Shatrughan Sinha: రాహుల్‌పై టీఎంసీ ఎంపీ శతృఘ్న సిన్హా ప్రశంసలతో కలకలం..
ABN, First Publish Date - 2023-01-08T21:56:50+05:30
2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాహుల్‌పై శతృఘ్న సిన్హా కురిపించిన ప్రశంసలు కలకలం రేపుతున్నాయి.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)పై సినీ నటుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శతృఘ్న సిన్హా (TMC MP Shatrughan Sinha ) ప్రశంసలు కురిపించారు. దేశం ఇప్పటివరకూ ఇలాంటి యాత్రను చూడలేదన్నారు. భారత్ జోడో యాత్ర విప్లవాత్మకమైందన్నారు. రాహుల్ గాంధీ వ్యక్తిత్వం జ్ఞానానికి ప్రతీకగా యువతరం భావిస్తోందని చెప్పారు. రాహుల్ లక్ష్యం మంచిదంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాహుల్‌పై శతృఘ్న సిన్హా కురిపించిన ప్రశంసలు కలకలం రేపుతున్నాయి. ఓ పక్క 2024 లోక్‌సభ ఎన్నికల్లో మమతా దీదీ విపక్షాల ప్రధాని అభ్యర్థి కావాలని యోచిస్తుంటే శతృఘ్న సిన్హా రాహుల్‌ను, ఆయన యాత్రను ప్రశంసించడం దుమారం రేపుతోంది. శతృఘ్న సిన్హా వ్యాఖ్యలు మమతను చికాకుపెట్టే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు.
ఇప్పటికే బీహార్ సీఎం నితీశ్ కుమార్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా విపక్షాల తరపున ప్రధాని అభ్యర్థిగా నిలవాలని తహతహలాడుతున్నారు. ఇంతలోనే టీఎంసీ ఎంపీ శతృఘ్న సిన్హా రాహుల్‌పై ప్రశంసలు కురిపించడం మమత వ్యూహాలకు బ్రేక్ వేసినట్లు అవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. అసలు శతృఘ్న సిన్హా అకస్మాత్తుగా రాహుల్‌పై ప్రశంసలు కురిపించడం ఎందుకనేది కూడా ప్రస్తుతానికి అంతుచిక్కడం లేదు. వాస్తవానికి దీదీ కాంగ్రెస్‌తో పొత్తుపై సుముఖంగా లేరు. అంతేకాదు 2024లో కాంగ్రెస్ నేతృత్వంలో పనిచేసే విషయంలోనూ ఆమె ఏనాడూ ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపించలేదు. ఇంతలో శతృఘ్న సిన్హా చేసిన వ్యాఖ్యలు పరిశీలకులను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి.
Updated Date - 2023-01-08T22:00:36+05:30 IST