Monsoon Session eve: ప్రభుత్వ టీపార్టీని బహిష్కరించిన విపక్షాలు
ABN, First Publish Date - 2023-07-16T20:46:33+05:30
మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్బంగా ప్రభుత్వం ఆనావాయితీగా ఆదివారంనాడు ఇచ్చిన టీపార్టీని మహా వికాస్ అఘాడీ నేతలు బహిష్కరించారు. ఈనెల 17వ తేదీ సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది.
ముంబై: మహారాష్ట్ర (Maharashtra) అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్బంగా ప్రభుత్వం ఆనావాయితీగా ఆదివారంనాడు ఇచ్చిన టీపార్టీని మహా వికాస్ అఘాడీ (MVA) నేతలు బహిష్కరించారు. ఈనెల 17వ తేదీ సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు నుంచి ప్రారంభం కానున్నాయి.
విపక్ష మహాకూటమిలో శివసేన (UBT), కాంగ్రెస్, ఎన్‌సీపీ శరద్‌పవార్ వర్గం ఉన్నాయి. శివసేన ఉద్ధవ్ థాకరే నేత అంబాదాస్ దన్వే, కాంగ్రెస్ పార్టీ నేత బాలాసాహెబ్ తోరట్, ఎన్‌సీపీ నేత జయంత్ పాటిల్ ఆదివారంనాడిక్కడ సమావేశమై ప్రభుత్వం ఇచ్చే టీపార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అనంతరం మీడియాతో ధన్వే మాట్లాడుతూ, ప్రజల బాధల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ప్రభుత్వం ఇచ్చిన టీపార్టీ ఆహ్వానాన్ని తాము తిరస్కరిస్తున్నామని చెప్పారు. రాజ్యాంగ నిబంధనల పరంగా ప్రభుత్వ చెల్లుబాటు ఇప్పటికీ ప్రశ్నార్ధంగానే ఉందన్నారు. రాజ్యాంగ నిబంధనలకు తూట్లు పొడిచారని, మహారాష్ట్ర ముఖ్యమంత్రే అనర్హతను ఎదుర్కొంటారని అన్నారు.
సీఎం ఎవరో తెలియక జనం తికమక..
ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీపార్టీ సమావేశాన్ని తాము బహిష్కరించినట్టు ఉద్ధవ్ వర్గం నేత, ఎమ్మెల్యే సునీల్ రౌత్ తెలిపారు. ఏకనాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్‌లో ఎవరు ముఖ్యమంత్రో తెలియక జనం అయోమయంలో ఉన్నారని, నిజానికి మహారాష్ట్రలో రెండే బ్రాండ్‌లు ఉన్నాయని, ఒకటి థాకరే బ్రాండ్, మరొకటి శరద్ పవార్ బ్రాండ్ అని ఆయన చెప్పారు.
సీఎం షిండే కౌంటర్..
కాగా, వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం ఇచ్చే టీపార్టీకి విపక్షాలు ఎప్పుడూ గైర్వాజరవుతూనే ఉన్నారని ముఖ్యమంత్రి షిండే అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అన్ని విషయాలు చర్చిస్తామని, 210 మందికి పైగా ఎమ్మెల్యేలు ప్రస్తుతం తమతో ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం తప్పుచేస్తే విపక్షాలు తప్పనిసరిగా నిలదీయాలని, అదే సమయంలో ప్రభుత్వం మంచి చేస్తే విపక్షాలు ప్రశంసించాలని అన్నారు. మొత్తం మీద, మహారాష్ట్ర వర్షాకాల సమావేశాలు ఈసారి వాడివేడిగానే జరిగే అవకాశాలున్నాయని ఆయా పార్టీల నేతల అంచనాగా ఉంది.
Updated Date - 2023-07-16T20:46:33+05:30 IST