Karnataka cow slaughter: గోవధపై కర్ణాటక మంత్రి వ్యాఖ్యలకు సిద్ధరామయ్య స్పందనిదే..!
ABN, First Publish Date - 2023-06-06T17:09:21+05:30
గోవధ నిషేధ చట్టాన్ని సమీక్షించాల్సి ఉందంటూ కర్ణాటక పశు సంవర్ధక శాఖ కె.వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ చేప్టటిన ఆందోళనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం స్పందించారు. మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాన్ని చర్చిస్తామని చెప్పారు. గత బీజేపీ ప్రభుత్వ తీసుకువచ్చిన చట్టంలో స్పష్టత లేదన్నారు.
బెంగళూరు: గోవధ నిషేధ చట్టాన్ని (Cow Slaughter Act) సమీక్షించాల్సి ఉందంటూ కర్ణాటక పశు సంవర్ధక శాఖ కె.వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ గత రెండ్రోజులుగా ఆందోళనలు సాగిస్తుండటంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) మంగళవారంనాడు స్పందించారు. మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాన్ని చర్చిస్తామని చెప్పారు. గత బీజేపీ ప్రభుత్వ తీసుకువచ్చిన చట్టంలో స్పష్టత లేదని, క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. అయితే, దీనిపై ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
మంత్రి వెంకటేష్ ఏమన్నారంటే..?
గత బిజేపీ ప్రభుత్వం గోహత్య నిరోధక, పశువుల సంరక్షణ బిల్లును 2021లో తీసుకువచ్చింది. ఈ బిల్లును ఇటీవలే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిపై మంత్రి వెంకటేష్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, పాడి పశువులే జీవనాధారమైన రైతులకు వయసు మళ్లిన పశువుల పోషణ భారమవుతుందని అన్నారు. గేదెలు, ఎద్దుల మాదిరిగానే పోషణ భారంగా మారిన గోవులను వధిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. దీనిపై తాము చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని అన్నారు. మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ గత రెండ్రోజులుగా నిరసలకు దిగింది
బొమ్మై ఖండన
గోవధ తప్పు కాదంటూ మంత్రి వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వరుస ట్వీట్లలో విమర్శలు గుప్పించారు. తన మంత్రివర్గ సహచరుడికి సిద్ధరామయ్య తగిన సలహాలివ్వాలని అన్నారు. మంత్రి వ్యాఖ్యలు దిగ్భ్రాంతి కలిగించేలా ఉన్నాయని, భారతీయులు గోవులను తల్లిగా పూజించి, ఆరాధిస్తుంటారని, ఇది వారి భావోద్వేగాలతో ముడిపడిన అంశమని అన్నారు. గోవధ నిషేధ బిల్లును రద్దు చేయాలనుకోవడానికి తగిన కారణాలేమీ కనిపించడం లేదని, హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ వెళ్తోందని, మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అనారోగ్యంతో బాధపడుతూ 13 ఏళ్లకు పైబడిన పశువులను మాత్రమే వధించాలంటూ కర్ణాటక పశువధ నిరోధక బిల్లు స్పష్టంగా చెబుతోంది.
Updated Date - 2023-06-06T18:12:26+05:30 IST