No-confidence motion : అవిశ్వాస తీర్మానంపై చర్చకు మోదీ సమాధానం మరి కాసేపట్లో
ABN, First Publish Date - 2023-08-10T09:36:11+05:30
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చ హోరాహోరీగా సాగుతోంది. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ లోక్ సభలో మంగళవారం ప్రారంభించిన ఈ చర్చ రెండో రోజైన బుధవారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలతో రణరంగంగా మారింది.
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చ హోరాహోరీగా సాగుతోంది. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ లోక్ సభలో మంగళవారం ప్రారంభించిన ఈ చర్చ రెండో రోజైన బుధవారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలతో రణరంగంగా మారింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సుదీర్ఘ ఉపన్యాసంలో అనేక అంశాలను స్పృశించారు. మూడో రోజైన గురువారం మధ్యాహ్నం ఈ చర్చకు మోదీ సమాధానం చెప్పబోతున్నారు.
మూడు నెలల నుంచి హింసాత్మక ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్ సమస్యపై ప్రధాని మోదీ మాట్లాడాలనే డిమాండ్‌తో ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్ష భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి (I.N.D.I.A.) ప్రతిపాదించింది. దీనిపై మంగళ, బుధవారాల్లో వాడి వేడి చర్చ జరిగింది. ఈ చర్చకు మోదీ గురువారం మధ్యాహ్నం సమాధానం చెబుతారు.
మోదీ గురువారం ఈ తీర్మానానికి సమాధానం చెబుతారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం లోక్ సభకు తెలిపారు. ఈ తీర్మానంపై చర్చలో భాగంగా అధికార, ప్రతిపక్షాలు హోరాహోరీగా తలపడ్డాయి. మణిపూర్‌లో విభజన సృష్టించారని ప్రతిపక్షాలు ఆరోపించగా, తాము సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది.
కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ మంగళవారం ఈ చర్చను ప్రారంభిస్తూ, మోదీ మౌనవ్రతాన్ని భంగం చేయడానికే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం మాట్లాడుతూ, అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చి అయోమయం సృష్టిస్తున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలు రైతులకు కానీ, పేదలకు కానీ మిత్రులు కాదన్నారు. వెనుకబడిన వర్గాలవారికి కూడా వీరు మిత్రులు కాదన్నారు. వారికి వారి కుటుంబ సభ్యుల గురించి తప్ప ఇతరుల గురించి ఆందోళన లేదన్నారు.
ఈ తీర్మానం గెలవాలంటే కనీసం 272 మంది ఎంపీల మద్దతు అవసరం. కానీ దాదాపు 331 మంది ఎంపీలు ప్రభుత్వానికి మద్దతిచ్చే అవకాశం ఉంది. ఈ తీర్మానాన్ని ప్రతిపాదించిన ఇండియా కూటమికి 144 మంది ఎంపీల బలం ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ కూడా మద్దతిస్తే ఈ సంఖ్య 152కు చేరుతుంది.
తీర్మానం వీగిపోవడం ఖాయమని తెలిసినప్పటికీ ఇండియా కూటమి ఈ చర్యకు ముందడుగు వేసింది. మణిపూర్ సమస్యపై మోదీ మాట్లాడేలా చేయడం ద్వారా ‘పైకి కనిపించే యుద్ధం’లో గెలవడం కోసం ఇది దోహదపడుతుందని సమర్థించుకుంటోంది.
ఇవి కూడా చదవండి :
Chennai: 12 నుంచి చెన్నైలో చాగంటి ప్రవచనాలు
Solar power: 20 ఎకరాల్లో సౌర విద్యుత్ కేంద్రం
Updated Date - 2023-08-10T09:36:11+05:30 IST