Parliament : పార్లమెంటుకు రాహుల్ గాంధీ?... క్షమాపణ చెప్పబోతున్నారా?...
ABN, First Publish Date - 2023-03-16T11:14:15+05:30
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Congress MP Rahul Gandhi) గురువారం పార్లమెంటుకు హాజరవుతారని ఆ పార్టీ వర్గాలు చెప్పాయి.
న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Congress MP Rahul Gandhi) గురువారం పార్లమెంటుకు హాజరవుతారని ఆ పార్టీ వర్గాలు చెప్పాయి. బ్రిటన్‌లో ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన పార్లమెంటుకు హాజరుకాబోతున్నారు. భారత దేశంలో ప్రజాస్వామిక నిర్మాణం దాడికి గురవుతోందని ఆయన ఆరోపించిన సంగతి తెలిసిందే.
క్షమాపణ చెప్పేది లేదు : ఖర్గే
కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గతంలో చాలాసార్లు విదేశాల్లో భారత దేశానికి వ్యతిరేకంగా మాట్లాడారన్నారు. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పబోరని, అటువంటి ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అదానీ అవకతవకలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ దర్యాప్తునకు ఆదేశించాలని తాము డిమాండ్ చేస్తున్నామని, దానిని తప్పించుకునేందుకు పార్లమెంటును సజావుగా జరగనివ్వకూడదని అధికార పక్షం కుట్ర పన్నుతోందని ఆరోపించారు.
రాజ్యాంగంలోని అధికరణ 105 ప్రకారం ఎంపీలకు వాక్ స్వాతంత్ర్యం ఉందని, దీని సారం, స్ఫూర్తి, ప్రాధాన్యం గురించి చర్చించాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ (Congress MP Manish Tewari) లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ (AAP MP Sanjay Singh) రాజ్యసభ కార్యకలాపాలను సస్పెండ్ చేయాలని నోటీసు ఇచ్చారు. అదానీ అక్రమాలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు.
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, రాహుల్ గాంధీ వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ ఇబ్బందుల్లో పడితే, తమకు ఏమీ సంబంధం లేదన్నారు. అయితే రాహుల్ మన దేశాన్ని కించపరిస్తే, ఈ దేశ ప్రజలుగా తాము మౌనంగా ఉండలేమని చెప్పారు. ఆయన లండన్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో మాట్లాడినపుడు మన దేశ ప్రజాస్వామ్యాన్ని, న్యాయ వ్యవస్థను, యావత్తు దేశాన్ని అవమానించారన్నారు. ఆయన లండన్‌లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినవారిపై మనం గళమెత్తాలన్నారు.
ఇవి కూడా చదవండి :
President: 18న కన్నియాకుమారికి రాష్ట్రపతి
Nobel Peace Prize : మోదీకి నోబెల్ శాంతి బహుమతి... నోబెల్ ప్రైజ్ కమిటీ నేత సంచలన వ్యాఖ్యలు...
Updated Date - 2023-03-16T11:14:15+05:30 IST