Sharad Pawar: శరద్ పవార్ వ్యూహాలతో కాంగ్రెస్‌లో కలకలం
ABN, First Publish Date - 2023-04-10T15:26:59+05:30
శరద్ పవార్ సడన్‌గా బాంబు పేల్చారు.
న్యూఢిల్లీ: శరద్ పవార్(Sharad Pawar). మహారాష్ట్రలోనే (Maharashtra) కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయాల్లో తిరుగులేని నేతగా పేరుంది. 82 సంవత్సరాల వయసులోనూ దేశ రాజకీయాలను తన వ్యూహాలతో ప్రభావితం చేస్తున్నారు. 1998లో సోనియా గాంధీ (Sonia Gandhi) కాంగ్రెస్(Congress) పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించగానే మరికొందరు ముఖ్యమైన నేతలతో కలిసి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) పేరుతో వేరుకుంపటి పెట్టుకున్నారు. ఆ తర్వాత యూపిఏ పేరిట సోనియా చేసిన దౌత్యపరమైన సంప్రదింపులో లేక పవార్ చాణక్యమో తెలియదు కానీ వేర్వేరు పార్టీల్లో ఉంటున్నా యూపిఏలో కొనసాగుతున్నారు. యూపిఏ చైర్ పర్సన్‌గా సోనియా కొనసాగుతుండగా కొంతకాలం క్రితం వరకూ మహారాష్ట్రలో కాంగ్రెస్- ఎన్సీపీ-శివసేన సంకీర్ణ సర్కారు పాలన సాగింది. 2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కమలనాథులు యత్నిస్తుండగా ప్రతిపక్షాలు ఐక్యపోరుకోసం తంటాలు పడుతున్నాయి. బలమైన మోదీని ప్రతిపక్షనేతలంతా ఐక్యంగా నిలవరించకపోతే మరోసారి కేంద్రంలో బీజేపీ సర్కారు ఖాయమనుకుంటోన్న తరుణంలో విపక్షాలు ఏకతాటిపైకి వచ్చేందుకు యత్నిస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికాలోని ఓ సంస్థ హిండెన్‌బర్గ్ భారత పారిశ్రామిక దిగ్గజం గౌతం అదానీ గ్రూప్‌పైచేసిన ఆరోపణలపై విచారణకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC) వేయాలని ప్రతిపక్షాలన్నీ పట్టుబట్టాయి. అంతేకాదు దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధం అవుతున్నాయి. దాదాపు ఏకతాటిపైకి వచ్చి మోదీ ప్రభుత్వాన్ని ఈ అంశంలో ఇరుకున పెట్టాలని ఢిల్లీ నుంచి గల్లీదాకా పార్లమెంట్ నుంచి గ్రామ స్థాయిల వరకూ అదానీపై జేపీసీ అనే అంశాన్ని తీసుకెళ్లేందుకు పోరు ప్రారంభించారు కూడా. అంబానీ అదానీ అంటూ రాహుల్ గాంధీ ప్రతి ఇంటర్వ్యూలోనూ ప్రస్తావిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఇదే అంశంపై ఆయన ఫోకస్ పెట్టారు. అదానీ కంపెనీలో బినామీ పేర్లతో ఉన్న రూ.20వేల కోట్లు ఎవరివన్న ప్రశ్న ఇంకా మిగిలే ఉందంటూ ట్వీట్లు కూడా క్రమం తప్పకుండా చేస్తున్నారు. తృణమూల్, ఆప్, బీఆర్ఎస్, సమాజ్‌వాదీ సహా అన్ని పార్టీలూ ఏకతాటిపైకి వచ్చేశాయి.
ఇంతలో శరద్ పవార్ సడన్‌గా బాంబు పేల్చారు. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై విచారణకు సుప్రీంకోర్టు కమిటీ సరిపోతుందని ఎన్‌సీపీ చీఫ్ శరద్‌పవార్ అన్నారు. సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) అవసరం లేదన్నారు. ‘‘నేను ఎన్నో జేపీసీలకు చైర్మన్‌గా పనిచేశాను. జేపీసీలో 21 మంది సభ్యులుంటే.. అందులో 15 మంది అధికారపక్షానికి చెందినవారే ఉంటారు. విపక్షం నుంచి ఆరుగురికే చోటు ఉంటుంది. అందుకే.. జేపీసీలో పక్షపాతధోరణి కనిపించవచ్చు’’ అని ఆయన వివరించారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వంపై ఆయుధాలు ఎక్కుపెట్టేందుకు విపక్షాలు అంబానీ-అదానీల అంశాన్ని ఆయుధంగా చేసుకుంటున్నాయని, అయితే దేశానికి వాళ్ల కంట్రిబ్యూషన్ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని పవార్ అన్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుల, రైతు సమస్యలు వంటి అంశాలు మరింత కీలకమని ఆయన పేర్కొన్నారు.
