BJP Vs JDU : నితీశ్ కుమార్‌పై మండిపడ్డ రవిశంకర్ ప్రసాద్
ABN, First Publish Date - 2023-02-19T14:51:25+05:30
బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ (Nitish Kumar)పై బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్
పాట్నా : బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ (Nitish Kumar)పై బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ (Ravi Shankar Prasad) ఆదివారం తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని నడపలేని నితీశ్ ప్రధాన మంత్రి అభ్యర్థి కావాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దేశ ప్రజలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై నమ్మకం పెట్టుకున్నందువల్ల నితీశ్ కలలు ఎన్నటికీ నిజం కావని చెప్పారు.
రవిశంకర్ ప్రసాద్ ఆదివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, బిహార్ ఇబ్బందుల్లో ఉందని, రాష్ట్రాన్ని నడపలేని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తనను ప్రధాన మంత్రి అభ్యర్థిని చేయాలని కోరుతున్నారని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నాయకత్వంలో దేశం చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రగతి సాధించిందనే విషయాన్ని నితీశ్ కానీ, మరొక నాయకుడు కానీ తెలుసుకోవాలన్నారు. ‘‘మీ పార్టీలోనే లుకలుకలు ఉన్నాయి. మీరు దేశాన్ని ఏకం చేయడానికి బయల్దేరారు. మీకు కాంగ్రెస్ చేయూతనివ్వదు’’ అన్నారు. ‘‘నితీశ్ గారూ, మీరు దేవె గౌడ, ఇందర్ కుమార్ గుజ్రాల్ మాదిరిగా అవుదామనుకుంటున్నారా?’’ అని అడిగారు. 1990వ దశకంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలను ఆయన గుర్తు చేశారు. ఇలాంటి ప్రభుత్వాలు ఐదు లేదా ఆరు నెలల కన్నా ఎక్కువ కాలం ఉండవని చెప్పారు.
ఎయిరిండియా ఇటీవల ఎయిర్‌బస్, బోయింగ్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను ఈ సందర్భంగా ప్రసాద్ ప్రస్తావించారు. ఈ ఒప్పందాల వల్ల ఉద్యోగావకాశాలు వస్తాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden), బ్రిటన్ ప్రధాన మంత్రి రుషి సునాక్ (Rishi Sunak) చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. విమానాల కొనుగోలు ఒప్పందం వల్ల తమ దేశాల్లో ఉద్యోగావకాశాలు వస్తాయని అమెరికా, ఫ్రాన్స్ దేశాల అధ్యక్షులు, బ్రిటన్ పీఎం చెప్తున్నారన్నారు. భారతీయులు నరేంద్ర మోదీకి సంపూర్ణ ఆధిక్యతను ఇచ్చినందువల్లే ఇది సాధ్యమైందని చెప్పారు.
సీపీఐ-ఎంఎల్ లిబరేషన్ నిర్వహించిన సమావేశంలో నితీశ్ కుమార్ శనివారం మాట్లాడుతూ, ప్రతిపక్షాల ఐక్యత వల్ల సత్ఫలితాలు ఉంటాయని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి వస్తే, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 100 కన్నా తక్కువ స్థానాలు మాత్రమే వస్తాయన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో కలిసి రావాలని కాంగ్రెస్ పార్టీకి పిలుపునిచ్చారు. సాధ్యమైనంత త్వరగా ఈ కూటమికి రూపం ఇవ్వాలన్నారు. త్వరగా నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీని కోరారు.
అయితే ప్రధాన మంత్రిని కావాలనే కోరిక తనకు లేదని నితీశ్ కుమార్ గతంలో చెప్పారు.
ఇవి కూడా చదవండి :
Delhi liquor policy : నన్ను అరెస్ట్ చేసి ఉండేవారు : మనీశ్ సిసోడియా
Updated Date - 2023-02-19T14:51:28+05:30 IST