Road Accident: కారు, పికప్ వ్యాన్‌ను ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్.. మంటలు చెలరేగి నలుగురు మృతి
ABN, First Publish Date - 2023-11-11T08:26:53+05:30
హర్యానాలోని గురుగ్రామ్ సమీపంలో గల ఢిల్లీ-జైపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆయిల్ ట్యాంకర్ డివైడర్‌ను ఢీ కొట్టి, కారు, పికప్ వ్యాన్‌ను కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారని పోలీసులు తెలిపారు.
గురుగ్రామ్: హర్యానాలోని గురుగ్రామ్ సమీపంలో గల ఢిల్లీ-జైపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆయిల్ ట్యాంకర్ డివైడర్‌ను ఢీ కొట్టి, కారు, పికప్ వ్యాన్‌ను కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో కారు పూర్తిగా దగ్దమైంది. ప్రమాదం సమయంలో కారులో ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. దీంతో ఆ ముగ్గురు ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని చనిపోయారు. వాహనంలో సీఎన్‌జీ సిలిండర్లు ఉండడంతో మంటలు చెలరేగాయని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వినోద్ కుమార్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదం సమయంలో ప్రయాణికులు జైపూర్‌కు వెళ్తున్నారు. ఆయిల్ ట్యాంకర్ కారును ఢీకొట్టిన తర్వాత పికప్ వ్యాన్‌ను కూడా ఢీకొట్టింది. దీంతో పికప్ వ్యాన్ డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ప్రస్తుతం ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడని ఏఎన్‌ఐ తెలిపింది. ‘‘ఢిల్లీ-జైపూర్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదం గురించి మాకు సమాచారం అందింది. మేము ఘటనా స్థలానికి చేరుకునే సమయానికి మంటల్లో కారు దగ్దమై ముగ్గురు చనిపోయారు. ఆయిల్ ట్యాంకర్ కారునే కాకుండా పికప్ వ్యాన్‌ను కూడా ఢీకొట్టింది. దీంతో పికప్ వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడైన ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం’’ అని వినోద్ కుమార్ తెలిపారు.
Updated Date - 2023-11-11T08:32:10+05:30 IST