శరద్‌పవార్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ బిత్తరపోయింది. జేపీసీపై కాంగ్రెస్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఉద్యమం కొనసాగుతున్న తరుణంలో పవార్ చేసిన వ్యాఖ్యలు పాలపొంగుపై నీళ్లు చల్లిన చందంగా తయారైంది. అయినా కొందరు కాంగ్రెస్ నేతలు పవార్ వ్యాఖ్యలపై స్పందించారు. అదానీపై సుప్రీంకోర్టు కమిటీ దర్యాప్తు పరిధి స్వల్పంగా ఉంటుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అన్నారు. జేపీసీ అయితేనే నిజాలు నిగ్గుతేలుతాయని వ్యాఖ్యానించారు.
మరోవైపు ఈవీఎంల హ్యాకింగ్ (EVMs Hacking) వ్యవహారంపై శరద్ పవార్ దగ్గరి బంధువు, మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష ఎన్‌సీపీ నేత అజిత్ పవర్ (Ajit Pawar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలలో క్షుణ్ణంగా తనిఖీలు ఉంటాయని, వ్యక్తిగతంగా వాటిపై తనకు గట్టి నమ్మకం ఉందని అన్నారు.
ఈవీఎంలను హ్యాకింగ్ చేయవచ్చంటూ విపక్ష నేతలు చేస్తున్న వాదనలను అజిత్ పవార్ కొట్టివేశారు. ''ఈవీఎంలను ట్యాంపర్ చేయవచ్చని ఎవరైనా నిరూపిస్తే దేశంలో తీవ్ర అలజడి రేగుతుంది. ఇందుకు ఎవరూ సాహసిస్తారని నేను అనుకోను. ఒక్కోసారి కొందరు ఎన్నికల్లో ఓడిపోతారు. అయితే తాము ఓడిపోలేదనే ఆలోచనతో వారుంటారు. అప్పుడు ఈవీఎంలపై ఆరోపణలకు దిగుతారు. అయితే, ఈవీఎంలలో వచ్చే తీర్పే.. నిజమైన ప్రజా తీర్పు'' అని ఆయన అన్నారు. దేశంలోని ఈవీఎంలను తారుమారు చేయడం సాధ్యంకాదని, ఇది చాలా పెద్ద వ్యవస్థ అని, అనేకమైన చెక్స్ అండ్ బాలెన్సెస్ ఉంటాయని చెప్పారు. ఈవీఎంలను హ్యాక్ చేయడం కుదిరితే విపక్ష పార్టీలు పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉండేవి కావని అన్నారు.
దీనికి ముందు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విద్యార్హతలను పలు విపక్ష పార్టీలు టార్గెట్‌గా చేయడాన్ని అజిత్ పవార్ తప్పుపట్టారు. మంత్రుల డిగ్రీలపై ప్రశ్నించడం సరైనది కాదని, ఆ నేతలు తమ పదవీకాలంలో ఏమి సాధించారన్నదే ప్రధానమని అన్నారు. ''2014లో డిగ్రీ ప్రాతిపదికపై మోదీకి ప్రజలు ఓటు వేశారా? ఆయన ఏర్పరచుకున్న చరిష్మానే ఆయన గెలుపునకు కారణమైంది. ప్రస్తుతం తొమ్మిదేళ్లుగా ఆయన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఆయన డిగ్రీ గురించి ప్రస్తావించడం సరైనది కాదు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలపై నిలదీయవచ్చు'' అని అన్నారు.
ఈ తరుణంలో శరద్ పవార్ కూడా స్పందించారు. ప్రధాని మోదీ విద్యార్హతల గురించి మాట్లాడటం కంటే ప్రజాసమస్యల గురించి ప్రతిపక్షాలు మాట్లాడటం మంచిదని సూచించారు.
అదానీపై జేపీసీ, ఈవీఎంలపై అనుమానాలు, మోదీ విద్యార్హతలు ఇలా అన్ని అంశాలు కూడా ప్రజా సమస్యలు కావని, కేంద్రాన్ని ఇరుకునపెట్టేవి కావని పవార్ చెబుతుండటం దుమారం రేపుతోంది. ప్రతిపక్షాల్లో చీలిక స్పష్టంగా కనపడుతోంది. యూపిఏకు సారథ్యం వహించాలనే నెపంతో, తన పెద్దరికాన్ని గుర్తించాలనే కోణంలో పవార్ ఇలా భిన్నంగా మాట్లాడుతున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఉక్కిరిబిక్కిరి అవుతుండటం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్లస్ పాయింట్‌గా మారుతోంది. ప్రజాసమస్యలను గాలికొదిలేసి మిగతా అంశాల్లో ప్రతిపక్షాల్లో భిన్నాభిప్రాయాలు ఏర్పడటంతో కమలనాథులు ఖుషీగా ఉన్నారు. 2024లో గెలిచి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు తమ మైనస్ పాయింట్లను సరిచేసుకునే పనిలో పడ్డారు.
PM Modi: ఈస్టర్ వేళ ఆనందాలు పంచిన మోదీ
Hindutva: అయోధ్యలో శిండే, ఫడ్నవీస్.. కీలక పర్యటన
Updated Date - 2023-04-10T15:38:40+05:30 IST