India Summons Pak: సిక్కులపై పెరుగుతున్న దాడులు.. పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు

ABN , First Publish Date - 2023-06-27T10:17:57+05:30 IST

సిక్కులపై పాకిస్థాన్‌లో పెరుగుతున్న దాడులను భారత ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ సీనియర్ దౌత్యవేత్తకు సమన్లు పంపింది. సిక్కులపై దాడుల ఘటనపై వివరణ కోరింది. దాడుల ఘటనలపై విచారణ జరిపించాలని, సాధ్యమైనంత త్వరగా విచారణ నివేదికను అందజేయాలని అడిగింది

India Summons Pak: సిక్కులపై పెరుగుతున్న దాడులు.. పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు

న్యూఢిల్లీ: సిక్కులపై (Sikh Community) పాకిస్థా్న్‌లో (Pakistan) పెరుగుతున్న దాడులను (attacks) భారత ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ సీనియర్ దౌత్యవేత్తకు సమన్లు (Summons) పంపింది. సిక్కులపై దాడుల ఘటనపై వివరణ కోరింది. దాడుల ఘటనలపై విచారణ జరిపించాలని, సాధ్యమైనంత త్వరగా విచారణ నివేదికను అందజేయాలని అడిగింది. సరిహద్దుల్లో తప్పనిసరి పరిస్థితులు ఎదురైతే దాడులకు వెనుకాడమంటూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి జమ్మూలో సోమవారంనాడు పొరుగుదేశాన్ని హెచ్చరించిన నేపథ్యంలో పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు పంపడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పాకిస్థాన్‌లో ఇటీవల కాలంలో సిక్కులపై పెరుగుతున్న దాడులపై భారత ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్టు ప్రభుత్వ వర్గాలు మంగళవారం తెలిపాయి. మతపరమైన వేధింపులతో పాక్‌లోని మైనారిటీలు నిరంతర అభద్రతకు గురవుతున్నందున వారి భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని భారత్ సూచించింది.

ఏప్రిల్ నుంచి నాలుగు దాడి ఘటనలు

పాక్‌లో ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య సిక్కులపై నాలుగుసార్లు దాడి ఘటనలు చేటుచేసుకున్నాయి. గత శనివారంనాడు గుర్తుతెలియని సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఒక సిక్కు మరణించినట్టు పాకిస్థాన్‌లోని ది న్యూస్ ఇంటర్నేషనల్ తెలిపింది. ఈ కాల్పుల్లో మరణించిన వ్యక్తిని కాక్‌షల్ ప్రాంతానికి చెందిన మన్మోహన్ సింగ్‌గా గుర్తించారు. శుక్రవారం ఉదయం తర్లుగ్ సింగ్ అనే మరో సిక్కుపై డాబ్గరి ప్రాంతంలో సాయుధ దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన తర్లుగ్ సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం తప్పినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. గత మేలో సాయుధ దుండగులు తూర్పు లాహోర్‌లో జరిపిన కాల్పుల్లో సర్దార్ సింగ్ అనే 63 ఏళ్ల వ్యక్తి మృతిచెందాడు. ఏప్రిల్‌లో పెషావర్‌లో దయాల్ సింగ్ అనే మరొకరిని ఒక సాయుధుడు కాల్చిచంపాడు. సిక్కు కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరుగుతున్నాయని అక్కడి మైనారిటీలు, ముఖ్యంగా సిక్కు వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మైనారిటీలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యం కారణంగానే సాయుధ దుండగులు రెచ్చిపోతున్నారని వారు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2023-06-27T11:56:16+05:30 IST