Centre Vs Twitter : ట్విటర్‌కు షాక్ ఇచ్చిన కర్ణాటక హైకోర్ట్
ABN, First Publish Date - 2023-06-30T12:42:03+05:30
కేంద్ర ప్రభుత్వంపై పోరాటంలో ట్విటర్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కొన్ని సామాజిక మాధ్యమాల ఖాతాలను, ట్వీట్లను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ట్విటర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. అంతేకాకుండా ఆ కంపెనీకి రూ.50 లక్షలు జరిమానా విధించింది.
బెంగళూరు : కేంద్ర ప్రభుత్వంపై పోరాటంలో ట్విటర్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కొన్ని సామాజిక మాధ్యమాల ఖాతాలను, ట్వీట్లను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ట్విటర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు (Karnataka High court) శుక్రవారం తోసిపుచ్చింది. అంతేకాకుండా ఆ కంపెనీకి రూ.50 లక్షలు జరిమానా విధించింది.
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeiTY) గత ఏడాది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69ఏ ప్రకారం ట్విటర్ కంపెనీకి ఆదేశాలు ఇచ్చింది. 2021 ఫిబ్రవరి నుంచి 2022 ఫిబ్రవరి మధ్యలో ఇచ్చిన ఈ ఆదేశాల్లో కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు, ట్వీట్లను బ్లాక్ చేయాలని ఆదేశించింది. 39 యూనిఫాం రిసోర్స్ లొకేటర్స్ (URL)ను బ్లాక్ చేయాలని ఇచ్చిన ఆదేశాలను ట్విటర్ కంపెనీ హైకోర్టులో సవాల్ చేసింది. ఏదైనా అకౌంట్‌ను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లయితే, సంబంధిత ఆదేశాల్లో అందుకు కారణాలను వివరించాలని వాదించింది. ఐటీ చట్టం, 2000లోని సెక్షన్ 69ఏ ప్రకారం జారీ చేసిన ఆదేశాలను అవసరమైతే సవాలు చేయడానికి అవకాశం కల్పించే నిబంధన ఉండాలని వాదించింది.
కేంద్ర ప్రభుత్వం వాదనలు వినిపిస్తూ, ట్విటర్ మన దేశ చట్టాలను పాటించడం లేదని, ఇది ఆ కంపెనీకి అనేక సంవత్సరాలుగా అలవాటుగా మారిందని తెలిపింది. బ్లాకింగ్ ఆర్డర్స్ జారీ చేయడానికి ముందు భారత ప్రభుత్వం, ట్విటర్ ప్రతినిధుల మధ్య దాదాపు 50 సమావేశాలు జరిగాయని వివరించింది. దేశంలోని చట్టాలను పాటించకూడదనే ఉద్దేశం ట్విటర్‌కు ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని తెలిపింది.
జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్ తీర్పు చెప్తూ, ట్విటర్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోవడానికి కారణాలను తెలియజేయలేదని చెప్తూ, ట్విటర్ కంపెనీకి రూ.50 లక్షలు జరిమానా విధించారు. ఈ సొమ్మును 45 రోజుల్లోగా కర్ణాటక రాష్ట్ర న్యాయ సేవల అథారిటీకి చెల్లించాలని ఆదేశించారు. ట్విటర్ కంపెనీ ఓ సాధారణ రైతు లేదా సామాన్య వ్యక్తి కాదని, బిలియన్ డాలర్ల విలువైన కంపెనీ అని గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి :
Make in India : మోదీపై పుతిన్ ప్రశంసల జల్లు
Updated Date - 2023-06-30T12:42:03+05:30 IST