Vande Bharat Express : ఒడిశా తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించిన మోదీ
ABN, First Publish Date - 2023-05-18T15:09:08+05:30
ఒడిశా తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు.
న్యూఢిల్లీ : ఒడిశా తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. పురి-హౌరా మధ్య నడిచే ఈ వందే భారత్ రైలు పశ్చిమ బెంగాల్‌కు రెండోది. దీనివల్ల ప్రయాణికులకు దాదాపు ఒక గంట సమయం ఆదా అవుతుంది. ఈ సందర్భంగా మోదీ రూ.8,000 కోట్లు విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. మోదీ మాట్లాడుతూ, వందే భారత్ (Vande Bharat Express) రైళ్లను మన దేశమే సొంతంగా తయారు చేసిందన్నారు. నేడు మన దేశం 5జీ సేవలను మారుమూల ప్రాంతాలకు సైతం అందుబాటులోకి తెస్తోందన్నారు. ఈ సందర్భంగా మోదీ రూ.8,000 కోట్లు విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. పురి, కటక్ రైల్వే స్టేషన్ల అభివృద్ధి ప్రాజెక్టులు; ఒడిశాలో రైల్ నెట్‌వర్క్ సంపూర్ణ విద్యుదీకరణ ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి. రైల్ నెట్‌వర్క్ సంపూర్ణ విద్యుదీకరణ వల్ల నిర్వహణ ఖర్చులు ఆదా అవుతాయి, దిగుమతి చేసుకునే క్రూడాయిల్‌పై ఆధారపడటం తగ్గుతుంది.
పురి-హౌరా వందే భారత్ రైలు ఆరున్నర గంటల్లో 500 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ప్రస్తుతం శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు 7 గంటల 35 నిమిషాల్లో 500 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తోంది. అంటే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణం వల్ల ప్రయాణికులకు ఓ గంట ఆదా అవుతుందన్నమాట.
16 బోగీలు ఉండే పురి-హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఖరగ్‌పూర్, భద్రక్, బాలాసోర్, కటక్, భువనేశ్వర్, ఖుర్దా స్టేషన్లలో ఆగుతుంది. గురువారాల్లో మినహా ఇతర రోజుల్లో ఇది నడుస్తుంది. హౌరాలో ఉదయం 6.10 గంటలకు బయల్దేరి, మధ్యాహ్నం 12.35 గంటలకు పురి స్టేషన్‌కు చేరుతుంది. పురిలో మధ్యాహ్నం 1.50 గంటలకు బయల్దేరి, హౌరాకు రాత్రి 8.30 గంటలకు చేరుతుంది.
పురి-హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో చైర్ కార్ టికెట్ ధర రూ.1,590 (కేటరింగ్ రూ.308తో కలిపి), ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధర రూ.2,815 (కేటరింగ్ రూ.369తో కలిపి). పురి నగరానికి పశ్చిమ బెంగాల్ పరిసరాల నుంచి పెద్ద ఎత్తున ప్రయాణికులు వస్తూ ఉంటారు. పురి జగన్నాథుని దర్శించుకోవడం కోసం భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. అదే విధంగా ఇది బీచ్ రిసార్ట్ టౌన్ కూడా కావడంతో పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువే. కాబట్టి ఈ రైలుకు జనాదరణ బాగా ఉండవచ్చు.
ఇవి కూడా చదవండి :
Karnataka : కర్ణాటక కాంగ్రెస్ శాసన సభా పక్ష సమావేశం సాయంత్రం 7 గంటలకు : డీకే
Karnataka : కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం సిద్ధరామయ్యకే!
Updated Date - 2023-05-18T15:09:08+05:30 IST