Congress Vs BJP : ముస్లిం లీగ్ పూర్తి సెక్యులర్ పార్టీ : రాహుల్ గాంధీ
ABN, First Publish Date - 2023-06-02T11:59:27+05:30
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ పూర్తి సెక్యులర్ పార్టీ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఘంటాపథంగా చెప్పడంతో బీజేపీ, కాంగ్రెస్ మధ్య వాగ్యుద్ధం జరుగుతోంది.
వాషింగ్టన్ : ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ పూర్తి సెక్యులర్ పార్టీ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఘంటాపథంగా చెప్పడంతో బీజేపీ, కాంగ్రెస్ మధ్య వాగ్యుద్ధం జరుగుతోంది. అమెరికాలోని నేషనల్ ప్రెస్ క్లబ్‌లో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు రాహుల్ చెప్పిన సమాధానానికి సంబంధించిన వీడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.
రాహుల్ గాంధీ అమెరికా, వాషింగ్టన్ డీసీలోని నేషనల్ ప్రెస్ క్లబ్‌లో పాత్రికేయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ విలేకరి ఆయనకు ఓ ప్రశ్న వేశారు. కాంగ్రెస్ లౌకికవాద పార్టీ అని, బీజేపీ హిందుత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పుకుంటోందని, అలాంటపుడు కేరళలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీతో ఎలా పొత్తు పెట్టుకున్నారని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రాహుల్ గాంధీ బదులిస్తూ, ముస్లిం లీగ్ పూర్తిగా లౌకికవాద పార్టీ అని తెలిపారు. ముస్లిం లీగ్‌లో నాన్ సెక్యులర్ అంశం ఏదీ లేదన్నారు. ఈ ప్రశ్న అడిగిన వ్యక్తి ముస్లిం లీగ్ గురించి అధ్యయనం చేయలేదన్నారు.
దీనిపై బీజేపీ స్పందిస్తూ, రాహుల్ గాంధీ నిజాయితీ లేకుండా మాట్లాడారని మండిపడింది. కేరళలోని వయనాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయన గెలిచిన విషయాన్ని గుర్తు చేస్తూ, వయనాద్‌లో అంగీకార యోగ్యమైన నేతగా కొనసాగడం కోసం, నిర్బంధం వల్ల ఆయన ముస్లిం లీగ్‌ను సెక్యులర్ పార్టీ అన్నారని దుయ్యబట్టింది.
బీజేపీ ఐటీ సెల్ ఇన్‌ఛార్జి అమిత్ మాలవీయ ఇచ్చిన ట్వీట్‌లో, భారత దేశం మతపరంగా విడిపోవడానికి కారకుడైన మహమ్మద్ అలీ జిన్నాకు సంబంధించిన ముస్లిం లీగ్ సెక్యులర్ పార్టీ అని రాహుల్ గాంధీ అంటున్నారన్నారు. రాహుల్ గాంధీకి ఈ విషయంలో నిజాయితీ లేదని, ఆయన మాటలు కపటంతో కూడుకుని ఉన్నాయని అన్నారు. వయనాద్‌లో ఆమోదయోగ్యంగా ఉండటం ఆయనకు తప్పనిసరి అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ నేత పవన్ ఖేరా స్పందిస్తూ, ‘‘సోదరా, చదువుకోలేదా?’’ అని ప్రశ్నించారు. కేరళలోని ముస్లిం లీగ్‌కు, జిన్నా స్థాపించిన ముస్లిం లీగ్‌కు తేడా ఉందని తెలియదా? అని నిలదీశారు. జిన్నా ముస్లిం లీగ్‌తో మీ ముత్తాతలు జట్టుకట్టారన్నారు. రెండో ముస్లిం లీగ్‌తో బీజేపీ జట్టుకట్టిందన్నారు. 2012లో నాగపూర్ నగరపాలక సంస్థలో అధికారం కోసం ఇద్దరు ఐయూఎంఎల్ కార్పొరేటర్లతో బీజేపీ పొత్తు పెట్టుకోవడాన్ని గుర్తు చేశారు. కేరళలో యూడీఎఫ్ కూటమిలో ఐయూఎంఎల్, కాంగ్రెస్ భాగస్వాములనే సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి సుప్రియ శ్రినటే ఇచ్చిన ట్వీట్‌లో, అమిత్ మాలవీయను ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వ్యక్తిగా అభివర్ణించారు. నిద్ర లేని రాత్రులు గడుపుతుండటం చూడటం సంతోషంగా ఉందన్నారు. రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి మరికొన్ని నిద్ర లేని రాత్రులు గడపటానికి సిద్ధంగా ఉండాలని సలహా ఇచ్చారు. నీకు చాలా కష్టం వచ్చిపడిందని ఎద్దేవా చేశారు.
వాషింగ్టన్ డీసీలోని నేషనల్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. భారత దేశంలో ప్రతిపక్షాల ఐక్యత, మత స్వేచ్ఛ, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మైనారిటీల పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ వంటివాటి గురించి పాత్రికేయులు ఆయనను ప్రశ్నించారు. భారత దేశంలో ప్రతిపక్షాలు ఐకమత్యంగా ఉన్నాయని, రానున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తాయని రాహుల్ చెప్పారు. కర్ణాటకలో బీజేపీని గద్దె దించి, కాంగ్రెస్ ఘన విజయం సాధించడం గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ, రాబోయే మూడు, నాలుగు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల ఫలితాల కోసం వేచి చూడమని కోరారు. ఏం జరగబోతోందో చెప్పడానికి ఇదే మంచి సంకేతమని చెప్పారు. ఇది చాలా సంక్లిష్టమైన చర్చ అని తెలిపారు. ఇతర ప్రతిపక్ష పార్టీలతో కూడా మనం పోటీ పడుతున్న సందర్భాలు ఉన్నాయన్నారు. అవసరమైనట్లుగా ఇచ్చి, పుచ్చుకోవడం తప్పనిసరి అన్నారు. అలా జరుగుతుందని తాను గట్టి నమ్మకంతో ఉన్నానని చెప్పారు.
ఇవి కూడా చదవండి :
Congress : ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయి.. 2024లో అనూహ్య ఫలితాలు.. : రాహుల్ గాంధీ
Updated Date - 2023-06-02T11:59:27+05:30 IST