LTTE Chief Prabkaran Alive: వేలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నాడు.. సంచలన విషయం బయటపెట్టిన ఇందిరాగాంధీ మాజీ సహాయకుడు
ABN , First Publish Date - 2023-02-13T14:51:37+05:30 IST
లిబరేషన్ ఆఫ్ తిమిళ్ ఈలం చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నాడంటూ కాంగ్రెస్ మాజీ నేత, ఇందిరాగాంధీ మాజీ సహాయకుడు పళ నెడుమారన్..
న్యూఢిల్లీ: లిబరేషన్ ఆఫ్ తిమిళ్ ఈలం (LTTE) చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ (Velupillai Prabhakaran) బతికే ఉన్నాడంటూ కాంగ్రెస్ మాజీ నేత, ఇందిరాగాంధీ మాజీ సహాయకుడు పళ నెడుమారన్ (Pazha Nedumaran) సోమవారంనాడు సంచలన విషయం బయటపెట్టారు. ప్రభాకరన్ సజీవంగా, సురక్షితంగా, మంచి ఆరోగ్యంతో ఉన్నారని ప్రకటించారు. అయితే ప్రస్తుతం ప్రభాకరన్ ఎక్కడ ఉన్నాడనే విషయాన్ని ఆయన బయట పెట్టలేదు. త్వరలోనే ప్రభాకరన్ జనం ముందుకు వస్తారని మాత్రం వెల్లడించారు. ప్రభాకరన్ కుటుంబం కూడా సురక్షితంగా ఉందని, తాను వారితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నానని అన్నారు. ప్రభాకరన్ కుటుంబ సభ్యుల అనుమతి తీసుకున్న తర్వాతే ఈ విషయాలను తాను బయట పెడుతున్నట్టు చెప్పారు. శ్రీలంకలోని ప్రస్తుత పరిస్థితిని ప్రస్తావిస్తూ, ఈలమైట్స్‌లో విశ్వాసాన్ని ప్రభాకరన్ కల్పించనున్నారని అన్నారు.
''తమిళ జాతీయ నేత ప్రభాకరన్ గురించిన నిజం తెలియజేయదలచుకున్నాను. ఆయన చాలా బాగున్నారు. ఈ విషయాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళ ప్రజలందరికీ తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇంతవరకూ ఆయన గురించి ఒక పద్ధతి ప్రకారం వ్యాప్తి చేసిన ఊహాగానాలకు ఈ వార్తతో తెరపడుతుందని ఆశిస్తున్నాను'' అని నెడుమారన్ తెలిపారు. ప్రభాకరన్ సరైన సమయంలో జనం ముందుకు వస్తారని, ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారనేది చెప్పడం కష్టమని అన్నారు..
''ప్రభాకరన్ ఎక్కడున్నారు? ఆయన ఎప్పుడు వస్తారు? ప్రపంచం తమిళులు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు. తమిళ ఈళం గురించి సమగ్ర ప్రణాళికను ప్రభాకరన్ త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రభాకరన్ కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నాను. అందువల్లే వారి అనుమతితో ఈ విషయాన్ని చెబుతున్నాను. ఆయన సరైన సమయంలో కనిపిస్తారు. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారనేది చెప్పడం మాత్రం కష్టం'' అని నెడుమారన్ తెలిపారు.
ఎవరీ టైగర్ ప్రభాకరన్..?
శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్‌టీటీఈ)ను వేలుపిల్లై ప్రభాకరన్ 1976లో స్థాపించాడు. సింహళుల ఆధిపత్య శ్రీలంక ప్రభుత్వం, సింహళ పౌరులు తమపై విపక్ష చూపుతున్నారంటూ తమిళులకు స్వయంప్రతిపత్తి కోసం ఎల్‌టీటీఈ పిలుపునిచ్చింది. క్రమంగా అది గెరిల్లా పోరాటంగా మారింది. 1983లో జాఫ్నా వెలుపల శ్రీలంక సైన్యం పెట్రోలింగ్‌పై గెరిల్లా దాడి జరగడంతో 13 మంది సైనికులు మరణించారు. దీంతో ఎల్‌టీటీఐపై ఉగ్రవాద ముద్ర సంస్థగా శ్రీలకం ప్రభుత్వం ప్రకటించింది. ఇది అంతర్యుద్ధంగా మారడంతో 90వ దశకంలో శ్రీలంక సింహళీయులకూ, మైనార్టీ తమిళులకు మధ్య భీకర పోరాటమే సాగింది. అప్పట్లో తగినంత బలం, బలగం ఎల్టీటీఈకి తక్కువగానే ఉన్నా విదేశాల నుంచి అందిన సాయంతో సింహళీయులకు ప్రబాకరన్ చుక్కలు చూపించారు. ఎట్టకేలకు ప్రభాకరన్ 2009లో ఆర్మీ మట్టుపెట్టింది. తాము జరిపిన దాడుల్లో ప్రభాకరన్ ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభాకరన్ మృతదేహం ఫోటోలను కూడా లంక ఆర్మీ విడుదలచేసింది. దీంతో లంకలో తమిళ పోరు ముగిసినట్లయింది. ఈ నేపథ్యంలో వేలుపిళ్లై ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నట్లు పళనెడుమారన్ సంచలన ప్రకటన చేశారు.