Tamil Nadu BJP : తమిళనాడులో బీజేపీ అభివృద్ధిపై కే అణ్ణామలై సంచలన వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-04-29T18:14:57+05:30
తమిళనాడులో బీజేపీని అభివృద్ధి చేయడం కోసం తన దూకుడు కొనసాగుతుందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కే అణ్ణామలై చెప్పారు.
చెన్నై : తమిళనాడులో బీజేపీని అభివృద్ధి చేయడం కోసం తన దూకుడు కొనసాగుతుందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కే అణ్ణామలై (K Annamalai) చెప్పారు. ఏఐఏడీఎంకే (AIADMK)తో పొత్తు 2026లో జరిగే శాసన సభ ఎన్నికల వరకు కొనసాగుతుందన్నారు. అయితే తమ పార్టీ ఇక ఎంత మాత్రం రాష్ట్రంలో జూనియర్ పార్టనర్‌గా ఉండబోదని తెలిపారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏఐఏడీఎంకే, బీజేపీ మధ్య విభేదాలు వచ్చాయని ప్రచారం జరుగుతున్న విషయాన్ని ప్రస్తావించినపుడు అణ్ణామలై మాట్లాడుతూ, తమిళనాడులో తమ పార్టీ (బీజేపీ) ఎదగాలని తమ పార్టీ అధినాయకత్వం స్పష్టంగా కోరుకుంటోందన్నారు. అందుకే క్షేత్ర స్థాయిలో ప్రతిధ్వనించే కొన్ని కార్యక్రమాలను నిర్వహించవలసి ఉంటుందని చెప్పారు. చాలా కాలం జూనియర్ భాగస్వామిగా కొనసాగడం బీజేపీ (BJP)కి ఎంత మాత్రం సాధ్యం కాదన్నారు. తాను చాలా కాలం నుంచి ఇదే విషయాన్ని చెప్తున్నానని తెలిపారు. నాలుగైదు స్థానాల్లో తాము పోటీ చేసి, ‘‘మీరు సీనియర్ పార్టీ’’ అని చెప్పలేమని తెలిపారు. ఎన్డీయే యథాతథంగా కొనసాగాలన్నదే లక్ష్యమని చెప్పారు.
తమిళనాడులో బీజేపీని అభివృద్ధి చేయడానికి తనకు పార్టీ అధినాయకత్వం మద్దతు ఉందని తెలిపారు. ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళనిస్వామి (Edappadi Palaniswamy)తో తనకు సత్సంబంధాలు ఉన్నాయన్నారు. ఒకరితో మరొకరికి సమస్యలేమీ లేవన్నారు. ఏఐఏడీఎంకే సంక్లిష్ట దశలో ఉందని పళనిస్వామికి స్పష్టంగా తెలుసునని చెప్పారు. ఏఐఏడీఎంకే గురించి ఆయనకు చాలా స్పష్టంగా తెలుసునన్నారు. తాను ఎన్నడూ ఎవరినీ రెచ్చగొట్టలేదని, ఇతరుల గురించి చెడుగా మాట్లాడలేదని చెప్పారు. బీజేపీ గేమ్ ప్లాన్ గురించి తనకు చాలా స్పష్టత ఉందన్నారు. తాను ఉన్నది ఇతర పార్టీలను విమర్శించడానికి కాదన్నారు. ఎవరైనా అలా అనుకుంటే, అందుకు తాను బాధ్యుడిని కానన్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) కుటుంబీకుల అవినీతిపై డీఎంకే ఫైల్స్ (#DMKFiles) కొనసాగుతాయని చెప్పారు. డీఎంకే చక్రవ్యూహాన్ని ఛేదించగలిగామని చెప్పారు. డీఎంకే కలవరపడుతోందన్నారు.
2011లో జరిగిన ఎన్నికల కోసం డీఎంకేకు రెండు బూటకపు కంపెనీల ద్వారా ముడుపులు అందినట్లు ఇటీవల అణ్ణామలై ఆరోపించిన సంగతి తెలిసిందే. రూ.200 కోట్ల ముడుపులను ఓ మల్టీనేషనల్ కంపెనీ సమకూర్చినట్లు ఆయన ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేయాలని సీబీఐకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఈ ఆరోపణలను డీఎంకే తోసిపుచ్చింది.
ఇవి కూడా చదవండి :
Mukhtar Ansari : ముక్తార్ అన్సారీకి పదేళ్ల జైలు శిక్ష
Karnataka Elections: నాకు లెక్కలు బాగా తెలుసు..141 సీట్లు గెలుస్తాం : డీకే
Updated Date - 2023-04-29T18:14:57+05:30 IST