HD Kumaraswamy: కుమారస్వామి అక్రమంగా విద్యుత్‌ని దొంగలించారన్న కాంగ్రెస్.. సారీ చెప్పిన మాజీ ముఖ్యమంత్రి
ABN , First Publish Date - 2023-11-14T16:44:59+05:30 IST
Karnataka Power: కర్ణాటక రాష్ట్రంలో ‘విద్యుత్’ విషయంపై రాజకీయ పార్టీల మధ్య నెలకొన్న వివాదం అంతా ఇంతా కాదు. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో.. మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఒక విషయంలో అడ్డంగా దొరికిపోవడంతో...
కర్ణాటక రాష్ట్రంలో ‘విద్యుత్’ విషయంపై రాజకీయ పార్టీల మధ్య నెలకొన్న వివాదం అంతా ఇంతా కాదు. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో.. మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఒక విషయంలో అడ్డంగా దొరికిపోవడంతో, కాంగ్రెస్ ఆయనపై విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. దీపావళి సందర్భంగా జేపీ నగర్‌లోని తన నివాసాన్ని అలంకార దీపాలతో వెలిగించేందుకు.. కుమారస్వామి అక్రమంగా విద్యుత్‌ను లాక్కున్నారని మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఎక్స్ వేదికపై ఒక వీడియోని కూడా షేర్ చేసింది.
‘‘ప్రపంచంలోనే అత్యంత నిజాయితీపరుడైన హెచ్‌డీ కుమారస్వామికి చెందిన నివాసం.. విద్యుత్ స్తంభం నుండి నేరుగా అక్రమ విద్యుత్ కనెక్షన్‌తో అలంకార దీపాలతో వెలిగిపోయింది. ఒక మాజీ ముఖ్యమంత్రి విద్యుత్‌ని దొంగలించేంత పేదరికంలో మగ్గిపోతుండడం నిజందా దురదృష్టకరం’’ అని కాంగ్రెస్ ఆయనపై విరుచుకుపడింది. కుమారస్వామిని మరింత విమర్శిస్తూ.. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘గృహ జ్యోతి’ పథకం కింద రెసిడెన్షియల్ కనెక్షన్‌ల కోసం నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందిస్తోందని.. 2,000 యూనిట్లు కాదని తెలిపింది. ‘‘మీరు నిజంగా అంత పేదరికంలో ఉంటే, మీరు గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసి ఉండాల్సింది. ఓహ్.. గృహజ్యోతి పథకం కింద ఒక విద్యుత్ మీటర్ మాత్రమే అనుమతించబడుతుందని మీకు తెలియదు కదా! మీ పేరుపై చాలా మీటర్లు ఉన్నాయి’’ అంటూ కుమారస్వామిపై కౌంటర్ ఎటాక్ చేసింది.
రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉన్నప్పటికీ రైతులకు ఏడు గంటల కరెంట్ ఇచ్చేలా చర్యలు తీసుకున్నామని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ‘‘మరీ ఇంత చౌకబారు దొంగతనానికి పాల్పడేంత ‘కరువు’ను మీరు ఎదుర్కొంటున్నారా? కర్ణాటక అంధకారంలో ఉందని మీరే మీడియా సమావేశం నిర్వహించి చెప్పిన విషయం మర్చిపోయారా?’’ అంటూ కాంగ్రెస్ ఆయన్ను నిలదీసింది. ఇప్పుడేమో దొంగ కరెంటుతో మీ ఇంటిని వెలిగించుకున్నారంటూ కాంగ్రెస్ ధ్వజమెత్తింది. ‘‘మీ ఇల్లు అలంకార కాంతులతో మెరిసిపోతుంటే, కర్ణాటక అంధకారంలో ఉందని ఎందుకు చెబుతున్నారు’’ అని ప్రశ్నించింది. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ.. ఈ వ్యవహారంపై బెస్కామ్ (BESCOM) చర్యలు తీసుకుంటుందని, అయితే కుమారస్వామిపై కేసు నమోదు చేస్తారో లేదో తనకు తెలియదని అన్నారు.
కుమారస్వామి స్పందన?
కాంగ్రెస్ తనపై దాడి చేసిన తరుణంలో కుమారస్వామి వెంటనే స్పందించారు. ఇది తన తప్పు కాదని, ఒక ప్రైవేట్ డెకొరేటర్ చేసిన పని అని తెలిపారు. తనకు ఈ విషయం తెలిసిన వెంటనే కనెక్షన్ తొలగించి, ఇంటి మీటర్ బోర్డు నుంచి విద్యుత్ కనెక్షన్ తీసుకున్నానని అన్నారు. ఈ విచక్షణారహితానికి తాను క్షమాపణ చెప్తున్నానన్నారు. బెస్కామ్ (బెంగళూరు విద్యుత్ సరఫరా కంపెనీ) అధికారులు వచ్చి తనిఖీ చేయొచ్చన్నారు. నోటీసులు జారీ చేయొచ్చని, జరిమానా చెల్లించేందుకు తాను సిద్ధమేనని పేర్కొన్నారు. నేను ప్రభుత్వ ఆస్తులను గానీ, ఇతరుల భూమిని గానీ కాజెయ్యలేదన్నారు. ఇతరుల కష్టార్జితంతో దాహం తీర్చుకునేంత స్థితికి తాను దిగజారలేదన్నారు. ఇదొక చిన్న ఇష్యూ అని, కాంగ్రెస్ అనవసరం రాద్ధాంతం చేస్తోందంటూ విమర్శించారు.