Congress Vs Prashant Kishor : కాంగ్రెస్‌ను ఏకి పారేసిన ప్రశాంత్ కిశోర్
ABN, First Publish Date - 2023-04-01T16:25:20+05:30
భారత్ జోడో యాత్ర, రాహుల్ గాంధీపై అనర్హత వేటు వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒనగూరేదేమీ లేదని ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్
పాట్నా : భారత్ జోడో యాత్ర, రాహుల్ గాంధీపై అనర్హత వేటు వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒనగూరేదేమీ లేదని ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. బిహార్‌లో జన సురాజ్ యాత్ర చేస్తున్న ప్రశాంత్ కిశోర్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ పార్టీకి వాస్తవాలను కళ్లకు కట్టినట్లు చూపించారు.
2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం ఏది? అని ప్రశ్నించినపుడు ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీయే ప్రధాన ప్రతిపక్షం అని చెప్పడానికి ఎటువంటి సందేహం అక్కర్లేదన్నారు. ఆ పార్టీకి దాదాపు 11 కోట్ల ఓట్లు వచ్చాయని, బీజేపీ తర్వాత అతి పెద్ద పార్టీ అదేనని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయని, అది చాలా పాత పార్టీ అని చెప్పారు. కొత్తవారిని చేర్చుకోవాలని, క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని గతంలో తాను ఆ పార్టీకి చెప్పానన్నారు. తన ఆలోచనలను ఆ పార్టీ ఇష్టపడిందని, వాటిని అమలు చేసేందుకు తనను ఆహ్వానించిందని చెప్పారు. అయితే ‘‘నేను అనుసరించవలసిన ప్రక్రియపై వారికి స్పష్టత లేదు’’ అని చెప్పారు. వారిని గౌరవిస్తూనే, ‘‘మీరు చెప్పిన పద్ధతుల్లో నేను పని చేయలేను’’ అని వారికి చెప్పానని తెలిపారు.
మోదీ ఇంటిపేరును అవమానించిన కేసులో రాహుల్ గాంధీ అనర్హత వేటుకు గురికావడంపై కాంగ్రెస్ నిరసన తెలిపిందని, దానివల్ల పార్టీకి మేలు జరుగుతుందని ఆ పార్టీ పెద్దలు భావించారని తెలిపారు. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) గురించి కూడా కాంగ్రెస్ పెద్దలు అదేవిధంగా భావించారని తెలిపారు ఆ యాత్ర జరిగిన తర్వాత వచ్చిన గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం పాలైందన్నారు. కేవలం ఓ సంఘటన పార్టీని పునరుజ్జీవింపజేయదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 1989 నుంచి క్షీణిస్తోందని గుర్తించాలన్నారు. చిట్టచివరిసారి ఆ పార్టీ 1984లో గెలిచిందన్నారు. అయితే భారత దేశాన్ని ఆ పార్టీ గెలవలేకపోయిందన్నారు. మౌలిక సంస్కరణ అవసరమని చెప్పారు. ప్రజలకు తమ భావాలను చెప్పే తీరులో కూడా సంస్కరణలు రావాలన్నారు.
రాహుల్ గాంధీపై అనర్హత వేటుపై...
2019లో కర్ణాటకలో ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ‘‘దొంగలందరికీ ఇంటి పేరు మోదీ ఎలా అవుతోంది?’’ అని ప్రశ్నించినందుకు సూరత్ కోర్టు ఆయనను దోషిగా ప్రకటించి, ఆయనకు రెండేళ్ళ జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీనిపై అపీలు చేసుకోవడానికి ఆయనకు 30 రోజుల గడువును సూరత్ కోర్టు ఇచ్చింది. ఈ శిక్ష నేపథ్యంలో పార్లమెంటు సచివాలయం రాహుల్ గాంధీని లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించింది. దీని గురించి ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడటం దురదృష్టకరమని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు న్యాయపరంగా సరైనవా? కాదా? అనే విషయంపై తాను లోతుగా వెళ్లబోనని తెలిపారు. అధికారంలో ఉన్న పార్టీ దేశంలోని చట్టాలను గౌరవిస్తూనే, ఈ అంశాన్ని విభిన్నంగా చూసి ఉండవలసిందన్నారు. ‘‘ఇక్కడ నేను అటల్ బిహారీ వాజ్‌పాయి గారిని ప్రస్తావించాలనుకుంటున్నాను. పెద్ద మనిషిగా వ్యవహరించాలని ఆయన చెప్పారు. ఉన్నత న్యాయస్థానానికి వెళ్లే అవకాశం రాహుల్ గాంధీ పొంది ఉండాలి’’ అన్నారు. దీన్నిబట్టి ప్రజలు ఆటోమేటిక్‌గా కాంగ్రెస్‌కు ఓటు వేయడం ప్రారంభిస్తారని కాదన్నారు. ‘‘మీకు అన్యాయం జరిగింది, అయితే దాని గురించి మీరు సమాజానికి తెలియజేయాలి’’ అన్నారు. ‘‘సమాజం ఆటోమేటిక్‌గా మీకు అండగా నిలబడుతుందని అనుకోవద్దు’’ అన్నారు. ‘‘నేను ఈ గ్రామంలో నాలుగైదు రోజుల నుంచి ఉన్నాను. ఈ సమయంలో కాంగ్రెస్ నాయకులు వచ్చి, తమ వైఖరిని ప్రజలకు చెప్పినట్లు నేను చూడలేదు. ప్రజలకు ఎలా తెలుస్తుంది? నన్నే చూడండి. నేను ప్రజలకు చేరువగా వెళ్తున్నాను. ఢిల్లీలో కూర్చుని విలేకర్ల సమావేశాలను నిర్వహించడం లేదు. కేవలం ప్రజలకు తెలియజేయడం వల్ల ప్రయోజనం ఉండదు. ప్రజలు కాంగ్రెస్ కోసం ఎందుకు నిలబడాలి?’’ అని ప్రశ్నించారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి పదవికి జరిగే పోటీలో ఎవరు ముందు వరుసలో ఉంటారని ప్రశ్నించినపుడు ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ, నేటి విశ్లేషణ ప్రకారం, నరేంద్ర మోదీయేనని చెప్పారు.
రాహుల్ గాంధీ భవిష్యత్తు గురించి అడిగిన ప్రశ్నకు ప్రశాంత్ బదులిస్తూ, ‘‘మీరు కాంగ్రెస్ మద్దతుదారు అయితే, ఆయన బాగానే పని చేస్తున్నట్లు. తటస్థంగా మాట్లాడితే, ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం పొందలేదు. ఆయన బాగా పని చేయడం లేదు’’ అని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Jayamangala VenkataRamana: అమరావతి రైతులు ముందు నోరుజారిన వైసీపీ ఎమ్మెల్సీ..!
Hindus in danger : బీజేపీ ఆరోపణలపై మహువా మొయిత్రా మండిపాటు
Updated Date - 2023-04-01T16:48:49+05:30 IST