో అంటున్న డీఎంకే సర్కారు
గవర్నర్‌కు వ్యతిరేకంగా తమిళనాట పోస్టర్లు
దానిపై స్టాలిన్ ఫొటో.. ట్విటర్‌లో హాష్‌ట్యాగ్ ట్రెండింగ్
చెన్నై, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): తమిళనాట డీఎంకే సర్కారు, గవర్నర్ ఆర్.ఎన్.రవి మధ్య వివాదం మరింత ముదురుతోంది. అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా ప్రసంగాన్ని మార్చి చదివిన తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత పెల్లుబుకుతోంది. అసెంబ్లీ ప్రసంగంలో ద్రావిడ నేతలైన పెరియార్, అన్నాదురై, కరుణానిధి, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్, మాజీ ముఖ్యమంత్రి కామరాజర్ వంటి నేతల పేర్లు ఉచ్ఛరించకుండా వదిలేసిన గవర్నర్‌పై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ‘గెటవుట్ రవీ’ అంటూ రాష్ట్రంలో పలు చోట్ల పోస్టర్లు వెలిశాయి. డీఎంకే నేతల పేర్లతో వెలసిన ఈ పోస్టర్లలో సాక్షాత్తూ సీఎం స్టాలిన్ ఫొటోలు దర్శనమివ్వడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ట్విటర్‌లో ట్రెండ్ అవుతున్న ‘గెటవుట్ రవి’ యాష్‌ట్యాగ్‌తో ఈ బ్యానర్లు వెలిశాయి. సామాజిక మాధ్యమాల్లోనూ ఈ పోస్టర్లు హల్‌చల్ చేస్తున్నాయి. కొన్ని తమిళవాద సంస్థలు మంగళవారం గవర్నర్‌కు వ్యతిరేకంగా పలు చోట్ల ధర్నాలు చేపట్టాయి. ‘దళిత్ పాంథర్స్ ఆఫ్ ఇండియా’ (డీపీఐ), సీపీఎం వంటి పార్టీలు రాజ్‌భవన్ ముట్టడికి పిలుపునిచ్చాయి. మరోవైపు, సోమవారం అసెంబ్లీలో జరిగిన ఘటనలపై కేంద్రప్రభుత్వానికి గవర్నర్ నివేదించినట్లు తెలిసింది.
అసెంబ్లీలో తనకు వ్యతిరేకంగా సీఎం తీర్మానం చేయడం, తను అసెంబ్లీని వదిలి వస్తుండగా ఎమ్మెల్యేలు హేళన చేయడం వంటి ఘటనలన్నింటినీ ఆయన నివేదికలో పొందుపరిచారు. అంతేకాకుండా, అసెంబ్లీలో తను చేసిన ప్రసంగం రికార్డుల్లో ఉండేలా గవర్నర్ చర్యలకు దిగారు. ఇందుకోసం ఆయన మంగళవారం న్యాయనిపుణులతో సుదీర్ఘంగా మంతనాలు జరిపినట్లు తెలిసింది. కోయంబత్తూరులో గవర్నర్ రవి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా, బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. అలాగే, పుదుకోట వంటి ప్రాంతాల్లో గవర్నర్‌ను అభినందిస్తూ బీజేపీ కార్యకర్తలు పోస్టర్లు వేశారు. ఇదిలా ఉండగా, రాజ్‌భవన్‌లో సంక్రాంతి వేడుకల ఆహ్వానపత్రికలో ‘తమిళనాడు గవర్నర్’కు బదులుగా ‘తమిళగ గవర్నర్’ అని ముద్రించడం మరో వివాదానికి కారణమైంది.