High Court Judge: న్యాయవ్యవస్థను ఆ దేవుడే కాపాడాలి..

ABN , First Publish Date - 2023-09-09T08:17:38+05:30 IST

దిగువ కోర్టుల్లో అవినీతి నిరోధక కేసుల తోసివేతపై మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆనంద్‌ వెంకటేశ్‌(Madras High Court Judge Justice Anand Venkatesh)

High Court Judge: న్యాయవ్యవస్థను ఆ దేవుడే కాపాడాలి..

- ఒక్కో కేసులో ఒక్కో విధంగా ఏసీబీ తీరు

- హైకోర్టు న్యాయమూర్తి ఆనంద్‌ వెంకటేశ్‌

ప్యారీస్‌(చెన్నై): దిగువ కోర్టుల్లో అవినీతి నిరోధక కేసుల తోసివేతపై మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆనంద్‌ వెంకటేశ్‌(Madras High Court Judge Justice Anand Venkatesh) తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారమంతా చూస్తుంటే న్యాయవ్యవస్థను ఆ దేవుడే కాపాడాలని వ్యాఖ్యానించారు. 2006 -11 మధ్య డీఎంకే ప్రభుత్వ హయాంలో హౌసింగ్‌ బోర్డు మంత్రిగా వ్యవహరించిన ఐ.పెరియస్వామి హౌసింగ్‌ బోర్డుకు సొంతమైన ఇంటిని మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి సెక్యూరిటీగా వ్యవహరించిన గణేశన్‌కు కేటాయించారు. ఆయన తన అధికారాన్ని దుర్వినియోగం చేశారంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు పెరియస్వామిపై 2012లో అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో అవినీతి కేసు నమోదు చేశారు. ఈ కేసు నుంచి మంత్రి పెరియస్వామిని విడుదల చేస్తూ ఎంపీ, ఎమ్మెల్యేల కేసులపై విచారణ జరుపుతున్న చెన్నై ప్రత్యేక న్యాయస్థానం మార్చిలో ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా 2001-06 మధ్య అన్నాడీఎంకే ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా వ్యవహరించిన వలర్మతి, ఆయన కుటుంబసభ్యులకు వ్యతిరేకంగా అక్రమార్జన కేసు నమోదైంది.

ఈ కేసు నుంచి వలర్మతి, ఆమె కుటుంబాన్ని విడుదల చేస్తూ అవినీతి నిరోధక ప్రత్యేక కోర్టు 2012లో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు తీర్పులను జస్టిస్‌ ఆనంద్‌ వెంకటేశ్‌ సుమోటోగా ఇటీవల విచారణకు స్వీకరించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ రెండు కేసులు న్యాయమూర్తి ఆనంద్‌ వెంకటేశ్‌ ముందు విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ.. అవినీతి నిరోధకశాఖ తీరు బాగాలేదని, ఒక్కో కేసులో ఒక్కో విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. అవినీతి కేసులతో సంబంధమున్న ఇద్దరు రాజకీయ ప్రముఖులను దిగువ కోర్టులు విడుదల చేయడం చూస్తుంటే, న్యాయవ్యవస్థను ఆ దేవుడే కాపాడాలన్నారు. ఇప్పుడు ఈ కేసులపై విచారణ జరపడం వల్ల తనను కూడా విలన్‌గా చూస్తారన్నారు. ఈ పిటిషన్లపై కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని మంత్రి పెరియస్వామి, మాజీ మంత్రి వలర్మతిలను ఆదేశిస్తూ తదుపరి విచారణను అక్టోబరు 12వ తేదీకి వాయిదావేశారు.

Updated Date - 2023-09-09T08:17:40+05:30 IST