Governor: గవర్నర్ సంచలన వ్యాఖ్యలు.. ఆ మాజీ మంత్రులపై విచారణ కొనసాగుతోంది కదా! ఇంకేంటి..
ABN , First Publish Date - 2023-07-07T07:45:08+05:30 IST
అన్నాడీఎంకే మాజీ మంత్రులపై న్యాయవిచారణ జరిపేందుకు అనుమతి జారీ చేయలేదంటూ న్యాయశాఖ మంత్రి రఘుపతి చేసిన ఆరోపణల
చెన్నై, (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే మాజీ మంత్రులపై న్యాయవిచారణ జరిపేందుకు అనుమతి జారీ చేయలేదంటూ న్యాయశాఖ మంత్రి రఘుపతి చేసిన ఆరోపణలను రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి(State Governor RN Ravi) ఖండించారు. ఈమేరకు ఆయన గురువారం సాయంత్రం ఒక ప్రకటన జారీ చేశారు. మాజీ మంత్రులు డాక్టర్ సి.విజయభాస్కర్, బీవీ రమణ, కేసీ వీరమణి, ఎంఆర్ విజయభాస్కర్‌పై దాఖలైన అవినీతి, అక్రమార్జన కేసులపై న్యాయస్థానాల్లో విచారణ జరిపేందుకు గవర్నర్ అనుమతి జారీ చేయకుండా కాలయాపన చేస్తున్నారంటూ న్యాయశాఖ మంత్రి రఘుపతి బుధవారం మీడియా సమావేశంలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ మాజీ మంత్రుల అవినీతిపై న్యాయవిచారణ జరిపేందుకు గవర్నర్ అనుమతించలేదనడం అవాస్తవమని రాజ్‌భవన్ ప్రకటన విడుదల చేసింది. మాజీ మంత్రులు బీవీ రమణ, డాక్టర్ సి.విజయభాస్కర్‌పై నమోదైన కేసులపై సీబీఐ(CBI) విచారణ కొనసాగుతోందని, ఈ కేసులు న్యాయపరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు. ఇక మాజీ మంత్రి కేసీ వీరమణి కేసుకు సంబంధించి విజిలెన్స్ విచారణకు తగిన ఆధీకృత దర్యాప్తు నివేదికను రాష్ట్రప్రభుత్వం సమర్పించాల్సి ఉందని తెలిపారు. రవాణా శాఖ మాజీ మంత్రి ఎంఆర్ విజయభాస్కర్ కేసుకు సంబంధించి రాజ్‌భవన్‌కు ఎలాంటి ప్రతిపాదన రాలేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలా వుండగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయమంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆర్‌ఎన్ రవిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.