PM Modi: నన్ను 91 సార్లు దూషించారు
ABN , First Publish Date - 2023-04-30T02:38:47+05:30 IST
లింగాయత్ సోదరులను అవినీతి పరులన్నారు. అయితే, నన్ను దూషించిన ప్రతిసారీ ప్రజలు వారికి తగిన..

అంబేడ్కర్, సావర్కర్‌నూ వదల్లేదు..లింగాయత్‌లను అవినీతి పరులన్నారు: మోదీ
బెంగళూరు(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు తనను 91 సార్లు దూషించారని ప్రధాని మోదీ అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిమిత్తం శనివారం రాష్ట్రానికి వచ్చిన మోదీ పలు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేసి బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. బీదర్ జిల్లా హుమ్నాబాద్‌లో ర్యాలీలో మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ నేతలు నన్ను విష సర్పం.. చౌకీదార్ చోర్ అని ప్రచారం చేస్తున్నారు. లింగాయత్ సోదరులను అవినీతి పరులన్నారు. అయితే, నన్ను దూషించిన ప్రతిసారీ ప్రజలు వారికి తగిన గుణపాఠం నేర్పారు’’ అని మోదీ వ్యాఖ్యానించారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను, దేశం కోసం పోరాడిన సావర్కర్‌ను విమర్శించిన వారు తనను వదిలిపెడతారా? అంటూ కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. గతంలో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం.. ‘ప్రధాని కిసాన్ సమ్మాన్’ పథకంలో లబ్ధిదారుల జాబితాను కేంద్రానికి పంపలేదని విమర్శించారు. ఆ పథకంలో లూటీ చేసేందుకు వారికి అవకాశం లేకపోవడంతో వెనకడుగు వేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలకు పేదల కష్టాలు అర్థం కావని అన్నారు. ‘‘డబుల్ ఇంజన్ పాలనలో పేదల సంక్షేమం వేగవంతంగా సాగుతోంది. డబుల్ ఇంజిన్ అంటే డబుల్ బెనిఫిట్, డబుల్ స్పీడ్. ఇటు రాష్ట్రం, అటు కేంద్రంలోను బీజేపీ ప్రభుత్వాలు ఉంటే డబుల్ శక్తి వస్తుంది. తద్వారా దేశంలోనే కర్ణాటక నంబర్ వన్‌గా మారుతుంది. బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చి, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు ఆశీస్సులు అందించాలి’’ అని ప్రధాని కోరారు. తనకు ఇవే చివరి ఎన్నికలు అన్న కాంగ్రెస్ నేత సిద్దరామయ్య ప్రకటనపై మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘అలసిపోయి, ఓడిపోయిన కాంగ్రె్‌సను ప్రజలు ఎన్నుకోరు. ఉత్సాహంతో నిండిన బీజేపీని గెలిపిస్తారు’’ అని అన్నారు. ఈసారి సంపూర్ణ మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందనే మాట కర్ణాటకలోని మారుమూల ప్రాంతాల్లోనూ ప్రతిధ్వనిస్తోందని చెప్పారు.
దేశమంతా డబుల్ ఇంజన్: అమిత్ షా
కాంగ్రెస్ ముక్త భారత్ కోసం దేశ ప్రజలు నడుం బిగించారని, ఇక దేశమంతా డబుల్ ఇంజన్ ప్రభుత్వాలే ఏర్పడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. కొడగు జిల్లాలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ విభజన, బుజ్జగింపు రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు. కాంగ్రెస్ గ్యారంటీ పఽథకాలను విశ్వసించవద్దని, ఆ పార్టీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికే వీటి డొల్లతనం బయటపడిందని విమర్శించారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వాల కోసం బీజేపీకి పూర్తి మెజార్టీ ఇవ్వాలని ప్రజలను కోరారు.
సొంతబాధల తొలి ప్రధాని!
‘‘ప్రజల కష్టాలు వినకుండా, వారి ముందు సొంత బాధలు చెప్పుకొంటున్న తొలి ప్రధాని మోదీ’’ అని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక మండిపడ్డారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నవలగందలో నిర్వహించిన రోడ్‌షోలో ఆమె పాల్గొన్నారు. ‘‘దేశంలో ఎంతోమంది ప్రధానులను చూశా. వారెవరూ మోదీలా సొంత బాధలు చెప్పుకోలేదు’’ అన్నారు. కర్ణాటకలో అవినీతిపరులకు బీజేపీ టికెట్లు ఇచ్చిందని విమర్శించారు. 40ు కమీషన్ వ్యవహారాన్ని భరించలేక పోతున్నామని కాంట్రాక్టర్ల సంఘం ప్రతినిధులు ప్రధానికి స్వయంగా లేఖ పంపినా స్పందన లేదన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దిక్సూచి కానున్నాయని, కాంగ్రెస్ విజయాలకు ఈ ఎన్నికలు నాంది పలకడం ఖాయమని కేపీసీసీ అధ్యక్షుడు శివకుమార్ అన్నారు.