Russia-Ukraine War : రష్యాపై ఆంక్షలు.. మోదీ చాణక్యం..
ABN, First Publish Date - 2023-04-07T11:43:49+05:30
ఉక్రెయిన్ (Ukraine)పై యుద్ధం చేస్తున్న రష్యా (Russia)పై అమెరికా సహా పాశ్చాత్య దేశాలు ఆంక్షలను అమలు చేస్తున్నాయి.
న్యూఢిల్లీ : ఉక్రెయిన్ (Ukraine)పై యుద్ధం చేస్తున్న రష్యా (Russia)పై అమెరికా సహా పాశ్చాత్య దేశాలు ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఈ పరిస్థితులను భారత దేశానికి ప్రయోజనకరంగా మార్చుతున్నారు. అమెరికా తదితర దేశాల నుంచి ఎంత తీవ్రమైన ఒత్తిడి వచ్చినప్పటికీ రష్యా నుంచి చమురును తీసుకొచ్చి, శుద్ధి చేసి, ఎగుమతి చేస్తున్నారు. మరోవైపు అమెరికన్ డాలర్ ఆధిపత్యానికి గండి కొట్టేందుకు విదేశాలతో భారతీయ కరెన్సీలోనే లావాదేవీలు జరిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఆంక్షలతో సతమతమవుతున్న రష్యా రాయితీ ధరలకు చమురును విక్రయిస్తోంది. ఆ చమురును కొనవద్దని అమెరికా సహా ఇతర పాశ్చాత్య దేశాలు భారత దేశంపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నాయి. కానీ వాటిని పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం రష్యా చమురును చౌక ధరకు కొంటోంది. ఈ చమురును భారత దేశంలో శుద్ధి చేసి, అమెరికాతోపాటు యూరోపు దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఆ దేశాలు చివరికి చేసిది లేక మిన్నకుండిపోతున్నాయి. రష్యా ఆదాయానికి గండి కొట్టగలుగుతున్నామని, తమకు చమురు సంక్షోభం రాకుండా కూడా అడ్డుకట్ట పడుతోందని భావిస్తూ సర్దుకుపోతున్నాయి.
వాషింగ్టన్ మేధావుల సంఘం సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ సీనియర్ ఫెలో బెన్ కహిల్ మాట్లాడుతూ, అమెరికాకు రెండు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయన్నారు. మార్కెట్లో చమురు ఇబ్బడి ముబ్బడిగా ఉండాలి, అదే సమయంలో రష్యాకు చమురు వల్ల లభించే ఆదాయానికి భారీగా గండిపడాలి - ఇవే ఆ లక్ష్యాలు అని తెలిపారు. రష్యా నుంచి చౌక ధరకు క్రూడాయిల్‌ను కొని, శుద్ధి చేసి, మార్కెట్ ధరకు ఎగుమతి చేస్తూ, ఇండియన్, చైనీస్ రిఫైనర్లు లాభాలు ఆర్జిస్తున్న విషయం అమెరికా, పాశ్చాత్య దేశాలకు తెలుసునన్నారు. ఇలా జరగడాన్ని ఆ దేశాలు స్వాగతిస్తున్నాయన్నారు.
భారత దేశానికి అవసరమైన చమురులో 85 శాతం వరకు దిగుమతులపైనే ఆధారపడుతోంది. అయితే రష్యా చమురు ఎగుమతులపై ఆంక్షల తర్వాత భారత దేశం నుంచి పెట్రో ఉత్పత్తుల ఎగుమతులు భారీగా పెరిగాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని రిఫైనరీలు కూడా అంతర్జాతీయ ధరలకు ఈ ఉత్పత్తులను విక్రయించి, లాభాలు ఆర్జిస్తున్నాయి.
డాలర్ పెత్తనానికి అడ్డుకట్ట
ఒక దేశం మరో దేశంతో లావాదేవీలు జరపాలంటే అమెరికన్ డాలర్లను కొనవలసి ఉంటుంది. దీంతో డాలర్ పెత్తనం మితిమీరడంతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఆగ్రహంతో ఉన్నాయి. చైనా కూడా తన కరెన్సీతోనే లావాదేవీలు జరపాలని ప్రయత్నిస్తోంది. ఈ పరిస్థితిని ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా గమనించింది. భారతీయ కరెన్సీతోనే విదేశీ లావాదేవీలు జరిపేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు 18 దేశాలు భారతీయ కరెన్సీతోనే లావాదేవీలు జరపడానికి అంగీకరించాయి. జర్మనీ, కెన్యా, శ్రీలంక, సింగపూర్, బ్రిటన్ సహా 18 దేశాల నుంచి భారత దేశానికి ఏమైనా వస్తువులు, ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటే, భారతీయ రూపాయల్లోనే చెల్లింపులు జరపవచ్చు. ఈ లావాదేవీల కోసం భారతీయ బ్యాంకులలో VOSTRO accountను తెరవవలసి ఉంటుంది.
ఈ VOSTRO accountలో జమ చేసిన నిధులను ఆయా దేశాలకు చెందినవారు మన దేశంలోని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికి వీలవుతుంది. అదేవిధంగా మన దేశం నుంచి వస్తువులు, సేవలను కొనడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల వ్యాపార సంబంధిత ఖర్చులు తగ్గుతాయి, వ్యాపారులకు ప్రోత్సాహం లభిస్తుంది. రూపాయిని సెటిల్‌మెంట్, ఇన్వాయిసింగ్ కరెన్సీగా ఉపయోగించడం వల్ల ఎక్స్ఛేంజ్ రేట్ రిస్క్ తగ్గుతుంది. అదేవిధంగా భారత దేశ వాణిజ్య లోటు కూడా తగ్గుతుంది. రూపాయి మాధ్యమంలో వాణిజ్యానికి ఎన్ని ఎక్కువ దేశాలు అంగీకరిస్తే, అంత ఎక్కువగా ఎగుమతులు జరుగుతాయి. నేపాల్, భూటాన్ వంటి దక్షిణాసియా దేశాలతో వాణిజ్య సంబంధాలు బలపడతాయి. రష్యాపై ఆంక్షల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ పెత్తనాన్ని నిరోధించాలని చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అమెరికాకు ప్రత్యామ్నాయంగా ఎదగడం కోసం చైనా ప్రయత్నిస్తోంది.
ఇవి కూడా చదవండి :
Ayodhya Ramalayam : అయోధ్య రామాలయం నిర్మాణంలో కీలక ఘట్టం
CNG, PNG Price : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్యాస్ ధరలు దాదాపు 11 శాతం తగ్గుదల..
Updated Date - 2023-04-07T11:43:49+05:30 IST