Share News

Governor: గవర్నర్‌ ఢిల్లీ పయనం.. 2 రోజులు అక్కడే మకాం

ABN , First Publish Date - 2023-10-20T11:32:57+05:30 IST

రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి(Governor R.N. Ravi) గురువారం ఆకస్మికంగా హస్తినకు బయలుదేరివెళ్ళారు. రెండు రోజుల

Governor: గవర్నర్‌ ఢిల్లీ పయనం.. 2 రోజులు అక్కడే మకాం

- అధికారికంగా ప్రకటించని రాజ్‌భవన్‌

అడయార్‌(చెన్నై): రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి(Governor R.N. Ravi) గురువారం ఆకస్మికంగా హస్తినకు బయలుదేరివెళ్ళారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే బసచేయనున్నారు. ఈ పర్యటన పూర్తిగా ఆయన వ్యక్తిగతమైనదిగా తెలుస్తోంది. అంతే కాకుండా గవర్నర్‌ ఢిల్లీ పర్యటనపై రాజ్‌భవన్‌ వర్గాలు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.. గత మంగళవారం ఆయన బెంగుళూరు(Bengaluru) వెళ్ళారు. అక్కడ నుంచి హైదరాబాద్‌ వెళ్ళి.. బుధవారం సాయంత్రానికి నగరానికి చేరుకున్నారు. మళ్ళీ గురువారం ఉదయం ఏడు గంటలకు ఆయన చెన్నై నుంచి ఢిల్లీకి విమానంలో బయలుదేరి వెళ్ళారు. గత కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుంది. విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల నియామకంలో జాప్యం, నీట్‌ రద్దు ముసాయిదా బిల్లును ఆమోదించకపోవడం, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా సనాతన ధర్మానికి అనుకూలంగా వ్యాఖ్యానించడం, సత్‌ప్రవర్తన ఆధారంగా ఖైదీలను రిలీజ్‌ చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను పెండింగ్‌లో ఉంచడం ఇలా అనేక విషయాలపై గవర్నర్‌ ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండా, నాన్చుడు ధోరణిని అవలంభిస్తున్నారని డీఎంకే పాలకులు విమర్శిస్తున్నారు. అదేసమయంలో గవర్నర్‌ను రీకాల్‌ చేయాలని అన్నాడీఎంకే, బీజేపీ మినహా తక్కిన అన్ని పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్‌ రవి ఢిల్లీ ఆకస్మిక పర్యటనపై ఇపుడు చర్చ సాగుతోంది. మరోవైపు, ఈ పర్యటనలో ఆయన కేంద్ర హోం శాఖామంత్రి అమిత్‌ షాతో పాటు మరికొందరు మంత్రులను కలుసుకుంటారని తెలుస్తోంది.

Updated Date - 2023-10-20T11:32:57+05:30 IST