Vande Bharat Express: మరో వందే భారత్ రైలుకు మోదీ పచ్చజెండా
ABN, Publish Date - Dec 18 , 2023 | 05:16 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో జరుపుతున్న రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా వారణాసి నుంచి ఢిల్లీకి మరో కొత్త వందేభారత్ రైలును ప్రధాని సోమవారంనాడు ప్రారంభించారు. వారణాసి-ఢిల్లీ మార్గంలో ఇప్పటికే ఒక రైలు రాకపోకలు సాగిస్తుండగా ఇది రెండవది.
వారణాసి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తన సొంత నియోజకవర్గమైన వారణాసి(Varanasi)లో జరుపుతున్న రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా వారణాసి నుంచి ఢిల్లీకి మరో కొత్త వందేభారత్ రైలు (Vande Bharat Express)ను (ట్రైన్ నెంబర్-04015) ప్రధాని సోమవారంనాడు ప్రారంభించారు. వారణాసి-ఢిల్లీ మార్గంలో ఇప్పటికే ఒక రైలు రాకపోకలు సాగిస్తుండగా ఇది రెండవది. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తదితరులు పాల్గొన్నారు.
అధునాతన ఫీచర్లతో ఈ రైలును తీర్చిదిద్దినట్టు రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో వైఫై సేవలు, జీపీఎస్ ఆధారిత ప్రయాణికుల సమాచార వ్యవస్థ, టచ్ ఫ్రీ సౌకర్యాలతో కూడిన బయో వాక్యూమ్ టాయిలెట్లు, డిఫ్యూడ్జ్ ఎల్ఈడీ లైటింగ్ వంటివి ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. తాజా వందే భారత్ రైలుతో ఇంతవరకూ దేశవ్యాప్తంగా ప్రవేశపట్టిన వందే భారత్ సెమీ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సంఖ్య 35కు చేరినట్టు తెలిపింది. కాగా, ప్రధాని తాజాగా ప్రారంభించిన వందే భారత్ రైలు మంగళవారం మినహా మిగతా రోజుల్లో వారణాసి నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.05 గంటలకు ఢిల్లీ చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి రాత్రి 11.05 గంటలకు వారణాసి చేరుకుంటుంది.
Updated Date - Dec 18 , 2023 | 05:17 PM