Shashi Tharoor : సీడబ్ల్యూసీ పదవిపై శశి థరూర్ హర్షం
ABN, First Publish Date - 2023-08-20T18:01:41+05:30
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తనకు స్థానం కల్పించడంపై ఆ పార్టీ ఎంపీ శశి థరూర్ హర్షం ప్రకటించారు. మల్లికార్జున ఖర్గే, పార్టీ అధిష్ఠానం తనను గౌరవించారని తెలిపారు. మరింత సమ్మిళితత్వంతో కూడిన భారత దేశాన్ని కోరుకునే లెక్కలేనంత మంది భారతీయులు పార్టీ నుంచి అత్యుత్తమమైనవాటిని పొందడానికి అర్హులని చెప్పారు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC)లో తనకు స్థానం కల్పించడంపై ఆ పార్టీ ఎంపీ శశి థరూర్ హర్షం ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge), పార్టీ అధిష్ఠానం తనను గౌరవించారని తెలిపారు. మరింత సమ్మిళితత్వంతో కూడిన భారత దేశాన్ని కోరుకునే లెక్కలేనంత మంది భారతీయులు పార్టీ నుంచి అత్యుత్తమమైనవాటిని పొందడానికి అర్హులని చెప్పారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం సీడబ్ల్యూసీని పునర్వ్యవస్థీకరించారు. 39 మంది సభ్యులను, 32 మంది శాశ్వత ఆహ్వానితులను, 13 మంది ప్రత్యేక ఆహ్వానితులను ప్రకటించారు. శశి థరూర్ గత ఏడాది జరిగిన పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఖర్గేపై పోటీ చేశారు. అదేవిధంగా పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలని గతంలో సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది నేతల్లో ఆయన ఒకరు. పార్టీలో నిర్ణయాలు తీసుకునే అత్యున్నత స్థాయి వ్యవస్థ సీడబ్ల్యూసీయే అనే సంగతి తెలిసిందే.
మల్లికార్జున ఖర్గే, మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, రాజస్థాన్ యువ నేత సచిన్ పైలట్, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్, లోక్ సభలో ఆ పార్టీ నేత అధిర్ రంజన్ చౌదరి, కమ్యూనికేషన్ల విభాగం ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్, సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, పీ చిదంబరంలకు సీబ్ల్యూసీలో స్థానం కల్పించారు.
శశి థరూర్ ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తనను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయించడం తనకు గౌరవప్రదమని తెలిపారు. 138 ఏళ్లకుపైగా పార్టీకి మార్గదర్శనం చేయడంలో సీడబ్ల్యూసీ పోషించిన చరిత్రాత్మక పాత్ర గురించి తెలిసినవారిలో ఒకడిగా, ఈ వ్యవస్థలో భాగస్వామిని కావడం తనకు సంతోషంగా ఉందని తెలిపారు. అంకితభావంగల తన సహచరులతోపాటు పార్టీకి సేవ చేయడం కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు. నిబద్ధత కలిగిన లక్షలాది మంది కార్యకర్తలు లేకుండా తాము ఏదీ సాధించలేమన్నారు. కార్యకర్తలే పార్టీకి జీవనాధారమన్నారు. వారికి తాను శిరసు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. మరింత సమ్మిళితత్వం, ఆమోదయోగ్యమైన భారత దేశాన్ని కోరుకునే లెక్కలేనంత మంది భారతీయులు మన నుంచి అత్యుత్తమమైనదానిని పొందడానికి అర్హులని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Congress : సీడబ్ల్యూసీ పునర్వ్యవస్థీకరణ.. గాంధీలతో పాటు సచిన్, థరూర్‌లకు చోటు..
.
Updated Date - 2023-08-20T18:01:41+05:30 IST