Odisha train crash : ఒడిశా రైలు ప్రమాద స్థలానికి బయల్దేరిన తమిళనాడు మంత్రులు
ABN, First Publish Date - 2023-06-03T10:50:30+05:30
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో తమిళ బాధితులకు అండగా నిలిచేందుకు తమిళనాడు మంత్రులు శనివారం బయల్దేరారు.
చెన్నై : ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో తమిళ బాధితులకు అండగా నిలిచేందుకు తమిళనాడు మంత్రులు శనివారం బయల్దేరారు. మంత్రులు ఉదయనిధి స్టాలిన్, శివశంకర్, అంబిల్ మహేశ్ చెన్నై విమానాశ్రయం నుంచి బాలాసోర్ బయల్దేరారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెన్నైలోని రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ కేంద్రం నుంచి ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ శనివారం సంతాప దినంగా పాటించాలని తమిళనాడు, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. రైలు ప్రమాదంపై సమీక్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మీడియాతో మాట్లాడుతూ, మూడు రైళ్లు ప్రమాదానికి గురైన నేపథ్యంలో బాధితులను కాపాడేందుకు 7 ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు, 5 ఒడిశా విపత్తు రేపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలు, 24 ఫైర్ సర్వీస్ యూనిట్లు, స్థానిక పోలీసులు, వాలంటీర్లు రంగంలోకి దిగినట్లు తెలిపారు. వీరంతా అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని చెప్పారు. బోగీల్లోనూ, వాటి క్రింద చిక్కుకున్నవారిని బయటకు తీసుకొచ్చి, వైద్య సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. వ్యక్తుల మృతదేహాల వివరాలను గుర్తించినట్లయితే, వాటిని శవ పరీక్షల అనంతరం సంబంధిత బంధువులకు అప్పగిస్తున్నట్లు, లేదా, వారు వెళ్లవలసిన గమ్యస్థానాలకు పంపిస్తున్నట్లు తెలిపారు. మృతదేహాల వివరాలను గుర్తించలేనపుడు, చట్టపరమైన విధానాన్ని అనుసరిస్తామని చెప్పారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి స్థానికులు అన్ని విధాలుగా సహాయపడుతున్నారని చెప్పారు. రక్తదానం చేయడానికి స్వచ్ఛందంగా వస్తున్నారన్నారు. ఇది మంచి సంకేతమని చెప్పారు.
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంఘటన స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు గాయపడినవారికి రక్తదానం చేయడం కోసం ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సంఘటన స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ దుర్ఘటనలో బాధిత కుటుంబాలకు సహాయపడటం కోసం కర్ణాటకలోని యశ్వంత్‌పూర్ రైల్వే స్టేషన్‌లో హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు.
ప్రమాదంలో చిక్కుకున్న మూడు రైళ్లు
ఒడిశాలోని బాలాసోర్ జిల్లా, బహంగా బజార్ స్టేషన్ సమీపంలో శుక్రవారం సాయంత్రం 6.55 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఈ దారుణం జరిగింది. బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మొదట పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. ఈ రైలు బోగీలు పక్కనే ఉన్న పట్టాలపై పడ్డాయని, ఆ తర్వాత షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పి, బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌పై పడిందని, అంతేకాకుండా ఆ పక్కనే పార్క్ చేసి ఉన్న ఓ గూడ్స్ రైలుపై పడిందని తెలుస్తోంది. ఇదంతా కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే జరిగిందని చెప్తున్నారు. కోల్‌కతాకు దక్షిణ దిశలో 250 కిలోమీటర్ల దూరంలో, భువనేశ్వర్‌కు ఉత్తర దిశలో 170 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడానికి కారణాలేమిటో ఇంత వరకు తెలియడం లేదు.
మోదీ ప్రత్యేక సమావేశం
రైలు ప్రమాదంపై సమీక్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రైల్వే శాఖ సహాయ మంత్రి రావ్ సాహెబ్ పాటిల్ దాన్వే మీడియాతో మాట్లాడుతూ, బాలాసోర్ రైలు ప్రమాదం నేపథ్యంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రమాద స్థలానికి చేరుకుని, సహాయ కార్యక్రమాలను సమీక్షిస్తున్నారని చెప్పారు. ఎన్‌డీఆర్ఎఫ్, భారత సైన్యం సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థానిక అధికార యంత్రాంగం, రైల్వే అధికార యంత్రాంగం, స్థానికులు అన్ని విధాలుగా సహాయపడుతున్నారని చెప్పారు. గాయపడినవారిని, మృతదేహాలను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నట్లు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ప్రమాదానికి కారణాలను తెలుసుకునేందుకు రైల్వే యంత్రాంగం అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించిందన్నారు. ఇది మానవ తప్పిదమా? సాంకేతిక కారణాలు ఉన్నాయా? అనే అంశంపై దర్యాప్తు జరుగుతుందన్నారు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి జయంత్యుత్సవాల సందర్భంగా శనివారం తలపెట్టిన అన్ని కార్యక్రమాలను రద్దు చేసినట్లు డీఎంకే ఓ ప్రకటనలో తెలిపింది. బాలాసోర్ రైలు ప్రమాద మృతుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, వారి కుటుంబాలకు సంఘీభావంగా శనివారం సంతాప దినంగా పాటిస్తున్నట్లు తెలిపింది. కలైనార్ విగ్రహం, కలైనార్ స్మారక కేంద్రం వద్ద కేవలం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాత్రమే శ్రద్ధాంజలి ఘటిస్తారని తెలిపింది. బహిరంగ సభలు, ఇతర కార్యక్రమాలను రద్దు చేసినట్లు తెలిపింది.
ఇవి కూడా చదవండి :
Odisha Train Accidnt : రైలు ప్రమాదం కారణంగా నేడు, రేపు రద్దైన రైళ్లు ఏవంటే...
Updated Date - 2023-06-03T10:50:30+05:30 IST