Parliament : రాష్ట్రాలను హెచ్చరించిన మోదీ
ABN, First Publish Date - 2023-02-09T16:58:14+05:30
రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పిలుపునిచ్చారు.
న్యూఢిల్లీ : రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు గురువారం రాజ్యసభలో ఆయన సమాధానం చెప్తూ, రాజకీయ పార్టీలు దేశ భావి తరాల బాలల భవితతో ఆటలాడుకోకూడదని హెచ్చరించారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాత పింఛను పథకం (OPS)ను అమలు చేయడానికి ప్రయత్నిస్తుండటాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. మన పొరుగు దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న విషయాన్ని గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వాల కార్యకలాపాల్లో కేంద్రం జోక్యం చేసుకుంటోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ పరిపాలనా కాలంలో 50 సార్లు భారత రాజ్యాంగంలోని అధికరణ 356ను ప్రయోగించి, రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చి, రాష్ట్రపతి పాలనను విధించిందన్నారు.
ఉద్యోగం, ఉపాధి
ప్రతిపక్ష పార్టీలు ఉద్యోగం, ఉపాధి మధ్య తేడాను అర్థం చేసుకోవడం లేదన్నారు. డిజిటల్ ఇండియా విస్తరించినందువల్ల డిజిటల్ ఆర్థిక వ్యవస్థ నూతన రంగం వికసిస్తోందని చెప్పారు. మన దేశంలో 90 వేల రిజిస్టర్డ్ స్టార్టప్స్ ఉన్నాయని, ఇవి ఉపాధికి నూతన అవకాశాలను అందుబాటులోకి తీసుకొచ్చాయని తెలిపారు. 2020లో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) పేరోల్ (PayRoll)లో 1 కోటి మందికిపైగా నమోదయ్యారన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన వల్ల 60 వేల మందికిపైగా లబ్ధి పొందారన్నారు.
మొబైల్ ఫోన్లు
మన దేశం గతంలో మొబైల్ ఫోన్లను దిగుమతి చేసుకునేదని, ఇక ఎంత మాత్రం మొబైల్ ఫోన్ల దిగుమతిదారు కాదని, ఇప్పుడు మనమే వీటిని ఎగుమతి చేస్తున్నామని తెలిపారు.
శాస్త్రవేత్తలను అవమానించారు
కోవిడ్-19 మహమ్మారి ప్రకోపానికి గురైన ప్రపంచానికి వ్యాక్సిన్లను ఇచ్చిన భారతీయ శాస్త్రవేత్తలను అగౌరవపరచే, అవమానించే ప్రయత్నాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయుష్మాన్ కార్డ్
వైద్యం కోసం అయ్యే ఖర్చులకు భయపడే మహిళలకు ఆయుష్మాన్ కార్డు ద్వారా బీమా ప్రయోజనాలను కల్పించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు చిన్న తరహా రైతుల అభివృద్ధికి దోహదపడ్డాయన్నారు. వీటివల్ల భారత దేశ పేదలు సాధికారులయ్యారని తెలిపారు.
బుజ్జగింపులు
అన్ని పథకాల అమలులో నూటికి నూరు శాతం సంతృప్తిని సాధించేందుకు కృషి చేస్తామని తెలిపారు. దీనివల్ల అన్ని రకాల బుజ్జగింపులకు తెరపడుతుందన్నారు. స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన అమృత కాలంలో ఇది నిజమైన లౌకికవాదమని తెలిపారు. నిజమైన లౌకికవాదం అంటే అందరూ సంతృప్తి చెందడమేనన్నారు. కేవలం ఉద్దేశాన్ని వ్యక్తం చేయడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు. వేగం, దిశ, ఫలితాలే అభివృద్ధికి ముఖ్యమైనవని తెలిపారు. ‘అందరితో కలిసి, అందరి అభివృద్ధి’ అంటే ప్రభుత్వం వల్ల కలిగే లబ్ధి సమాజంలోని ప్రతి వర్గానికి తప్పనిసరిగా చేరడమేనని తెలిపారు. తాము నిజమైన లౌకికవాదాన్ని ఆచరిస్తున్నామన్నారు. అన్ని రకాల వివక్షను నిర్మూలించడమే తమ ఆశయమని చెప్పారు. ప్రభుత్వ నినాదం ‘అందరితో కలిసి, అందరి అభివృద్ధి’ అని చెప్పారు. దేశం మద్దతు తమకు ఉందని తెలిపారు. దేశం కాంగ్రెస్‌ను అనేకసార్లు తిరస్కరించిందన్నారు.
