Lalit Modi Vs Rahul Gandhi : రాహుల్ గాంధీకి లలిత్ మోదీ హెచ్చరిక
ABN, First Publish Date - 2023-03-30T10:47:43+05:30
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ (former IPL chief Lalit Modi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీపై బ్రిటన్ కోర్టులో కేసు పెడతానని హెచ్చరించారు. మోదీ ఇంటి పేరుపై ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన సహచరులు తనను ‘చట్టం నుంచి తప్పించుకుంటున్న వ్యక్తి’గా ఆరోపిస్తుండటం తనను తీవ్రంగా కలచివేస్తున్నాయని తెలిపారు.
దొంగలందరి ఇంటి పేరు మోదీ ఎలా అవుతోందని కర్ణాటకలో 2019లో ప్రశ్నించిన రాహుల్ గాంధీ ఈ నెలలో గుజరాత్‌లోని సూరత్ కోర్టు తీర్పుతో తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆయన సహచరులు కొందరు లలిత్ మోదీ చట్టం నుంచి తప్పించుకుంటున్న వ్యక్తి అని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో లలిత్ మోదీ గురువారం ఘాటుగా స్పందించారు.
లలిత్ మోదీ గురువారం ఇచ్చిన వరుస ట్వీట్లలో రాహుల్ గాంధీని, ఆయన సహచరులను నిలదీశారు. తనను ‘‘పరారైన వ్యక్తి’’గా ఏ విధంగా ముద్ర వేస్తారని ప్రశ్నించారు. తాను దోషినని న్యాయస్థానాలేవీ తీర్పు చెప్పలేదని, అందువల్ల తాను సాధారణ పౌరుడినని చెప్పారు. ఇదంతా ప్రతిపక్ష నేతల కక్షసాధింపు చర్య అని మండిపడ్డారు.
‘‘నేను చట్టం నుంచి తప్పించుకుని, విదేశాలకు పారిపోయిన వ్యక్తినని ఎవరు పడితే వారు, గాంధీ సహచరులు మళ్లీ మళ్లీ చెప్తుండటం చూస్తున్నాను. ఎందుకు? ఎలా? నేను దోషినని ఈ రోజు వరకు ఎప్పుడైనా తీర్పు వచ్చిందా? పప్పు వురపు రాహుల్ గాంధీ మాదిరిగా కాకుండా, నేను ఇప్పుడు ఓ సాధారణ పౌరుడిని, నేను చెప్తున్నాను, ప్రతిపక్ష నేతల్లో ప్రతి ఒక్కరికీ మరొక పని ఏమీ లేదు, వారికి కూడా సరైన సమాచారం లేకపోవచ్చు లేదా కేవలం కక్ష సాధించడానికి వారు ముందడుగు వేస్తుండవచ్చు. కనీసం రాహుల్ గాంధీనైనా ఇప్పుడే బ్రిటన్ కోర్టుకు లాక్కెళ్లాలని నేను నిర్ణయించుకున్నాను. ఆయన స్పష్టమైన సాక్ష్యాధారాలతో రావలసి ఉంటుందని కచ్చితంగా చెప్పగలను. ఆయన తనను తాను పరిపూర్ణ మూర్ఖుడిగా చేసుకోవడాన్ని చూడాలని నేను ఎదురు చూస్తున్నాను. గాంధీ కుటుంబం తరపున సంచులు మోసే ఆర్‌కే ధావన్, సీతారామ్ కేసరి, మోతీలాల్ వోరా, సతీశ్ శర్మ, నారాయణ్ దత్ తివారీ వంటివారికి విదేశాల్లో ఆస్తులు ఎలా వచ్చాయి? కమల్‌నాథ్‌ను అడగండి.’’ అని ఓ ట్వీట్‌లో లలిత్ మోదీ చెప్పారు.
‘‘నేను నిజమైన అవినీతిపరుల చిరునామాలు, ఫొటోలు వంటివాటిని పంపిస్తాను. మనం భారతీయులను వెర్రివాళ్లను చేయవద్దు. దేశాన్ని పరిపాలించే అర్హత తమకు మాత్రమే ఉందన్నట్లుగా గాంధీ కుటుంబం చేస్తోంది. కట్టుబడి ఉండదగిన కఠినమైన చట్టాలను మీరు చేసినపుడు నేను కచ్చితంగా తిరిగి వస్తాను. జై హింద్’’ అని మరొక ట్వీట్‌లో లలిత్ మోదీ చెప్పారు.
‘‘నేను ఇప్పటి వరకు పైసా అయినా తీసుకున్నట్లు గడచిన 15 ఏళ్ళలో రుజువు కాలేదు. ఈ ప్రపంచంలో అత్యద్భుతమైన స్పోర్టింగ్ ఈవెంట్‌ను నేను సృష్టించానని స్పష్టంగా రుజువైంది. దీనివల్ల దాదాపు 100 బిలియన్ డాలర్ల సంపద వచ్చింది. 1950వ దశకం నుంచి మోదీ కుటుంబం కాంగ్రెస్‌వారి కోసం, దేశం కోసం ఎంతో చేసిందని, వారి ఊహకు అందనంత ఎక్కువ చేసిందని ఒక కాంగ్రెస్ నేత కూడా మర్చిపోకూడదు. నేను కూడా ఎన్నడూ ఊహించనంత గొప్పగా చేశాను. అందువల్ల గాంధీ కుటుంబీకుల వంటి కుంభకోణాల కళంకిత భారతీయ దోపిడీదారులారా మొరుగుతూనే ఉండండి. జై హింద్’’ అని మూడో ట్వీట్‌లో లలిత్ మోదీ స్పష్టం చేశారు.
లలిత్ మోదీ ఈ ట్వీట్లను చాలా మంది కాంగ్రెస్ నేతలకు ట్యాగ్ చేశారు. వారందరికీ విదేశాల్లో ఆస్తులు ఉన్నాయని ఆరోపించారు. రాహుల్ గాంధీ 2019లో కర్ణాటకలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడుతూ దొంగలందరికీ ఇంటి పేరు మోదీ ఎలా అవుతోందని ప్రశ్నించడంతో, ఆయనపై దావా వేస్తానని లలిత్ మోదీ అప్పట్లోనే చెప్పారు.
ఇవి కూడా చదవండి :
Prime Minister Narendra Modi : రాముడి జీవితం మానవాళికి స్ఫూర్తి...మోదీ రామనవమి శుభాకాంక్షలు
Commissioner of Police: రెండోమారు పరీక్ష నిర్వహించాల్సిందే..
Updated Date - 2023-03-30T10:52:19+05:30 IST