Narendra Modi: నేవీ డే వేడుకల్లో పాల్గొననున్న ప్రధానీ మోదీ
ABN, First Publish Date - 2023-12-02T21:47:28+05:30
ఈ నెల 4న మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లో జరిగే నేవీ డే వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొననున్నారు. అదే రోజు రాజ్‌కోట్ కోటలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించనున్నారు.
ముంబై: ఈ నెల 4న మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లో జరిగే నేవీ డే వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొననున్నారు. అదే రోజు రాజ్‌కోట్ కోటలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. 17వ శతాబ్దంలో మరాఠా పాలకులు నిర్మించిన సింధుదుర్గ్ కోటలో ఈ ఏడాది నేవీ డే వేడుకలు జరగనుండడం గమనార్హం. ఈ సందర్భంగా సైనిక బలగాలకు చెందిన యుద్ధనౌకలు, జలాంతర్గాములు, ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఈ వేడుకల్లో ప్రదర్శించనున్నారు. ఈ వేడుకలను ప్రధాని స్వయంగా వీక్షించనున్నారు.
మొత్తం 20 యుద్ధనౌకలు, 40 విమానాలు, మిగ్ 29కే, తేలికపాటి యుద్ధ విమానాలు ఈ వేడుకల్లో ప్రదర్శించనున్నట్టు నేవీ అధికారులు తెలిపారు. యాంకరేజ్ వద్ద యుద్ధనౌకల ప్రదర్శన అనంతరం ఈ కార్యక్రమం ముగియనుంది. అనంతరం కానిక్ సింధుదుర్గ్ కోటలో లేజర్ షో కూడా ఉండనుంది. కాగా 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో కరాచీ నౌకాశ్రయంపై నౌకాదళం దాడి చేసిన ఆపరేషన్ ట్రైడెంట్ - స్మారకార్థం భారతదేశం డిసెంబర్ 4ని నేవీ డేగా జరుపుకుంటుంది. నావికాదళం ఇలాంటి మెగా ఈవెంట్‌ను నిర్వహించడం ఇదే మొదటిసారి. ఇది ఇతర ఏ ప్రధాన నౌకాదళ స్టేషన్‌లోనూ జరగడం లేదని అధికారులు తెలిపారు. కాగా ఈ ఏడాది వైమానిక దళ దినోత్సవం వేడుకలను ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అక్టోబర్ 8న నిర్వహించారు. తొమ్మిదేళ్ల క్రితం ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్‌తో సహా సాయుధ దళాల కీలక సమావేశాలు న్యూఢిల్లీ వెలుపల జరిగాయి.
Updated Date - 2023-12-02T21:51:44+05:30 IST