గిరిజనుల కోసం...
గిరిజనులు అభివృద్ధి చెందకుండా కాంగ్రెస్ నిరోధించిందన్నారు. ఆ పాపాలకు శిక్షను ఆ పార్టీ ఇప్పుడు అనుభవిస్తోందన్నారు. వెనుకబడిన వర్గాలన్నిటికీ కొత్త బడ్జెట్ గొప్ప అవకాశాలను కల్పించిందని చెప్పారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న 110 జిల్లాలను తాము గుర్తించామని, వీటిని సత్వరం అభివృద్ధి చేయడానికి ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. నిరంతర కృషితో ఈ జిల్లాల్లో విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయన్నారు. ఈ జిల్లాల అభివృద్ధిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ అభివృద్ధి వల్ల 3 కోట్ల మందికిపైగా లబ్ధి పొందుతున్నారని చెప్పారు. 2014వ సంవత్సరానికి ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు గిరిజనుల కోసం సుమారు రూ.20,000 కోట్లు కేటాయించిందన్నారు. అయితే తన ప్రభుత్వం రూ.1.20 లక్షల కోట్లు కేటాయించిందని తెలిపారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో ఐదు రెట్లు ఎక్కువ నిధులను గిరిజనాభివృద్ధి కోసం కేటాయించినట్లు చెప్పారు. నాలుగు దశాబ్దాలకు పైగా ఏమీ చేయని కాంగ్రెస్‌ను భారత దేశం తిరస్కరించిందని చెప్పారు. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
2014 వరకు (మోదీ ప్రభుత్వానికి పూర్వం) దేశ జనాభాలో సగం మందికిపైగా బ్యాంకింగ్ సదుపాయాలు ఉండేవి కాదన్నారు. గడచిన తొమ్మిదేళ్ళలో 48 కోట్లకుపైగా బ్యాంకు ఖాతాలను కొత్తగా తెరిచారన్నారు. దేశ సమస్యలకు శాశ్వత పరిష్కారాలను కనుగొనడంపైనే తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. టెక్నాలజీ సహాయంతో పని సంస్కృతిని మార్చామని చెప్పారు. వేగాన్ని మరింత పెంచడం, పరిధిని విస్తరించడంపై దృష్టి సారించామని చెప్పారు. అందరినీ సాధికారులను చేయడానికి బీజేపీ కృషి చేస్తోందన్నారు. అందరికీ మెరుగైన జీవితాన్ని అందించడం కోసం తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు.
కాంగ్రెస్ బాధ
కాంగ్రెస్ అనుభవిస్తున్న బాధను తాను అర్థం చేసుకోగలనని మోదీ చెప్పారు. భారత దేశంలో కాంగ్రెస్ ఖాతాను బీజేపీ మూసేసిందన్నారు. కాంగ్రెస్ దేశంలో అభివృద్ధికి ఆటంకాలు సృష్టించిందన్నారు. ఆ పార్టీ పరిపాలన కాలాన్ని దేశం నష్టపోయిందని, అదే సమయంలో చిన్న చిన్న దేశాలు అభివృద్ధి చెందాయని అన్నారు.
Updated Date - 2023-02-09T16:58:20+05:30 IST